విడుదల తేదీ : ఏప్రిల్ 03, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్, జెమిని సురేష్, టిఎన్ఆర్, రఘు బాబు, కత్తి మహేష్ తదితరులు
దర్శకత్వం : బాలు అడుసుమిల్లి
నిర్మాతలు : యెరుకొండ రఘు రామ్, శ్రీనివాస్ వేగి, మురళి మాటురు
సంగీతం : వికాస్ బడిస
ఎడిటర్ : చోటా కె. ప్రసాద్
కెమెరామెన్ : దర్శన్
డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్ మూవీ ‘వై’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ థ్రిల్లర్ సినిమా ‘ఆహా’లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
రఘురామ్ (శ్రీరామ్) ఒక సక్సెస్ ఫుల్ ఫిల్మ్ డైరెక్టర్. అయితే అతను డైరెక్షన్ లో వచ్చిన ప్రళయం అనే సినిమా డిజాస్టర్ అవుతుంది. దాంతో అతని పై అనేక విమర్శలు వస్తాయి. ఈ క్రమంలో రఘురామ్ మరో కథ రాయడానికి ట్రై చేస్తూ తనలో తానే నలిగిపోతుంటాడు. దాంతో అతని పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడిన అతని భార్య, కథ రాయడానికి ఒక రైటర్ ను పెట్టుకోమని అతన్ని ఒప్పిస్తోంది. అలా బాలు (రాహుల్ రామకృష్ణ) రైటర్ గా రఘురామ్ దగ్గరకు వచ్చి ఒక క్రైమ్ కథ చెబుతాడు. కథ నచ్చడంతో రఘురామ్ అతనికి క్రెడిట్ ఇవ్వనని చెప్పి, ఒక ఆఫర్ ఇస్తాడు. అయితే అక్కడ అనుకున్నది ఒక్కటీ జరిగేది మరొక్కటి. ఇంతకీ అక్కడ నుండి కథ ఎలాంటి మలుపు తిరిగింది ? రఘురామ్ జీవితంలో చోటు సంఘటనలు ఏమిటి ? అసలు బాలును రఘురామ్ ఏం చేస్తాడు ? అలాగే బాలు ఏం చేస్తాడు ? చివరకు ఈ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఆహా యాప్ లో ఈ సినిమాని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా గంట ముప్పై ఒకటి నిముషాలు మాత్రమే ఉండటం అనేది ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సినిమాలో ఎక్కడా ల్యాగ్ లేకుండా.. ఉన్న సీన్స్ ను చక్కగా ప్రెజెంట్ చేశారు. ఇక నటీనటుల విషయానికి వస్తే సినిమాలో ప్రధాన పాత్రధారులుగా నటించిన శ్రీరామ్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు తగ్గట్లు బాగా నటించారు. సినిమా డైరెక్టర్ పాత్రలో శ్రీరామ్ చాల బాగా నటించాడు.
అలాగే మరో కీలక పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చారు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో జెమిని గణేష్ కూడా తన కామెడీ టైమింగ్ తో రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అలాగే సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు అనవసరపు ఎక్స్ ప్రెషన్స్ తో నటించినా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేదు
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కథ ఏమి లేదు. సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్, కథలో వచ్చే ప్రధాన మలుపు ఆకట్టుకున్నా.. సినిమా మాత్రం ఏ మాత్రం ఇంట్రస్ట్ కలిగించలేని సన్నివేశాలతో సాగుతూ మొత్తానికి సినిమా ఆకట్టుకునే విధంగా లేదు. చాలా సీన్స్ కథలో మిళితమయి సాగినా.. కథనంలో ఆసక్తిని మాత్రం పెంచలేకపోయాయి.
ఇక కొన్ని పంచ్ లతో నవ్వించే ప్రయత్నం చేసారు గాని, అవి ఎంతో కష్టపడి నవ్వించటానికి చేసినట్లే ఉంటుందిగాని సహజంగా ఉండదు. ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన సీన్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. క్లైమాక్స్ భాగం బాగున్నా… ముందు సీన్స్ మాత్రం ప్లాట్ గా సాగాయి. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించడం సినిమాకి పెద్ద మైనస్ అయింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు బాలు అడుసుమిల్లి రాసుకున్న స్క్రిప్ట్ బాగాలేదు. అయితే ఒక దర్శకుడిగా మాత్రం బాలు ఉన్న స్క్రిప్ట్ ను స్క్రీన్ మీదకు బాగా ఎగ్జిక్యూట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిస అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కెమెరామెన్ దర్శన్ కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి.
తీర్పు :
‘వై’ అంటూ ఇంట్రస్టింగ్ పాయింట్ తో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా థ్రిల్ చేయలేకపోయింది. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు సంఘర్షణ లేని సీన్స్ అండ్ ఎమోషన్స్.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team