విడుదల తేదీ : ఆగస్టు 4, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగి బాబు, RJ విజయ్ మరియు ఇతరులు
దర్శకుడు : రమేష్ తమిళమణి
నిర్మాతలు: సాక్షి సింగ్ ధోనీ, వికాస్ హసిజా
సంగీతం: రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒడుక్కతిల్
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
టీమ్ ఇండియా మాజీ దిగ్గజ సారధి ధోనీ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. నిర్మించిన ఫస్ట్ మూవీ LGM(లెట్స్ గెట్ మ్యారీడ్). ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ తమిళమణి రూపొందించారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
గౌతమ్(హరీష్ కళ్యాణ్) తన కంపెనీలోనే పనిచేస్తున్న మీరా(ఇవానా)ను రెండేళ్లుగా ప్రేమిస్తూ.. ఎట్టకేలకు ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. మరోవైపు గౌతమ్ కి పెళ్లి చేయాలని అతని తల్లి లీలా(నదియా) రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మీరాతో తన లవ్ మ్యాటర్ గురించి తల్లికి చెప్తాడు గౌతమ్. లీలా కూడా వెంటనే పెళ్లికి ఓకే చెబుతుంది. పైగా కోడలిని కూతురుగా చూసుకోవాలని ఆశ పడుతుంది. కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మీరా గౌతమ్ కి షాక్ ఇస్తోంది ?, అసలు పెళ్లికి అడ్డు చెప్పడానికి మీరాకి ఉన్న సమస్య ఏమిటి ?, ఇంతకీ మీరా గౌతమ్ కి ఎలాంటి షరతు పెట్టింది ?, అనంతరం జరిగిన సంఘటనలు ఏమిటి ?, చివరకు మీరాతో గౌతమ్ లవ్ సక్సెస్ అయ్యిందా ? లేదా? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోతున్న ఈ జనరేషన్ లో.. ఓకే ఇంట్లో కలిసి ఉండబోయే అత్తాకోడళ్ళు ఒకర్ని ఒకరు అర్థం చేసుకుని.. ముందుకు వెళ్తే బాగుంటుంది అనే కోణంలో సాగిన ఈ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటు మరికొన్ని భావోద్వేగాలు బాగున్నాయి. అలాగే తనకు కాబోయే అత్తగారు ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకున్న ఓ యువతి ఆమెతో కలిసి చేసిన ట్రిప్ తాలూకు సన్నివేశాలు కూడా బాగున్నాయి. అలాగే దర్శకుడు రమేష్ తమిళమణి ఈ సినిమాలో అత్తకి – మోడ్రన్ కోడలికి మధ్య అద్భుతమైన జర్నీని కూడా చాల చక్కగా చూపించాడు.
మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు కుర్రాళ్ళ భావోద్వేగాలు బాగున్నాయి. హీరోగా హరీష్ కళ్యాణ్ తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. గౌతమ్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన నదియా నటన కూడా చాలా బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన ఇవానా తన నటనతో పాటు తన లుక్స్ తోనూ ఆకట్టుకుంది. మిగిలిన ప్రధాన పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. యోగిబాబు నవ్వించాడు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు రమేష్ తమిళమణి తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగింది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స్ కూడా రెగ్యులర్ గానే ఉన్నాయి. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన కామెడీ సన్నివేశాలను జోడించాడు. పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.
మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది. అదే విధంగా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు మంచి కథాంశంతో ఆకట్టుకున్నా.. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఏ మాత్రం బాగాలేదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాత సాక్షి సింగ్ దోని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు:
LGM(లెట్స్ గెట్ మ్యారీడ్) అంటూ వచ్చిన ఈ మూవీలో మెయిన్ పాయింట్ అండ్ కోర్ ఎమోషన్ అలాగే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కాబోయే అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత కోసం చేసే ప్రయత్నాలు తాలూకు సీన్స్ కూడా పర్వాలేదు. కానీ, స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, రెగ్యులర్ అండ్ సిల్లీ డ్రామా వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమాలోని కొన్ని అంశాలు పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగుంది కాబట్టి.. ఈ సినిమా ఓటీటీలో వర్కౌట్ అవ్వొచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team