విడుదల తేదీ : నవంబర్ 20th,2020
123telugu.com Rating : 3/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ తదితరులు
దర్శకత్వం : వినోద్ అనంతోజు
సంగీతం : స్వీకర్ అగస్తి
స్క్రీన్ ప్లే : వినోద్ అనంతోజు
నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా “మిడిల్ క్లాస్ మెలోడీస్”. తెలుగు ఫ్యామిలీ కామెడీ-డ్రామాగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రాఘవ (ఆనంద్ దేవరకొండ) ఫ్యామిలీ ఊరిలో ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటుంది. అయితే రాఘవకు చిన్నప్పటి నుండే గుంటూరులో హోటల్ పెట్టి.. దాన్ని సక్సెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. ఈ మధ్యలో స్కూల్ డేస్ నుండే అతని మరదలు సంధ్య (వర్షా బొల్లమ్మ) లవ్ ఇంట్రస్ట్ ఉంటుంది. కానీ వీళ్ల లవ్ సక్సెస్ అవ్వాలంటే రాఘవ గుంటూరులో పెట్టిన హోటల్ లాస్ నుండి లాభాల్లోకి వచ్చి సక్సెస్ కావాల్సిన పరిస్థితి.. మరి రాఘవ తన హోటల్ ను ఎలా సక్సెస్ చేశాడు ? రాఘవ – సంధ్య లవ్ స్టోరీలో ఎదురైన సమస్యలు ఏమిటి ? చివరకు వీరు ఒక్కటయ్యారా ? లేదా ? అయితే ఎలా అయ్యారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆనంద్ దేవరకొండ, అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు గోపిరాజు రమణ మరియు వర్షా బొల్లమ్మ ఈ ముగ్గురు తమ నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు.. అదేవిధంగా హీరో హోటల్ బిజినెస్ అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి.
ఆ సన్నివేశాల్లో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఛేజింగ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. ఇక మరో లవ్ స్టోరీలో జాతకాల పిచ్చివాడిగా నటించిన నటుడు చైతన్య గరికపాటి కూడా కాన్ఫిడెంట్ గా నటించాడు. ముఖ్యంగా సెకెండ్ లవ్ స్టోరీ జర్నీ ఆకట్టుకుంటుంది. మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. కథలో చిన్న పాత్రలను కూడా టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాల బాగా తీసుకున్నాడు. ఇక కామెడీ కంటెంట్ సినిమాకే హైలెట్ నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు వినోద్ అనంతోజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.
అదే విధంగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. ఇక హీరోయిన్ – ఆమె తండ్రి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ సింఫుల్ గా ముగించారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కొన్ని కామెడీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు. అగస్తీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఆయన అందించిన పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ వచ్చిన ఈ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సరదాగా సాగుతూ కొన్ని గుడ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుటుంది. అయితే దర్శకుడు సినిమాను ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ఓ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ఐతే అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు మరియు వర్షా బొల్లమ్మ తమ నటనతో సినిమాలో బాగా అలరించారు. ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా సొంతంగా హోటల్ పెట్టుకొని జీవితంలో సెటిల్ అవ్వాలని ఓ కుర్రాడు పడే ఆరాటాన్ని దర్శకుడు చాలా ఎంటర్ టైన్ గా చెప్పాడు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team