విడుదల తేదీ : డిసెంబర్ 12, 2019
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : అజ్మల్ అమీర్, బ్రహ్మనందం, అలీ, కత్తి మహేష్, ధన్ రాజ్ తదితరులు
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు : అజయ్ మైసూర్
సంగీతం : రవి శంకర్
సినిమాటోగ్రఫర్ : జగదీశ్.సి
ఎడిటర్: అన్వర్ అలీ
రామ్ గోపాల్ వర్మ తాజా వివాదాస్పద సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఎన్నిఅడ్డంకులు వచ్చిన ఎట్టకేలకూ ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్) నాయకత్వంలోని ఆర్.సీ.పీ పార్టీ.. బాబు నాయకత్వంలోని వెలుగు దేశం పార్టీ పై అఖండ విజయం సాధిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ నాథ్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి హామీను ఆచరణలో పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అయితే ఆర్.సీ.పీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో బాబును మాటల దాడితో హేళన చేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. ఆ అవమానభారంతో, తన చేత గాని కొడుకును చూస్తూ బాబు కుమిలిపోతుంటాడు. బాబును అలా చూడలేని ఆయన ప్రధాన అనుచరుడు దయనేని రమా, జగన్ నాథ్ రెడ్డి పై కుట్రలు పన్నుతాడు. కానీ ఆ క్రమంలోనే రమా అతి దారుణంగా హత్యకు గురవుతాడు. దయనేని రమాను హత్య చేయించింది జగన్ నాథ్ రెడ్డినా ? లేక బాబునా? మరెవరైనా? ఇంతకీ మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన సంఘటనలు ఏమిటి? ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? చివరికి దయనేని రమాని చంపిన వ్యక్తి దొరికారా? లేదా? ఈ మొత్తం వ్యవహారంలో పీపీ జాల్, మన సేన అధినేత ఎలాంటి పాత్రను పోషించారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ప్రధానమైన రెండు పార్టీలు మరియు రెండు సామాజిక వర్గాల నడుమ రాజకీయ ఆధిపత్య పోరు కోసం సాగే ఈ రాజకీయ చిత్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలను అలాగే అనేకమంది ప్రముఖుల పాత్రలను పోలిన పాత్రలను వ్యంగ్యంగా చూపిస్తూ కొన్ని చోట్ల దర్శక రచయితలు బాగానే నవ్వించారు. ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన అజ్మల్ అమీర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి జగన్ బాడీ లాంగ్వేజ్ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, అజ్మల్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక బాబు పాత్రను పోషించిన నటుడు నటన పరంగా కంటే కూడా, అచ్చం బాబులానే కనిపిస్తూ మెప్పించాడు. స్పీకర్ గా అలీ, సిట్ ఆఫీసర్ గా కనిపించిన స్వప్న, సీబీఐ పాత్రలో నటించిన కత్తి మహేష్, అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పీపీ జాల్ గా నటించిన నటుడు, మన సేన అధినేతగా మరియు చిన్నబాబుగా అనుకరించిన నటులు కూడా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేసి కొన్ని చోట్ల బాగా నవ్వించారు.
మైనస్ పాయింట్స్ :
వాస్తవిక పాత్రలకు కాల్పనిక సంఘటనలను జోడించి.. అవే సీన్లను అటు ఇటు తిప్పి వర్మ తీసిన ఈ సినిమా ఓ పార్టీ కార్యకర్తలకు మరియు ఓ వర్గం ప్రేక్షకులకు అయితే ఆనందాన్ని కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా తెలిసిన పాత్రలను పెట్టి వ్యంగ్యాన్ని విమర్శల ఫ్యాకేజిని మోతాదుకు మించి పెట్టినా.. అవి కూడా అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించగలిగాయి గాని.. సినిమాని మాత్రం నిలబెట్టలేకపోయాయి.
పైగా సినిమాలో చాల సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా వాస్తవానికి పూర్తి దూరంగా.. కనీసం సినిమాటిక్ గా కూడా అసలు కన్వీన్స్ కానీ విధంగా ఉంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లే.. స్లో నేరేషన్ తో సినిమా ఇంట్రస్టింగ్ గా సాగదు. చిన్నబాబు భార్య రమణి పాత్రకు సంబంధించి చివర్లో రివీల్ అయ్యే ట్వీస్ట్ సినిమా మొత్తంలోనే వరస్ట్ ఐడియాగా నిలుస్తోంది.
అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకరచయితలు కొన్ని పేరడీ రాజకీయ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక జగదీశ్.సి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే కొన్ని చోట్ల ఉపయోగించిన స్టాక్ షాట్స్ ను రియల్ షాట్స్ లో కలిసిపోయేలా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. ఇక సంగీత దర్శకుడు రవి శంకర్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటర్ అన్వర్ అలీ ఎడిటింగ్ జస్ట్ ఒకే అనిపిస్తోంది. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.
తీర్పు :
వివాదాస్పద అంశాలతో సినిమాలు చేసే వర్మ.. ఈ సారి సినిమానే వివాదాస్పదంగా రూపొందించాడు. సినిమాలో కంటెంట్ కంటే కూడా ప్రధానంగా ఓ పార్టీని, ఓ నాయకుడ్ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా.. ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఏ మాత్రం నమ్మశక్యం కాని పూర్తి కాల్పనిక కథలో బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరిచే కథనంతో మరియు బోరింగ్ ట్రీట్మెంట్ తో అండ్ వర్కౌట్ కాని పేరడీ పొలిటికల్ సీన్స్ తో ఈ సినిమా బాగా బోర్ కొడుతుంది. అయితే చిన్నబాబు పాత్ర, పీపీ జాల్, మన సేన అధినేత పాత్రలకు సంబధించిన కొన్ని సీన్స్ అక్కడక్కడా నవ్విస్తాయి. ఓవరాల్ గా సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team
Click Here For English Version