సమీక్ష : సేవకుడు – నిరాష పరిచిన సేవకుడు

సమీక్ష : సేవకుడు – నిరాష పరిచిన సేవకుడు

Published on Jan 5, 2013 4:54 PM IST
Sevakudu విడుదల తేదీ: 04 జనవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : వి. సముద్ర
నిర్మాత : ఎన్. సుధాకర్
సంగీతం : శ్రీకాంత్ దేవా
నటీనటులు : శ్రీకాంత్, ఛార్మి

ఎమోషనల్ స్టార్ శ్రీకాంత్ మూడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూస సినిమాల నుండి బైటికి రాకపోవడంతో అతని సినిమాలు చూడడానికి ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. ఎప్పుడో సంవత్సరం క్రితమే విడుదలకి రెడీ అయి ఆర్ధిక సమస్యల వల్ల విడుదల కాలేకపోయిన “సేవకుడు” నిన్న విడుదల కావాల్సింది. ఆర్ధిక సమస్యలు పూర్తిగా తొలగిపోక పోవడంతో కాస్త ఆలస్యంగా విడుదలైంది. శ్రీకాంత్, సూపర్ స్టార్ కృష్ణ, మంజుల, ఛార్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సముద్ర దర్శకుడు. సేవకుడు ఎవరికి సేవ చేసాడో ఒకసారి చూద్దాం.

కథ :

రామచంద్రయ్య (నాజర్) సిన్సియర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్. ఎంత సిన్సియర్ అంటే సొంత అల్లుడు తప్పు చేసినా చట్టం ముందు అంతా ఒక్కటే అనేంత సిన్సియర్. తన కొడుకు సూర్యని (శ్రీకాంత్) పోలీస్ చేయాలని రామచంద్రయ్య కోరిక. సూర్యకి పోలీస్ అవ్వాలని ఉండదు. ఇండియా నుండి అమెరికా వెళ్లి అక్కడే స్థిర పడిన వ్యాపారవేత్త లక్ష్మి కృష్ణ ప్రసాద్ (కృష్ణ) ఇండియా మీద ప్రేమతో తిరిగి వస్తాడు. సంపాదించిన డబ్బునంతా తన ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు పెట్టి ప్రభుత్వం చేయలేనిది తాను చేసి చూపించాలనుకుంటాడు. ఈ కార్యం ప్రారంభం అయితే తన మనుగడ కష్టమని బలరాం జాదూ (ప్రదీప్ రావత్) కృష్ణ ప్రసాద్ ని చంపిస్తాడు. ఈ ప్రమాదంలో రామచంద్రయ్య కూడా చనిపోతాడు. తమకి జరిగిన అన్యాయానికి సూర్య, కృష్ణ ప్రసాద్ కూతురు మంజుల (మంజుల) ఎలా బదులు తీర్చుకున్నారన్నది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ కృష్ణ చేసిన చివరి చిత్రం ఇదే. ఉన్న సీన్స్ వరకు బాగానే చేసారు. శ్రీకాంత్ కొత్తగా చేసిందేమీ లేకపోయినా పర్వాలేదనిపించాడు. మీసం లుక్ తో పోలీస్ ఆఫీసర్ గా బావున్నాడు. సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించాడు. నాజర్ కి పెద్ద పాత్రే ఇచ్చారు. ఉన్న సీన్స్ అన్ని బాగా చేసాడు. మొదటి భాగంలో మొదటి ముప్పై నిముషాలు కామెడీ ఎపిసోడ్స్ నడిపించి తరువాత కథ లోకి దిగిన తరువాత ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఇంటర్వెల్ వరకు సినిమాని బాగా నడిపించాడు. ఇంటర్వెల్ తరువాత వచ్చే ట్విస్ట్ కూడా బాగానే పండింది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బావుంది కానీ ఎంచుకున్న కాన్సెప్ట్ మీద హోం వర్క్ చేయకపోవడం వల్ల రెండవ భాగం అంతా ఏం తీయాలో అర్ధం కాక ఇష్టానికి తీసుకుంటూ వెళ్ళాడు. మూడు నెలలు విజయవాడ సిటీని అన్ కండీషనల్ లీజ్ కింద తీసుకుని సిటీ రూపు రేఖలు మారుస్తాం. రాజ్యాంగం మారుస్తాం అంటే దానికి ప్రధాని, రాష్ట్రపతి అంగీకరించడం ఈ ఎపిసోడ్స్ అన్ని వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. అన్ కండీషనల్ లీజ్ తీసుకున్న తరువాత నో రూల్స్, నో జడ్జిమెంట్ ఓన్లీ పనిష్మెంట్ అంటూ సూర్య తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఆసక్తి కలిగించకపోగా చిరాకు తెప్పించాయి. అసలు సమస్య ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఇప్పటికే బిజినెస్ మేన్ సినిమాలో వచ్చి ఉండటంతో చాలా సీన్స్ అన్ని ఆ సినిమానే గుర్తు తెస్తాయి. ఆ సినిమా కంటే ముందే ఈ కథ రాసుకున్నప్పటికీ ముందు అదే సినిమా విడుదల కావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏది ఏమైనప్పటికీ మంచి కాన్సెప్ట్ తెర రూపం ఇవ్వడంలో విఫలమయ్యారు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ మొదటి భాగం వరకు బాగానే ఉన్నా రెండవ భాగంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సిన అవసరం ఉంది. డైలాగ్స్, ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగ చెప్పుకోవడానికి ఏమి లేదు. శ్రీకాంత్ దేవా సంగీతంలో పాటలు పెద్దగా బాగాలేకపోయినా నేపధ్య సంగీతం మాత్రం కొన్ని సన్నివేశాల వరకు బావుంది.

తీర్పు :

కథ బావున్నా కథనం బాగాలేకపోవడం, కాన్సెప్ట్ కూడా ఇటీవలే వచ్చిన బిజినెస్ మేన్ సినిమాని పోలి ఉండటం వల్ల సేవకుడు ఆసక్తి కలిగించలేక చతికిల పడ్డాడు. ధియేటర్ కి వెళ్లి చూసేంత మేటర్ పెద్దగా ఏమి లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు