విడుదల తేదీ : నవంబర్ 29, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : సీనియర్ నరేష్, తనికెళ్ళ భరణి, మహర్షి రాఘవ తదితరులు
దర్శకత్వం : బాబ్జి
నిర్మాతలు : మండవ సతీష్ బాబు
సంగీతం : శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫర్ : కిషన్ సాగర్
ఎడిటర్: జానకి రామారావు పి
తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత కథ ఆధారంగా సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్య నాయుడు’. దర్శకుడు బాబ్జి తెరకెక్కించగా మండవ సతీష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
రఘుపతి వెంకయ్య నాయుడు (నరేష్) చిన్నప్పటి నుండి చదువు కంటే కూడా కళలు పట్లే ఎక్కువ ఆసక్తిగా ఉంటాడు. ఆ ఆసక్తితోనే తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి మద్రాస్ వస్తాడు. అక్కడ ఎన్నో కష్టాలు పడిన వెంకయ్య ఎట్టకేలకూ ఫోటోలు తీయడం నేర్చుకుని మంచి స్థాయికి వస్తాడు. ఆ క్రమంలోనే ఓ న్యూస్ పేపర్ లో ‘క్రోమో మెగాఫోను’ గురించి చదివి.. ఎలాగైనా దాన్ని కొనాలని తపించిపోయి.. చివరికి దాన్ని విదేశాలనుండి తెప్పించుకొని ప్రదర్శించడం ఆరంభిస్తాడు. అలాగే టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ సినిమాలను జనాలకు ఇంకా దగ్గర చేస్తాడు. అది నచ్చని బ్రిటిష్ అధికారులు వెంకయ్యను సినిమాలకి దూరం చేయడం కోసం అనేక కుట్రలు పన్నుతారు. ఆ కుట్రల వల్ల వెంకయ్య నాయుడు ఏమి నష్టపోయారు? నమ్మినవారే మోసం చేయడం వల్ల ఎన్ని కష్టాలు పడ్డారు? చివరకు ఆయన జీవితం ఎలా ముగిసింది? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం రఘుపతి వెంకయ్య నాయుడుగారి జీవితంలో జరిగిన ఎన్నో నాటకీయ పరిణామాలే. తెలుగు సినిమాకి ఆద్యుడు అయిన రఘుపతి గారి పాత్రలో నరేష్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి రఘుపతి వెంకయ్యలోని ప్రధానమైన ఆలోచనలను, సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్రేమను నరేష్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది. ముఖ్యంగా రఘుపతి వెంకయ్య ఆస్తులు పోయాక వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో గానీ, అలాగే సినిమా కోసం కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో గానీ నరేష్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇక వెంకయ్య నాయుడుగారి సతీమణి పాత్రను పోషించిన నటి అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకుంటారు. అలాగే మరో ప్రధాన పాత్ర మహర్షి రాఘవ తనకు ఇచ్చిన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. రఘుపతి వెంకయ్య పేస్ కట్స్ కోసం.. ఆయన గెటప్, లుక్ విషయంలో చాల వరకూ సారూప్యత ఉండేలా చూసుకున్నారు. ఆనాటి పరిసరాల విషయంలో కుడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
మైనస్ పాయింట్స్:
తెలుగు సినిమా పితామహుడు జీవితానికి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ కథతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో పర్వాలేదనిపించినా.. దర్శకుడు మాత్రం రఘుపతి వెంకయ్య బయోపిక్ కి న్యాయం చేయలేకపోయారు. పైగా చాల కీలకమైన సీన్స్ ను స్టాక్ షాట్స్ లో మరియి వాయిస్ ఓవర్ లోనే ముగించేశారు. పైగా స్క్రీన్ ప్లేను కూడా నెమ్మదిగా నడిపించారు. సినిమాలోని చాల సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ దర్శకుడు మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. ఓవరాల్ గా సినిమా నెమ్మదిగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తోంది. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది.
సాంకేతిక విభాగం:
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటింగ్ కూడా బాగాలేదు. అయితే ఎడిటరే సగం పైగా సినిమాని తన ఎడిటింగ్ తో నేరేట్ చేస్తాడు. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా లేదు. అయితే కొన్ని సన్నివేశాల్లోని విజువల్స్ ను కెమెరామెన్ చాలా సహజంగా చూపించారు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు:
తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆయన జీవితకథను, సినిమా కోసం ఆయన పడిన తపన, ఆయన ఎదుర్కొన్న కష్టాలను నేటి తరానికి కొంతమేరకు పరిచయం చేయడానికి ఈ సినిమా ఉపయోగపడింది గాని.. ఆ తెలుగు సినిమా పితామహుడు స్థాయికి తగ్గట్లు ఈ సినిమా ఆసక్తికరంగా సాగదు. సినిమా పట్ల ఆయనకున్న ప్రేమను అలాగే ఆయన ఆలోచనా విధానాన్ని ఈ సినిమా కంటే కూడా.. ఆయనకు సంబంధించిన పుస్తకాలు నుంచి మరియు ఆర్టికల్స్ నుంచి ఎక్కువ తెలుసుకొని ప్రేరణ పొందొచ్చు. మొత్తానికి ఈ సినిమా నిరుత్సాహ పరుస్తోంది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team