సమీక్ష : బస్ స్టాప్ – అడల్ట్ కామెడీ విత్ మెసేజ్

సమీక్ష : బస్ స్టాప్ – అడల్ట్ కామెడీ విత్ మెసేజ్

Published on Nov 11, 2012 9:00 PM IST
విడుదల తేదీ: 10 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : మారుతి
నిర్మాత : బెల్లంకొండ సురేష్
సంగీతం : జే.బీ
నటీనటులు : ప్రిన్స్, శ్రీ దివ్య

ఈ రోజుల్లో సినిమాతో యువతని టార్గెట్ చేసి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి రెండవ సినిమా ‘బస్ స్టాప్’ మన ముందుకి వచ్చాడు. మొదటగా అనుకున్న తేదీ కంటే ముందుకి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. నీకు నాకు డాష్ డాష్ ఫేం ప్రిన్స్ హీరో కాగా మనసారా ఫేం శ్రీ దివ్య హీరోయిన్. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని నిర్మించగా మిగతా సాంకేతిక వర్గం అంతా ఈ రోజుల్లో సినిమాకి పనిచేసిన వారే. బస్ స్టాప్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

నేటి యువత ఎలా ఉన్నారు, వారు ప్రేమలో పడితే తలి తండ్రులు ఎలా రియాక్ట్ అవుతున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు కూడా తల్లితండ్రుల్ని అర్ధం చేసుకోవాలి అని చెప్పే ప్రయత్నం బస్ స్టాప్ రొటీన్ కథ. శ్రీను (ప్రిన్స్) శైలజ (శ్రీదివ్య) స్కూల్ ఫ్రెండ్స్ కాలేజీ టైంకి ప్రేమలో పడతారు. వీరు కాకుండా సాయికుమార్ పంపన, కన్నా, అభి, హాసిక అంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ ప్రేమలు, విడిపోవడాలు, ఈ కుర్ర బ్యాచ్ కి, వారి తల్లి తండ్రులకి మధ్య ఘర్షణ చివరికి తల్లితండ్రులు గెలిచారా? వారి పిల్లలు గెలిచారా? ఎవరు గెలిచారు అన్నది బస్ స్టాప్ కథ.

ప్లస్ పాయింట్స్:

ప్రిన్స్ నటనలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాడు. నార్మల్ సీన్స్ వరకు మేనేజ్ చేయగలుగుతున్నాడు, ఎమోషనల్ స్సీన్స్ ఇంకాస్త బెటర్ గా చేసుంటే బావుంటుంది. శ్రీ దివ్య చూడడానికి బావుంది. నటన పరంగా పర్వాలేదు. మిగతా వారిలో సాయికుమార్ పంపన కామెడీ బాగా పండించాడు. అతని కామెడీ టైమింగ్ బాగా పండింది. హాసిక, కన్నా ఇద్దరు పర్వాలేదు. రావు రమేష్ ఒక సీన్లో ఓవర్ యాక్షన్ చేసాడు కానీ తల్లితండ్రులకి, వారి పిల్లలకి మధ్య వారధి లాంటి మంచి పాత్ర చేసారు. శైలజ తండ్రిగా చేసిన కోటేశ్వర రావు మంచి ఎమోషన్ పండించారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి 30 నిముషాలు మంచి ఎంటర్టైనింగ్ గా, చివరి 30 నిముషాలు ఎమోషనల్ గా చాలా బావుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయికుమార్ పంపన, శైలజ తల్లితండ్రులని అర్ధం చేసుకునే సన్నివేశాలు బాగా పండాయి. కలలకే కనులోచ్చిన, రెక్కలొచ్చిన పాటల చిత్రీకరణ చాలా బావుంది.

మైనస్ పాయింట్స్ :

యువతని టార్గెట్ చేసి షుగర్ కోటెడ్ లాగా పెట్టిన డబుల్ మీనింగ్ డైలాగులు చాలా వరకు మోతాదు శృతి మించాయి. అందులో కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుంటే కూతురి పుట్టినరోజుకి తండ్రి హెచ్.పి లాప్ టాప్ ఇచ్చే సీన్స్, హాసిక బాత్రూంలో తన బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ సీన్స్, కొడుకు సెల్ ఫోన్, సిమ్ కార్డు సీన్స్ ఎబ్బెట్టుగా చూపించారు. కాకపోతే ఇవన్ని సెలెక్టెడ్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసి పెట్టారు. ఇంటర్వెల్ ముందు సీన్ ఇంకాస్త ఎమోషనల్ గా ఉంటే బావుండేది. సెకండాఫ్ మొదలైన తరువాత ఒక 20 నిమషాలు కథ ముందుకి సాగకుండా స్లోగా డ్రాగ్ చేసారు. రావు రమేష్ తన కూతురిని నమ్మి ఆమెకి నచ్చిన బాయ్ ఫ్రెండ్ తో ఐ లవ్ యు చెప్పించే సీన్స్ అన్ని వాస్తవానికి దూరంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

ఈ రోజుల్లో సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన జేబీ సంగీతంలో కలలకే కనులోచ్చిన, రెక్కలొచ్చిన ఈ రెండు పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం విషయానికి వస్తే మొదటి సినిమా ఈ రోజుల్లో స్థాయిలో కాకపోయినా ఓకే. 5డి కెమెరాతో చేసిన సినిమాటోగ్రఫీ కూడా సేమ్ టు సేమ్ ఈ రోజుల్లో స్థాయిలో కాకపోయినా క్వాలిటీ పరంగా కొంత తగ్గింది. ఎడిటింగ్ విషయానికి వస్తే కన్నా మరియు అతని తండ్రి మధ్య సన్నివేశాలకు కత్తెర వేస్తే బావుండేది. ఇక డైలాగుల విషయానికి అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే ఉన్నాయి.

తీర్పు:

ప్రేమ వల్ల తల్లితండ్రులకి, వారి పిల్లలకి మధ్య ఏర్పడుతున్న అగాధాన్ని చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సెలెక్టెడ్ టార్గెట్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఈ రోజుల్లో తరహాలో దర్శకుడు మరో అడల్ట్ కామెడీ తీసి దానికి మెసేజ్ జత చేసాడు. సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగుల లాగా ఒక బూతు డైలాగ్ అర్ధంయ్యేలోపే మరో బూతు డైలాగ్ పడిపోతుంది. యువతని మళ్లీ మళ్లీ థియేటర్ కి రప్పించడానికి తోడ్పడుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ – 3.25/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Bus Stop’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు