సమీక్ష : కథనం – రొటీన్ రివేంజ్ డ్రామా

సమీక్ష : కథనం – రొటీన్ రివేంజ్ డ్రామా

Published on Aug 9, 2019 11:53 PM IST
Kathanam movie review

విడుదల తేదీ : ఆగస్టు 09, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అనసూయ,శ్రీనివాస్ అవసరాల, ధన్ రాజ్, వెన్నెల కిషోర్,రణధీర్ తదితరులు.

దర్శకత్వం : రాజేష్ నాదెండ్ల

స్క్రీన్ ప్లే: రాజేంద్ర భరద్వాజ్

నిర్మాత‌లు : బి.నరేంద్రా రెడ్డి, శర్మ చుక్కా

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల

ఎడిటర్ : ఎస్ బి ఉద్దవ్

రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ “కథనం”. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

అను(అనసూయ) ఓ మూవీ డైరెక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో నిర్మాత కోరిక మేరకు ఆమె ఓ క్రైమ్ స్టోరీ రాయడం జరుగుతుంది. అయితే ఆమె రాసిన కథలో పోలిన పాత్రలు.. నిజజీవితంలో నిజంగానే హత్యకు గురవుతూ ఉంటాయి. దీనితో ఆ హత్యల వెనుకగల అసలు రహస్యం తెలుసుకోవాలని అను, పోలీస్ ఆఫీసర్ రణధీర్ ని కలవడం జరుగుతుంది. ఆసక్తికరమైన రణధీర్ విచారణలో ఆయనకు నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఏమిటా నిజాలు ?, అసలు ఆ హత్యల వెనుక ఎవరున్నారు ?, ఆ హత్యలకు అనుకు ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన అనసూయ రెండు విభిన్న పాత్రల్లో నటించి సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మూవీ దర్శకురాలు కావాలనే లక్ష్యంగల మోడ్రన్ అమ్మాయిగా, అలాగే గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో సాంప్రదాయ బద్దమైన ఆమ్మాయిగా ఇలా రెండు పాత్రలను చాల చక్కగా పోషించింది.

ఇక విరామానికి ముందు వచ్చే ఆసక్తి రేగేలా కథలో ట్విస్ట్ చక్కగా కుదిరింది. ఇంటర్వెల్ సన్నివేశం రెండవ భాగం పై ఆసక్తికలిగేలా చేయడంలో విజయం సాధించింది. ఇక స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ చాలా సన్నివేశాల్లో నవ్వులు పంచడంతో సినిమాలో మంచి ఫన్ కూడా వర్కౌట్ అయింది.అలాగే మరో కమెడియన్ ధన్ రాజ్ కూడా తన టైమింగ్ తో, తన కామిక్ హావభావాలతో కొన్ని సన్నివేశాల్లో బాగా నవ్విస్తారు. చాల రోజుల తరువాత ధన్ రాజ్ కి మంచి పాత్ర పడింది. మొత్తానికి ధన్ రాజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చాలా కాలం తరువాత మంచి పాత్ర చేసే అవకాశం దక్కించుకున్న రణధీర్ ఆకట్టుకున్నారు. వరుస హత్యల వెనుక అసలు కారణాలు తెలుసుకొనే పోలీస్ అధికారి పాత్రలో ఆయన చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ మూవీలో సస్పెన్సు చివరివరకు దర్శకుడు కొనసాగించినప్పటికీ, సన్నివేశాలను దర్శకుడు తెర పై ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకోదు. అయితే ఈ చిత్రానికి ప్రధాన బలం సెకండ్ హాఫ్, మొదటి సగం సో సో గానే నడుస్తోంది. పైగా కీలక సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి.

సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు పెట్టడానికి ఇంకా స్కోప్ ఉన్నప్పటికీ ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో.. కానీ దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాను మలచలేకపోయింది. దానికి తోడు సీరియ‌స్ గా సాగే ఈ సినిమాలో బిసి ప్రేక్షకుల ఆశించే ఆశించే సాంగ్స్, గ్లామర్ డోస్ లేకపోవడం కూడా కథనం ఫలితాన్ని దెబ్బ తీసింది.

ఇక చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేసిన వారిలో ఏ ఒక్కరి పాత్ర బలంగా తెరపై చూపించలేదు. సీనియర్ ఆక్టర్ పృధ్వి రాజ్, శ్రీనివాస్ అవసరాలను సరిగా ఉపయోగించుకోలేకపోవడం, సినిమా ఇంట్రస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకు మైనస్‌ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం:

దర్శకుడు కథనం చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడంలో కొంత వరకు విజయం సాధించాడని చెప్పొచ్చు. ఆసక్తికర మలుపులతో రాసిన కథ, కథనం ఆకట్టుకుంటాయి. ఐతే రెగ్యులర్ రివేంజ్ డ్రామాను విభిన్నమైన రీతిలో చెప్పడం జరిగింది. సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని డైలాగ్ లు సందర్భానుసారంగా చక్కగా పేలాయి.

ఇక ఉద్దవ్ అందించిన స్క్రీన్ ప్లే, సతీష్ ముత్యాల కెమెరా పనితనం బాగున్నాయి. కీలక సన్నివేశాలలో మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక నిర్మాణ విలువ కూడా బాగున్నాయి.

తీర్పు:

ఇంతకుముందే చెప్పుకున్నట్లు ‘కథనం’ చిత్రం అక్కడక్కడా ఆకట్టుకునే రివేంజ్ డ్రామాగా అనిపిస్తోంది. సినిమాలో అనసూయ నటనతో పాటు పతాక సన్నివేశాల వరకు కొనసాగే సస్పెన్స్ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి. ఐతే మూవీలో అసలు ట్విస్ట్ బయటపడ్డాక వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల ఊహకు అందుతూ ఆసక్తికోల్పోయేలా నడుస్తాయి. పైగా దర్శకుడు చాల సన్నివేశాలను తెర పై ఆవిష్కరించిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఓవరాల్ గా సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని సరదగా ఓ సారి చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు