విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : NA | ||
దర్శకుడు : రాఘవ లారెన్స్ | ||
నిర్మాత : జే. భఘవాన్, జే. పుల్లా రావు | ||
సంగీతం: రాఘవ లారెన్స్ | ||
నటీనటులు : ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్, కృష్ణం రాజు |
ఆరడుగుల మాస్ హీరో ప్రభాస్ చివరి రెండు సినిమాలు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రెండు క్లాస్ సినిమాలే. చత్రపతి తరువాత సరైన మాస్ సినిమా లేని ప్రభాస్ మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ లారెన్స్ కలిసి చేసిన సినిమా రెబల్. ప్రభాస్ కి జోడీగా తమన్నా, దీక్ష సేథ్ నటించిన ఈ సినిమాకి కథ, కథనం, సంగీతం, నృత్య దర్శకత్వం, దర్శకత్వం అన్ని విభాగాల్ని లారెన్స్ నిర్వహించాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉండి ఎట్టకేలకు ఈ రోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ రెబల్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ :
రిషి (ప్రభాస్) స్టీఫెన్ – రాబర్ట్ (??) కోసం వెతుకుతూ హైదరాబాదుకి వస్తాడు. వాళ్ళని వెతకడంలో నసరాజు (బ్రహ్మానందం) సహాయం తీసుకుంటాడు. బ్యాంకాక్లో ఉన్న నందిని (తమన్నా) ద్వారా స్టీఫెన్ – రాబర్ట్ లని పట్టుకోవచ్చు అని తెలుసుకొని నసరాజుని తీసుకుని బ్యాంకాక్ వెళ్తాడు రిషి. నందిని ప్రేమించినట్లు నటించి స్టీఫెన్ – రాబర్ట్ ఆచూకి సంపాదిస్తాడు. అసలు రిషికి స్టీఫెన్ – రాబర్ట్ లకి సంబంధం ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే డాన్ అయిన భూపతి (కృష్ణంరాజు) సొంత తమ్ముడి కొడుకు తప్పు చేసినా శిక్షించే ప్రజల కోసం న్యాయం చేస్తాడు. తన కొడుకు రిషి (ప్రభాస్) ని మాత్రం గొడవలకు దూరంగా పద్దతిగా పెంచాలనుకుంటాడు. రిషి మాత్రం తన తండ్రి లాగే డాన్ అవ్వాలనుకుంటాడు. భూపతి శత్రువుల్లో ఒకడైన సింహాద్రి (ప్రదీప్ రావత్) భూపతిని చంపాలని ప్లాన్ చేస్తాడు. రిషి తండ్రిని కాపాడుకున్నాడా లేదా? మరి స్టీఫెన్ – రాబర్ట్ ఎవరు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ మాచో లుక్ తో బావున్నాడు. రిషి, రెబల్ అనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరించాడు. రెబల్ పాత్రలో మాస్ అప్పీల్ తో ఇంటర్వెల్ ముందు సన్నివేశాల్లో బాగా అలరించాడు. ప్రభాస్ లో ఉన్న ఎప్పుడు చూడని కొత్త కోణం డాన్సుని ఈ సినిమాలో చూపించాడు. కేక, ఓరినాయనో పాటల్లో డాన్సులు అదరగొట్టాడు. కృష్ణంరాజు పవర్ఫుల్ డాన్ గా భూపతి పాత్రలో నటించాడు. నందిని పాత్రలో తమన్నా అందాల ఆరబోత విషయంలో ఎక్కడా తగ్గలేదు. డాన్సుల విషయంలో కూడా అల్లాడించింది. దీపాలిగా దీక్ష సేథ్ చిన్న పాత్రే అయినప్పటికీ తన పాత్ర పరిది మేరకు పర్వాలేదనిపించింది. బ్రహ్మానందం ఒకటి రెండు సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేసాడు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే రెండు ఫైట్స్ కూడా బావున్నాయి. నిర్మాతలు భగవాన్, పుల్లా రావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమా అంతా భారీగా తీసారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో మెయిన్ మైనస్ పాయింట్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమా నిడివి గురించి. సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలు ఉన్నప్పుడు కంటెంట్ బలంగా ఉండాలి. సినిమా కథ అంతా సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చెబుతున్నపుడు ఫస్టాఫ్ లో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంటేనే ప్రేక్షకుడు సీట్లో కూర్చుంటాడు. బ్రహ్మి, కోవై సరళ మీద సోది కామెడీ ట్రాక్ నడిపిన దర్శకుడు ఆ కామెడీ ట్రాక్ లెంగ్త్ తగ్గించినా బావుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అలీ కామెడీ సీన్ కొంత నవ్వించినా ఆ సీన్ కూడా లెంగ్త్ తగ్గించలేదు. లారెన్స్ డైరెక్షన్లో గతంలో వచ్చిన మాస్, డాన్ సినిమాలని పోలిన కథతో రెబల్ కథని సిద్ధం చేసుకున్నాడు. లారెన్స్ కథ, కథనం కంటే ఫైట్స్ ఇత్యాది అంశాల మీదే ఎక్కువ కేర్ తీసుకున్నాడు. ఇంటర్వెల్ ముందు ఫైట్స్ బావున్నప్పటికీ 30 మంది రష్యన్ ఫైట్ మాస్టర్స్ తో చేయించిన క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకోలేదు.
సాంకేతిక విభాగం :
సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా నిడివి విషయంలో ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ 20 నిమిషాలు కత్తెర వేస్తే బావుంటుంది. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు ఇంటర్వెల్ ముందు ఫైట్స్ బావున్నాయి. మిగతావి అన్ని ఫైట్స్ లో వైర్ వర్క్ ఎక్కువైంది. లారెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా కేక, ఓరినాయనో పాటల విషయంలో సక్సెస్ అయితే, కొరియోగ్రాఫర్ గా అన్ని పాటల్లోనూ అదరగొట్టాడు. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం కొంత నిరాశ పరిచాడు.
తీర్పు :
ప్రభాస్ కెరీర్లోనే అత్యదిక బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన రెబల్ మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసుకొని తీసారు. మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన లారెన్స్ కథ, కథనం విషయంలో తడబడ్డాడు. ప్రభాస్ పెర్ఫార్మెన్స్, తమన్నా గ్లామర్, డాన్స్ ప్లస్ కాగా సినిమా నిడివి కొంత తగ్గిస్తే బావుంటుంది.
123తెలుగు.కాం రేటింగ్ : NA (రెబల్ చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రెబల్ చిత్రం బావుంది చూసి ఎంజాయ్ చేయండి.)
అశోక్ రెడ్డి. ఎమ్
Click Here For ‘Rebel’ English Review