సమీక్ష : ఆమె – అమలా బాగా థ్రిల్ చేస్తుంది.

సమీక్ష : ఆమె – అమలా బాగా థ్రిల్ చేస్తుంది.

Published on Jul 21, 2019 3:01 AM IST
Aame movie review

విడుదల తేదీ : జూలై 18, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  3/5

నటీనటులు : అమ‌లా పాల్,రమ్య సుబ్రహ్మణ్యం,శ్రీరంజని,వివేక్ ప్రసన్న

దర్శకత్వం : ర‌త్నకుమార్

నిర్మాత‌లు : రాంబాబు క‌ల్లూరి, విజ‌య్ మోర‌వెనేని

సంగీతం : ప‌్ర‌దీప్ కుమార్, ఊర్క‌

సినిమాటోగ్రఫర్ : విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్

 

అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం “ఆడై” తెలుగులో “ఆమె”గా నేడు విడుదలైంది . దర్శకుడు రత్న కుమార్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగులో విడుదల చేశారు . టీజర్ ,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు తెలుగులో కూడా మంచి ప్రచారం దక్కింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలు ఎంత వరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.

 

కథ:

 

ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కొరకు ప్రాంక్ వీడియోలు చేసే కామిని(అమలా పాల్) స్వతంత్ర భావాలు కలిగిన ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. కొన్ని కారణాలతో వారి ఆఫీస్ వేరే చోటికి మార్చాలని మేనేజ్మెంట్ నిర్ణయించడం జరుగుతుంది. కామిని ఆమె మిత్రులు కొందరు ఆ పాత ఆఫీస్ ని విడచిపోతున్నాం కనుక అక్కడ పార్టీ చేసుకోవాలని భావిస్తారు. ఆరాత్రి పార్టీ లో పాల్గొన్న కామిని తెల్లారేసరికి బట్టలు లేకుండా ఒంటరిగా ఆ బిల్డింగ్ లో పడి ఉంటుంది. అసలు కామిని ఆ పరిస్థితిలో ఎందుకు ఉంది, ఆ రాత్రి ఏమి జరిగింది, ఆమె ఈ దయనీయ పరిస్థితికి కారణం ఎవరు, ఆ క్రిటికల్ కండీషన్స్ నుండి కామిని ఎలా బయటపడింది అనేది తెరపైన చూడాలి.

 

ప్లస్ పాయింట్స్:

 

కథ చాలా కొత్తగా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అనుభూతి కలుగుతుంది. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో చేయడానికి అమలా పాల్ ఒప్పుకున్నందుకు ఆమె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఆమె నగ్నంగా నటించారు. పూర్తిగా బట్టలు లేకున్నా ఆమె నటనపై చూపించిన శ్రద్ద అభినందనీయం. ఉత్కంట కలిగే సన్నివేశాల్లో ఆమె నటన,సన్నివేశానికి తగ్గట్టుగా ఉన్న ఆమె బాడీ లాంగ్వేజ్ అద్భుతం అని చెప్పాలి.

అలాగే ఇంటర్వెల్ సన్నివేశం డైరెక్టర్ చాలా బాగా రాసుకున్నారు, సెకండ్ హాఫ్ పై ఆసక్తిరేపేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా ఉత్కంట రేపే సన్నివేశాలతో సస్పెన్సు కొనసాగిస్తూ ఆసక్తికరంగా సాగింది. నగ్నంగా ఉన్న అమలా పాల్ ఆ భవనం నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారు. అలాగే యాంకర్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన రమ్య తన పాత్ర పరిధిలో చక్కగా నటించారు.

అలాగే సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు కూడా దర్శకుడు బాగా తీశారు. స్త్రీ స్వాతంత్ర్యానికి ఉన్న హద్దులు చక్కగా చెప్పడం జరిగింది. ఇక సినిమా క్లైమాక్స్ ద్వారా దర్శకుడు చెప్పిన సోషల్ మెసేజ్ కథకు తగ్గట్టుగా కుదిరింది. సినిమా ఎండింగ్ ఎమోషనల్ గా మరియు ఆలోచింపజేసేదిగా ఉంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ మూవీ ప్రధాన బలహీనత ఫస్ట్ హాఫ్ మరియు సినిమా నిడివి. కథలో అసలు పాయింట్ కి రావడనికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అమలా పాల్ పాత్ర తీరును తెలియచేయడానికి అన్ని సన్నివేశాలు అవసరం లేదనిపించింది.

ఒక థ్రిల్లర్ సినిమాకి మూవీ నిడివి తక్కువ ఉంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి సగంలో కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గిస్తే బాగుండేది. ఇక సినిమాలో అమలా పాల్ మినహా మనకు తెలిసిన ముఖాలు చాలా తక్కువ,ఇదికూడా సినిమాకు ఒక మైనస్ పాయింట్ అనిచెప్పవచ్చు.

 

సాంకేతిక విభాగం:

 

కెమెరా మెన్ విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ చాలా బాగుంది, నగ్నంగా ఉన్న అమలా పాల్ ని చూపించే క్రమంలో ఎక్కడా వల్గారిటీకి తావు లేకుండా కన్విన్సింగ్ గా చిత్రీకరించడంలో ఆయన విజయ సాధించారనే చెప్పాలి. ప్రదీప్ అందించిన బీజీఎమ్ పర్వాలేదన్నట్లుగా ఉంది,ఆయన మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చివుంటే సినిమాకు ఇంకొంత అనుకూలత యాడ్ అయ్యేది. పాత్రలకు తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. కథ వాస్తవానికి దగ్గరగా,నమ్మేవిధంగా తీయడంలో దర్శకుడు విజయం సాధించాడు. మొదటి సగంలో ఎడిటింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయినా, సెకండ్ హాఫ్ లో మంచి ప్రతిభ కనపరిచారు.

ఇక డైరెక్టర్ రత్న కుమార్ ఆయన చేసిన నూతన ప్రయోగానికి మెచ్చుకోకుండా ఉండలేం. కేవలం అమలా పాల్ ఒక్క పాత్రతో సెకండ్ హాఫ్ మొత్తం ఆయన నడిపించిన తీరు అద్భుతం అనిచెప్పాలి. వైవిధ్యమైన కథకు ఆయన భావోద్వేగం జోడించి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. కానీ మొదటి సగంలో మాత్రం ఆయన ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టాడు.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలంటే ఆమె సినిమా ఇప్పటికి సౌత్ సినీపరిశ్రమలోనే చేయని ఓ గొప్ప సాహసంగా చెప్పవచ్చు. అమలా పాల్ తన అద్భుత నటనతో, సింగిల్ గా మూవీని ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారు. కమర్షియల్ అంశాలు అంతగా లేకపోయినా ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ప్రేక్షకుడికి కావలసిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. కానీ అద్భుతంగా ఉండే సెకండ్ హాఫ్ కొరకు, పరీక్షపెట్టే మొదటి సగాన్ని సహనంగా చూడాలి. అది కనుక మీరు చేయగలిగితే ఈ మూవీని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.

123telugu.com Rating :   3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు