విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోగల నటుడు ఆయన. అందుకే ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా, సపోర్టింగ్ నటుడిగా ఎన్నో మరుపురాని పాత్రలు చేసిన ఆయన ఈమధ్య కొంచెం డల్ అయ్యారు. తరచూ సినిమాలు చేస్తున్నా కూడ గుర్తుండిపోయే పాత్రలు పడలేదు ఆయనకు. అన్నీ రెగ్యులర్ పాత్రలో. ఆయన అలవోకగా చేసేస్తున్నవే. అందుకే అవి ప్రేక్షకుల మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.
కానీ ‘వకీల్ సాబ్’ చిత్రంలో మాత్రం ఆయన పెర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. ప్రత్యర్థుల తరపున కేసు వాదించే ఫేమస్ లాయర్ నంద పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయారు. చాలారోజుల తర్వాత ఆయనలోని నటుడికి పని పడింది అనేలా చేశారు. ఆర్గ్యుమెంట్స్ సన్నివేశాల్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ మెప్పించాయి. ఆయన కనబర్చిన అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ మూలంగానే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బాగా ఎలివేట్ అయింది. ఈమధ్య కాలంలో ప్రకాష్ రాజ్ చేసిన మంచి పాత్రల్లో ‘వకీల్ సాబ్’ నంద క్యారెక్టర్ ముందువరసలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ పాత్రతో ఆయన మరోసారి ప్రేక్షకుల చర్చల్లో నిలిచారు.