సమీక్ష : “దసరా” – హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్!

సమీక్ష : “దసరా” – హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్!

Published on Mar 31, 2023 3:15 PM IST
Dasara Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 30, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్

దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల

నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ :

 

తెలంగాణకు చెందిన గోదావరిఖని తాలూకు వీర్లపల్లి అనే ఊరిలో మొదలైంది ఈ కథ. ఈ గ్రామానికి చెందిన ధరణి (నాని ) సూర్యం (దీక్షిత్ శెట్టి) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ధరణి (నాని) వెన్నెల( కీర్తి సురేష్) ను ప్రాణంగా ప్రేమించినప్పటికీ, మరోవైపు తన ప్రాణ స్నేహితుడుసూర్యం (దీక్షిత్ శెట్టి) కూడా వెన్నెల ను ప్రేమిస్తున్నాడు అని తెలిసి, తన ప్రేమను చంపుకుని వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, సూర్యం (దీక్షిత్ శెట్టి) ఎలా చనిపోతాడు ?, తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి (నాని) ఎలా పగ తీర్చుకున్నాడు ?, చివరకు ధరణి (నాని) – వెన్నెల( కీర్తి సురేష్) ఒక్కటి అయ్యారా ? లేదా ?, ఈ మధ్యలో ధరణి (నాని) అనుభవించిన మానసిక వేదన ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో వచ్చిన నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. ధరణి పాత్రకు నాని ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో నాని అద్భుతంగా నటించాడు. నిజంగానే పిరికివాడిలా, పచ్చి తాగుబోతులా చాలా సహజంగా కనిపించాడు. నాని – కీర్తి సురేష్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ గా ఉంది. వెన్నెలగా కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ కీర్తి సురేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది.

నానికి స్నేహితుడి పాత్రలో దీక్షిత్ శెట్టి చాలా బాగా నటించాడు. కీలక పాత్రలో నటించిన షైన్ టామ్ చాకో పర్ఫార్మెన్స్ సెటిల్డ్‌ గా చాలా బాగుంది. సముద్రఖని ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. ఆయన కెరీర్ లో నిలిచిపోయే గెటప్ ఇది. సాయి కుమార్ నటన కూడా బాగుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, నాని పాత్రలోని షేడ్స్ ను, కీర్తి సురేష్ తో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే గోదావరిఖని తాలూకు వీర్లపల్లి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్రను చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నాని పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ధరణి పాత్ర, కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో, కథను మొదలు పెట్టడంలో మాత్రం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆకట్టుకోలేకపోయారు. పాత్రల మధ్య ఎమోషన్స్ ను ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా సరిగ్గా ఎలివేట్ కాలేదు. కథలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా మిస్ అయ్యాయి. మలుపులు లేని కథనం కూడా కొన్ని చోట్ల నీరసంగా సాగింది.

ఇక సినిమాలో సెకండాఫ్ ఐతే మరీ స్లోగా ఉంది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… చాలా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఈ సినిమా ఓ బార్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు ఎక్కువగా మందు సీన్స్ నే పెట్టారు. సినిమాలో హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అండ్ కాన్ ఫ్లిక్ట్ ఇంకా బలంగా ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగానికి వస్తే.. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. ఎడిటర్ నవీన్ నూలి సినిమాలోని స్లో సీన్స్ ను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నేషనల్ రేంజ్ లో భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. రచయితగా తడబడినా దర్శకుడిగా మాత్రం శ్రీకాంత్ ఓదెల బాగా ఆకట్టుకున్నాడు.

 

తీర్పు :

 

హై వోల్టేజ్ ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నానితో పాటు మిగిలిన లీడింగ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ నటనతో బాగా ఆకట్టుకున్నారు. డిఫరెంట్ షేడ్స్ తో రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో నాని అద్భుతంగా నటించాడు. అలాగే నేపథ్యం, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే కథనంలో కొన్నిచోట్ల ఆసక్తి పెంచే అంశాలు ఆశించిన స్థాయిలో కుదరలేదు. ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు