విడుదల తేదీ : జులై 22, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికనాయర్ , అవికా గోర్, సంపత్ రాజ్, తులసి, సాయి సుశాంత్ రెడ్డి, ఈశ్వరి రావు, ప్రకాష్ రాజ్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: దిల్ రాజు
సంగీత దర్శకుడు: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్
ఎడిటర్: నవీన్ నూలి
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా థాంక్యూ. గతంలో అక్కినేని ఫ్యామిలీ తో మనం మూవీ తీసి పెద్ద సక్సెస్ అందుకున్న విక్రమ్, కొన్నేళ్ల విరామం తరువాత చైతన్యతో చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష చూద్దాం.
కథ :
నారాయణపురం అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అభిరామ్ (నాగ చైతన్య) ఒంటరిగా అమెరికా వస్తాడు.వైద్య అనే వినూత్న యాప్ డెవలప్ చేసి.. వరల్డ్ లోనే సక్సెస్ ఫుల్ కంపెనీ ఓనర్ గా సక్సెస్ అవుతాడు. సక్సెస్ వచ్చిన కిక్ లో పూర్తిగా మారిపోతాడు అభి. తన లైఫ్ లో తన కష్టంతోనే ఎదిగాను అని నమ్ముతాడు. సక్సెస్ గర్వంతో ఒక్కొక్కరినీ దూరం చేసుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అభి లో మార్పు వస్తోంది. దాంతో తనను ప్రభావితం చేసిన వ్యక్తులను వెతుక్కుంటూ ఇండియా వస్తాడు. ఈ క్రమంలో పార్వతి ( మాళవికనాయర్) అవికా గోర్ లను కలుస్తాడు. అలాగే ప్రియ (రాశి ఖన్నా)తో అభి లవ్ ట్రాక్ ఏమిటీ ? చివరకు అభిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి ? అసలు అభి మారాడా ? లేడా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ మూవీకి ప్రధాన బలం ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా సాగే చైతు జర్నీ. హీరోగా నటించిన నాగ చైతన్య మొత్తం సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసారు. ఒక వ్యక్తి లైఫ్ లో ఎమోషనల్ జర్నీ అనే అంశంతో సాగే సినిమాకి కావలసిన అన్ని అంశాలను దర్శకడు విక్రమ్ కె కుమార్ చక్కగా కథలో సమకూర్చారు. మూవీలో హీరోయిన్స్ గా నటించిన రాశి, మాళవిక ఇద్దరూ కూడా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు.
ఒక ముఖ్య పాత్ర చేసిన అవికా గోర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలానే ప్రకాష్ రాజ్, సంపత్ ల క్యారెక్టర్స్ కూడా చిన్నవే అయినప్పటికీ గుర్తుండిపోతాయి. మూవీకి పిసి శ్రీరామ్ అందించిన విజువల్స్ తో పాటు పలు సీన్స్ తో థమన్ అందించిన బ్యాక్ స్కోర్ కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
మూవీ లో దర్శకుడు విక్రమ్ కుమార్ తీసుకున్న పాయింట్ ఎంతో బాగున్నప్పటికీ మధ్యలో కథనంలో చాలా లోపాలు కనిపిస్తాయి. సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మరింత డెప్త్ గా చూపిస్తే బాగుండేది. మధ్యలో కొన్ని సీన్స్ సాగదీసినట్లు అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అయితే, దర్శకుడు ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, ఓవరాల్ అవి స్క్రీన్ మీద పండలేదు.
దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రసింగ్ ప్లేను బిల్డ్ చేయలేకపోయారు. సినిమాలో మెయిన్ క్యారెక్టరైజేషన్ ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే హీరో క్యారెక్టర్ తాలూకు యాక్టివిటీస్ కూడా సినిమాకి మైనస్ అయ్యాయి. పైగా కొన్ని చోట్ల హీరో ట్రాక్ కూడా బలహీనంగా సాగుతోంది. ఇక కొన్ని సీన్స్ లో నాటకీయత ఎక్కువడంతో ఆ సీన్స్ సహజత్వం లోపించింది.
మొత్తమ్మీద స్టోరీగా తీసుకున్న స్లాట్ బాగున్నప్పటకీ కథనం అంతా పాతదే కావడంతో తదుపరి వచ్చే సీన్స్ ఈజీగా తెలిసిపోతుంటాయి, అలానే ఎటువంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు వంటివి కూడా మూవీలో లేవు.
సాంకేతిక విభాగం :
ముఖ్యంగా థాంక్యూ మూవీ సాంకేతిక విభాగంలో పని చేసిన వారి పనితీరు బాగుంది. సినిమా లోని ప్రతి సీన్ ని ఆడియన్స్ మనసుని తాకేలా విజువల్ గా ఎంతో అందంగా చూపించారు పిసి శ్రీరామ్. ఇక థమన్ గురించి అయితే ఎంతో చెప్పుకోవాలి. సినిమాలో సాంగ్స్ బాగానే ఉండగా ముఖ్యంగా మధ్యలో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకోవడంతో పాటు ఫేర్ వెల్ సాంగ్ అయితే యూత్ మరింతగా థియేటర్ లో ఎంజాయ్ చేస్తుంది. అలానే నిర్మాత దిల్ రాజు మూవీని ఎక్కడా కూడా గ్రాండియర్ వే లో నిర్మించినట్లు మనకు తెరపైన విజువల్స్ తో పాటు సెట్స్ చూస్తే తెలుస్తుంది. తన గత సినిమాల మాదిరి ఈ మూవీకి కూడా బాగానే ఖర్చు చేసారు రాజు.
తీర్పు :
ఓవరాల్ గా “థాంక్యూ” మూవీ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. అయితే ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టరైజేషన్ బలహీనంగా సాగడం, అలాగే ఫేక్ ఎమోషన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయితే సినిమాలో చైతు నటన బాగుంది. కాకపోతే, ఎమోషనల్ అండ్ లవ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team