విడుదల తేదీ : నవంబర్ 22, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : డా. రాజేంద్రప్రసాద్, విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా, శ్రీనివాస్ తదితరులు.
దర్శకత్వం : విశ్వనాథ్ మాగంటి
నిర్మాతలు : దుర్గాప్రసాద్ మాగంటి
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : సతీష్ ముత్యాల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డా. రాజేంద్రప్రసాద్ నటించిన కుటుంబ కథా చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) తన గ్రామంలోనే అందరీ మంచి కోరుకునే సుప్రసిద్ధమైన పెద్ద మనిషి. అయితే సోమరాజుకు తన మనవరాలు వర్ష (హర్షిత) మరియు తన మనవడు రిషి (విశ్వంత్) పెళ్లి చేసుకోవాలని.. అలాగే తన పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. జీవితంలో ఆయన బలంగా కోరుకున్న చివరి కోరిక. సోమరాజు తన కోరికను నెరవేర్చుకునే క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అకస్మాత్తుగా సోమరాజు చనిపోతాడు. అయినప్పటికీ ఆ తరువాత మళ్లీ ఒక ఆత్మగా తిరిగి వస్తాడు. కానీ అప్పటికే తన పిల్లల ఆస్తి పై గొడవలు పడుతుంటారు. అలా వారి నిజస్వరూపాలు చూస్తాడు సోమరాజు. అవి చూస్తూ సోమరాజు ఎలాంటి బాధ పడ్డాడు ? తిరిగి తన పిల్లలను ఎలా మార్చాలకున్నాడు ? దాని కోసం ఏమి చేశాడు ? ఎవరి సహాయం తీసుకున్నాడు ? చివరికీ సోమరాజూ పిలల్లు మారారా ? లేదా ?
ప్లస్ పాయింట్స్ :
ఒక కుటుంబంలోని మూడు తరాల పెద్దగా పిల్లల సంతోషమే తన చివరి కోరికగా నిలిచే ప్రధాన పాత్ర ‘సోమరాజు’ పాత్ర మనకు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. ఆ వయసు గల ప్రతి వ్యక్తికీ సోమరాజు పాత్ర కనెక్ట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న విషయాలకే కుంటుంబాల మధ్య ఏర్పడే అపోహలను అపార్థాలను దర్శకుడు చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో కుటుంబ భావోద్వేగాలు బాగున్నాయి. నేటి తరం డబ్బు కోసం వారి అవసరాల కోసం ఎలా మారతారు అనే కోణాన్ని కూడా బాగా చూపించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ మరియు అతని పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి.
నటన విషయానికి వస్తే.. రాజేంద్ర ప్రసాద్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో మరోసారి మంచి పాత్రలో కనిపించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని ఆయన తన హావభావాలతోనే పలికించే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన పాత్ర వెన్నెలా కిషోర్ ది. సినిమా మొత్తం కనిపించే వెన్నెల కిషోర్ తన టైమింగ్ తో బాగానే నవ్వించాడు. దేవీ ప్రసాద్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో బాగా నటించారు.
హీరోగా కనిపించిన విశ్వంత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే హీరోయిన్ గా హర్షిత కూడా చాలా బాగా నటించింది. ధన్ రాజ్ కూడా మంచి పాత్రను పోషించాడు. ఇక నర్రా, శ్రీనివాస్ అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని, మరియు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను గుర్తు చేయాలని దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథాకథనాలు ఆసక్తికరంగా సాగవు. ఈ కాలానికి ఇంట్రస్ట్ కలిగించలేని పాతకాలపు ట్రీట్మెంట్ తో అదే ప్లేతో సినిమా స్లోగా సాగుతూ బోర్ కొడుతొంది.
ముఖ్యంగా సెటప్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అన్నీ పక్కా రొటీన్ గానే సాగుతాయి. ఇక హీరోహీరోయిన్ల యొక్క ఫ్లాష్‌బ్యాక్, ఆ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలు అనవసరం. పోనీ, అవి ఉన్నా ఇంట్రస్ట్ గా ఉన్నాయంటే అదీ లేదు. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన కామెడీ (పెద్దగా నవ్వు రాని) సన్నివేశాలను జోడించి సినిమాను ట్రాక్ తప్పించాడు.
పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. ఆ సీన్స్ కూడా బోర్ గా సాగడం.. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. కనీసం సెకెండ్ హాఫ్ లో చాల సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. విశ్వనాథ్ మాగంటి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు. అలాగే ఆయన తీసుకున్న స్క్రిప్ట్ పై కూడా బాగా వర్క్ చెయ్యాల్సింది. చాల ల్యాగ్ సీన్స్ తగ్గేవి. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తోంది.
ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాల వరకు బోర్ తగ్గేది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని పెల్లెటూరు విజువల్స్ ను ఆయన చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఇక నిర్మాత దుర్గాప్రసాద్ మాగంటి పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
‘తోలుబొమ్మలాట’ అంటూ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ను గుర్తుచేసే కథాంశంతో సాగిన ఈ చిత్రం.. కొన్ని కుటుంబ భావోద్వేగాలతో అలాగే వెన్నెల కిషోర్ తన కామెడీతో ఆకట్టుకునప్పటికీ.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించడంలో విఫలం అయింది. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని ప్రేమ సన్నివేశాలు మరియు బలమైన సంఘర్షణ లేని ఫ్యామిలీ సీన్స్ మరియు రొటీన్ డ్రామా.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆకట్టుకోదు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team