విడుదల తేదీ : జూన్ 14, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : తాప్సీ, అనీష్ కురువిల్లా తదితరులు
దర్శకత్వం : అశ్విన్ శరవణన్
నిర్మాత : యస్. శశికాంత్
సంగీతం : రాన్ ఏతాన్ యోహన్
సినిమాటోగ్రఫర్ : వసంత్
ఎడిటర్ : రిచర్డ్ కెవిన్
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ “గేమ్ ఓవర్”. వీడియో గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
స్వప్న (తాప్సీ) వీడియో గేమింగ్ డెవలపర్. ఎక్కువగా ఇంటి నుండే పనిచేసే స్వప్న, తన గతంతో అలాగే మానసిక లోపంతో బాధ పడుతుంటుంది. అయితే ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా స్వప్న వేసుకున్న పచ్చబొట్టు ద్వారా ఆమె ఒంట్లోకి ఓ ఆత్మ ప్రవేశిస్తోంది. అప్పటికే మానసికంగా కొన్ని సమస్యలతో బాధ పడుతున్న స్వప్న విచిత్రమైన కలలతో అనుక్షణం భయపడుతూ ఉంటుంది. అయితే ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల తరువాత స్వప్న సమస్యల పరిష్కారానికి ఆమె ఒంట్లోని ఆత్మ ఎలాంటి సాయం చేసింది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు ? అసలు స్వప్నకి ఉన్న సమస్యలు ఏమిటి ? వాటి నుండి ఆమె ఎలా బయట పడింది ? మొత్తానికి స్వప్న తన అంతర్గత మరియు బాహ్య సమస్యల పై ఎలా పోరాడింది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే.. దర్శకుడు అశ్విన్ శరవణన్ రాసుకున్న స్క్రిప్టే. కథాకథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను అలాగే సస్సెన్స్ ను బాగా ఎలివేట్ చేస్తూ.. అశ్విన్ శరవణన్ అద్భుతంగా స్క్రిప్ట్ ను రాసుకున్నారు. కొన్నిసార్లు అయితే ఓ హర్రర్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తూనే ప్రతి సన్నివేశంలో సస్పెన్స్ ను బాగా చూపించాడు. అదేవిధంగా రెండవ భాగంలో స్క్రిప్ట్ కి సంబంధించి మంచి థ్రిల్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాలో స్వప్న అనే ఓ వీడియో గేమింగ్ డెవలపర్ పాత్రలో నటించన తాప్సీ తన పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఒక పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో మరియు తనకు వస్తోన్న కలలతో భయపడుతూ ఇలా ప్రతి సన్నివేశంలో తాప్సీ చక్కని నటనతో ఆకట్టుకుంది. పైగా అయోమయ పరిస్థితుల్లో.. ఆమె తన అభినయంతో మరింతగా ఉత్సుకతను పెంచుతూ సినిమాకే హైలెట్ గా నిలిచింది.
ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ కథనంలో ఆయన మెయింటైన్ చేసిన సప్సెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ క్రమంలో వచ్చే వివిధ మలుపులు చాలా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
దర్శకుడు అశ్విన్ శరవణన్ మంచి స్టోరీ ఐడియాతో ఇంట్రస్టింగ్ ప్లే రాసుకున్నప్పటికీ.. సినిమాలో కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, సినిమా రన్ టైమ్ తక్కువే అయినప్పటికీ, చాలాసేపు సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలగడం, ఇక సాధారణమైన ప్రేక్షకుడికి కథనం గందరగోళంగా అనిపించడం, బి.సి ప్రేక్షకులు ఆశించే అంశాలు సినిమాలో పెద్దగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.
ఇక సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. కొన్ని సీన్స్ బాగానే చిత్రీకరించినప్పటికి, కొంత వాస్తవానికి దూరంగా ఉండటం, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం కూడా.. సినిమాకి మైనస్ గా అనిపిస్తోంది.
సాంకేతిక విభాగం :
ఈ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణన్ ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. అలాగే వసంత్ కెమెరా పనితనం కూడా ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రాన్ ఏతాన్ యోహన్ అందించిన సంగీతం బాగుంది.
ముఖ్యంగా మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటర్ రిచర్డ్ కెవిన్ పనితరం కూడాఆకట్టుకుంటుంది. నిర్మాత యస్. శశికాంత్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో వీడియో గేమ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ కథాకథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను జోడించి అలాగే సస్సెన్స్ ను బాగా ఎలివేట్ చేస్తూ.. సినిమాను చక్కగా మలిచారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ స్లోగా సాగడం, పైగా సాధారణమైన ప్రేక్షకుడికి కథనం గందరగోళంగా అనిపించడం, మరియు కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటి డ్రా బ్యాగ్స్ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కాగా, ఓవరాల్ గా భిన్నమైన చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. కానీ బి.సి వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రం పై ఎంతమేరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team