సమీక్ష : దిల్ సే – దిల్ మిస్సయింది

సమీక్ష : దిల్ సే – దిల్ మిస్సయింది

Published on Jul 27, 2012 1:59 PM IST
విడుదల తేది : 27 జూలై 2012
123తెలుగు.కాం రేటింగ్: 2/5
దర్శకుడు : సిబి మలయిల్
నిర్మాత : కె కె రాధా మోహన్
సంగీత దర్శకుడు: బిజీ బాల్
తారాగణం : నిత్యా మీనన్, ఆసిఫ్ ఆలీ

“అలా మొదలైంది “,”ఇష్క్” వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన భామ నిత్యా మీనన్. “ఇష్క్” సినిమా ఘన విజయం సాదించాక ఈ భామ నటించిన మలయాళీ సినిమాలను తెలుగులోకి డబ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సినిమా కూడా అదే కోవలోకే వస్తుంది . నిత్యా మీనన్ మరియు ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలలో మలయాళంలో 2011లో వచ్చిన “వయోలిన్” అనే సినిమాని తెలుగులో “దిల్ సే” పేరుతో ఈరోజు విడుదల చేశారు. సిబి మలయాళీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని యస్ టీం పిక్చర్స్ బ్యానర్ మీద ఎం ఎల్ లక్ష్మి తెలుగులో విడుదల చేసారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు విడుదలయ్యింది. ఈ దిల్ సే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ చిత్ర కథ మొత్తం ఏంజల్ (నిత్యా మీనన్) మరియు తన ఇద్దరు బంధువులు ఏనీ (లక్ష్మి రామకృష్ణన్) మరియు మెర్సి (రీనా బషీర్) ల చుట్టూ తిరుగుతుంది. వీరు ముగ్గురు కొచ్చిన్ లో “రోజ్ విల్లా”లో ఉంటారు. రోజ్ విల్లాలో వీరు ముగ్గురు కేక్స్ తయారు చేస్తూ ఉంటారు. వారి చుట్టూ ఉన్న మగవాళ్ళ మూలాన వారికి అపాయం ఉండటం వారికి సమస్యలు రావడంతో పాటు గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల మూలాన ఏంజల్ మగవాళ్లంటే అసహ్యం పెంచుకుంటుంది. అభి (ఆసిఫ్ అలీ) ఉద్యోగం కోసం పల్లెటూరు నుండి సిటీకి వస్తాడు. అభి కూడా రోజ్ విల్లాలో ఉండటం మొదలు పెడతారు. మొదట్లో ఇది నచ్చని ఏంజల్ ఎలా అయిన అతన్ని తరిమేయాలని ప్రయత్నిస్తుంది . కాని తన మ్యూజిక్ తో ఏంజల్ ని ఆకట్టుకున్న అభి వారితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అలా సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కొన్ని మలుపుల తరువాత ఏంజల్ ప్రాణాపాయ స్థితిలో పడుతుంది. ఎంజల్ ని కాపాడుకోడానికి అభి ఏం చేశాడు చివరికి వారు ఇద్దరు కలిసారా లేదా అన్నదే క్లైమాక్స్.

ప్లస్ పాయింట్స్:

అభి పాత్రలో ఆసిఫ్ అలీ చాలా బాగా నటించాడు. ఏంజల్ పాత్రలో నిత్య తనదయిన శైలిలో నటించి ఆకట్టుకుంది. వీరు ఇద్దరి పాత్రలకు సహాయంగా నడిముడి వేణు, విజయ్ రాఘవన్, శ్రీజల్ రవి, లక్ష్మి రామకృష్ణన్, రీనా బషీర్ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

మైనస్:

కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమాలో తరువాత ఏమవుతుంది అన్న విషయం ప్రేక్షకుడికి అర్ధం అయిపోతుంది. కామెడి లేకపోవడం, ఎమోషనల్ సన్నివేశాలలో బలం లేకపోవడంతో దర్శకుడు చెప్పాలనుకున్నది ప్రేక్షకుడికి సరిగ్గా చేరలేదు. కొని సన్నివేశాలను చూస్తే నేపధ్య సంగీతంలో ఉన్నంత ఫీల్ సన్నివేశంలో లేదు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య రిలేషన్ సరిగా చూపించలేకపోయారు. ఫస్టాఫ్ పరవాలేదు అనిపించగా సెకండాఫ్ లో సబ్ ప్లాట్స్ ఎక్కువయిపోవడంతో ప్రేక్షకుడికి కథ మీద ఉన్న కనీస అవగాహన కోల్పోతాడు. స్క్రీన్ ప్లే పగడ్బందీగా లేకపోవటంతో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

ఈ కేటగిరిలో మొదటగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సన్నివేశంలో లేని అనుభూతిని సంగీతం ద్వారా మనకి కలిగేలా చేశారు. బిజీబాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తయితే ఆనంద్ రాజ్ అందించిన పాటలు మరో ఎత్తు. మనోజ్ పిళ్ళై అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్లస్. కొచ్చిన్ అందాలను బాగా చూపించారు. డబ్బింగ్ సినిమానే అయిన తెలుగు సాహిత్యం విషయంలో బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో “మిల మిలలా” మరియు “మనసు దోచే” పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దర్శకుడు సిబి మలయాళీ మలయాళంలో ఎన్నో మంచి సినిమాలు అందించారు. ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నా కూడా సినిమాకి కనీస అవసరమయిన కథ మీద మరియు కథనం మీద మరింత శ్రద్ద తీసుకొని ఉండాల్సింది.

తీర్పు:

దిల్ సే అనే టైటిల్ పెట్టి మనసుకి హత్తుకునేలా తీయవలిసిన సినిమాని కనీస జాగ్రతలు తీసుకోకపోవడంతో దిల్ మిస్సయింది. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. కొత్తదనం లేకపోవడంతో పాటు, దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకుడికి చేరలేదు. ఏముందని చూడాలి ఈ సినిమా అంటే మ్యూజిక్ బావుంది. ఆ మ్యూజిక్ కోసం థియేటర్ దాక వెళ్ళడం కంటే ఇంటర్నెట్లో వినొచ్చు.

123telugu.com Rating : 2/5

Reviewed by Ravi Teja

సంబంధిత సమాచారం

తాజా వార్తలు