బ్లాక్‌స్టార్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు సుపరిచితుడైన షానీ నటించిన రామ్ అసుర్ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన నేపధ్యంలో ఆయన తన అంతరంగాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బ్లాక్ స్టార్‌గా గుర్తింపు పొందిన తాను తెలుగు ప్రేక్షకుల అభిమానానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. రామ్ అసుర్ చిత్రం ఘన విజయం సాధించడం నా జీవితంలో కీలక మలుపు, విజయోత్సవ సభలకు ఎక్కడికెళ్లినా శివన్నా అంటూ ప్రేక్షకులు ఆప్యాయంగా పిలవడం ఎంతో సంతోషాన్ని కల్గిస్తుంది” అని తెలిపారు.
షానీ తన సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ, “బేసికల్‌గా స్పోర్ట్స్‌మెన్ కావడంతో హైదరాబాద్ నగరంలో ఓ హోల్డింగ్ చూశా, ఆ ప్రకటనలో అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు కావాలని, అర్హులైన వారు సంప్రదించాలని ఉంది. స్వతహాగా నేను నేషనల్ ఛాంపియన్ అయినందున దరఖాస్తు చేశా. 2003లో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి గారి సినిమా ఆడిషన్స్ ప్రకటన అని తెలుసుకున్నాను. ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు రాజమౌళి గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ భుజం తట్టి ప్రోత్సహించారు. నా లుక్ వెరైటీగా ఉండడంతో అవకాశం కల్పించారు. అదే నా జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. ఆ సినిమా ఘన విజయం కావడంతో సై షాని గా పిలవడం మొదలుపెట్టారు. ఆ సినిమా నాకు మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టింది” అని అన్నారు.
“జెడ్చర్లకు చెందిన నేను ఉస్మానియా యూనివర్శిటీ లో డిగ్రీ, పీజీ నిజాం కాలేజ్‌లో విద్యాభాస్యం పూర్తి చేయడం జరిగింది. కెరీర్ లో ఇప్పటిదాకా 70కిపైగా సినిమాల్లో నటించా. రాజమౌళి గారి సై చిత్రం ఘన విజయం సాధించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్క మగాడు, శశిరేఖా పరిణయం లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించా. అలా ఎలా చిత్రంలో రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి హీరోకు సమానమైన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరవడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 30 సూపర్ హిట్‌గా నిలిచాయి. దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో కూడా హీరో పాత్ర పోషించా. అలా ఎలా, దేశంలో దొంగలు పడ్డారు, రాక్షసి చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించా” అని తెలిపారు.
డిసెంబరులో కిన్నెరసాని, అమరన్, గ్రే, పంచతంత్ర కథలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అని అన్నారు. తాను నల్లగా ఉండడం కూడా తనకు ఒక ఎసెట్ అని, బ్లాక్‌స్టార్ అనేది స్నేహితులు ముద్దుగా పిలుచుకుంటారని చెప్పారు. తాను మంచి స్టార్‌గా ఎదగాలని, చిత్ర రంగంలో పేద, వృద్ధ కళాకారులను ఆదుకోవాలన్నది లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో కొత్తగా వచ్చే నటీనటులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కాలేజ్ మిత్రుడు విజయానంద్ తో కలిసి గడచిన ఐదేళ్లుగా ఓవర్ 7 ప్రొడక్షన్ ద్వారా నూతన కళాకారులను ప్రోత్సహించడం తో పాటు యాడ్ ఫిలిమ్స్ అండ్ క్యాస్టింగ్, ఫిలిం ప్రొడక్షన్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, ఫిల్మ్ ప్రొడక్షన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓవర్-7 ప్రొడక్షన్ ద్వారా సామాజిక బాధ్యతగా అంధులు, వృద్ధులు, అనాధలకు అన్నదానం, వైద్య సాయం, దుస్తులు అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రీసెర్చ్ మీడియా గ్రూపులో క్రియేటీవ్ హెడ్‌గా అనేక కార్పొరేట్ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగు చిత్రాలకు ఎంతోమంది నటీనటులకు అవకాశాలు కల్పించడం జరిగింది. వారంతా ఇప్పుడు స్టార్స్‌గా రాణించడం సంతోషాన్ని కలిగిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో నటించడం జరిగిందని, బాలీవుడ్లో వెల్కం టూ సజ్జన్‌పూర్ చిత్రంలో మంచి పాత్ర పోషించినట్లు వెల్లడించారు. ఈ మధ్యే కొన్ని కథలు విన్నానని, ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతానని, నాకు ఈ గుర్తింపు రావడానికి కారణమైన దర్శకులకు, నిర్మాతలకు, నా తోటి నటీనటులకు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అని అన్నారు.