సమీక్ష : రంగమార్తాండ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్

సమీక్ష : రంగమార్తాండ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్

Published on Mar 23, 2023 3:02 AM IST
Rangamarthanda Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 22, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఆలీ రెజా తదితరులు

దర్శకుడు : కృష్ణవంశీ

నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి

సంగీత దర్శకులు: మ్యాస్ట్రో ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి

ఎడిటర్: పవన్ వికె

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

కొన్నేళ్ల గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. మరి నేడు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

రాఘవరావు (ప్రకాష్ రాజ్) తన వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకున్న రంగస్థల నటుడు. కళకు ఆయన చేసిన అపూర్వమైన కృషికి, అతనికి రంగమార్తాండ అనే బిరుదు దక్కుతుంది. రాఘవరావుకి వయసు మీదపడుతున్నకొద్దీ అతను తన వృత్తి నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుని తన ఆస్తిని పిల్లలైన శ్రీ (శివాత్మిక రాజశేఖర్) మరియు రంగా (ఆదర్శ్ బాలకృష్ణ)కి పంచుతాడు. అనంతరం అతడు, తన భార్య రాజు గారు (రమ్య కృష్ణన్) ఇద్దరూ తమ పిల్లలతో ఎన్నో మాటలు పడతారు. కాగా రంగమార్తాండ రాఘవరావు, ఆయన పిల్లల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామానే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఈ సినిమాలో ప్రధానమైన రాఘవరావు పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్న దర్శకుడు కృష్ణవంశీ నిజంగా అభినందనీయులు. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు అని అనడం కంటే పరకాయ ప్రవేశం చేసారు అని చెప్పాలి. ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న కాంచీవరం మూవీలోని పాత్ర మాదిరిగా ప్రకాష్ రాజ్ ఈ సినిమాలోని రాఘవరావు పాత్రలో మరొకసారి అద్బుతంగా జీవించారు. ఆయన నటించిన అనేక సన్నివేశాలు ప్రేక్షకుల మదిని తాకడంతో పాటు కన్నీరు పెట్టిస్తాయి.

ఇక రంగమార్తాండ లో సెకండ్ హాఫ్ అయితే ఎంతో హృద్యమైన ఎమోషన్స్ తో సాగుతుంది. రంగస్థల నటులు వారి జీవితంలో ఎదురైన సుఖదుఃఖాలను ఎదుర్కొని ఏవిధంగా ముందుకు నడుస్తారు అనే పాయింట్ ని ఎంతో బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే మరింత అద్భుతం. కామెడీ ని పండించగల నటులు హృద్యమైన ఎమోషన్స్ కి కూడా బాగా పండించగలరు అనేదాన్ని మరొకసారి నిజం చేసారు పద్మశ్రీ బ్రహ్మానందం. ఫస్ట్ హాఫ్ లో కామెడీ పంచిన ఆయన పాత్ర సెకండ్ హాఫ్ ఎంతో ఎమోషనల్ గా మనల్ని కదిలిస్తుంది. మరీ ముఖ్యంగా ఒక సింగల్ షాట్ సీన్ లో ఆయన నటనకి మన కంటి వెంట నీరు ఆగదంటే అతిశయోక్తి కాదేమో. గృహిణిగా ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ ఆర్టిస్ట్ గా రమ్యకృష్ణ కూడా ఎంతో బాగా నటించారు.

శివాత్మిక రాజశేఖర్ తన పాత్రలో సహజంగా, ఆకట్టుకునేలా పెర్ఫార్మ్ చేసారు. అలానే అనసూయ భరద్వాజ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అందించిన షాయరీ కథా నేపథ్యంలో వస్తూ మన మనసుని తాకుతుంది. ఆ విధంగా ఆకట్టుకునే కథ కథనాలతో దర్శకుడు కృష్ణవంశీ అందరి మనసులు తాకేలా రంగమార్తాండ ని మన అమ్మానాన్న ల కథగా మంచి మెసేజ్ తో తెరకెక్కించారు.

 

మైనస్ పాయింట్స్ :

కొన్నేళ్ల క్రితం తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న ఫ్యామిలీ యాక్షన్ మూవీ సంసారం ఒక చదరంగం యొక్క ఛాయలను రంగమార్తాండ మనకు కొంత గుర్తు చేస్తుంది. అయితే ఆ మూవీ చూడని వారిని ఇది అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒకింత నెమ్మదిగానే సాగుతుంది, ఎడిటింగ్ టీమ్ కొన్ని ల్యాగ్ సీన్స్ ని కత్తిరించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఒకరకంగా పాత పద్ధతిన సాగే కథనం అందరికీ రుచించకపోవచ్చు.

 

సాంకేతిక వర్గం :

ఇళయరాజా అందించిన సాంగ్స్ ఈ సినిమాకు మంచి బలం. ముఖ్యంగా పార్టీ సాంగ్ అదిరిపోవడంతో పాటు ప్రకాష్ రాజ్ డ్యాన్స్ కూడా ఎంతో బాగుంటుంది. రాజ్ కె నల్లి ఫోటోగ్రఫి బాగుంది, నిర్మాతల నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. ఇక ఆకెళ్ళ శివ ప్రసాద్ రాసిన డైలాగ్స్ ఎంతో బాగున్నాయి. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ మరొక్కసారి తన అద్భుత దర్శకత్వ ప్రతిభని రంగమార్తాండ తో దర్శకుడు కృష్ణవంశీ బయటకు తీశారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సెకండ్ ఎమోషనల్ గా అన్ని వర్గాల ఆడియన్స్ మనసుని తాకేలా ఆయన ఈ మూవీ తెరకెక్కించారు. అయితే మధ్యలో గత సినిమాల మాదిరిగా సాగె కథనం ఒకింత మాములుగా అనిపిస్తుంది.

 

తీర్పు :

మొత్తానికి రంగమార్తాండ రంగస్థల కళాకారుడి కధ. సాలిడ్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ కి గొప్ప నటీనటులు కలిసినప్పుడు, ఫలితం రంగమార్తాండ లానే ఉంటుంది. ముఖ్యంగా కృష్ణవంశీ ఈ సినిమాని అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ ఎమోషనల్ డ్రామా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే అక్కడక్కడా లోపాలు లేకపోలేదు. కొన్ని సమయాల్లో నెమ్మదిగా సాగే కథనం ఆడియన్స్ కి గత సినిమాలను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఎమోషన్స్ ని క్యారీ చేసిన విధానం చాలా బాగుంది. అయితే రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ మరియు బ్రహ్మానందం అద్భుతమైన నటనను చూసి తరించవచ్చు. తప్పకుండా కుటుంబం మొత్తంగా చూడదగ్గ మూవీ ఇది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు