విడుదల తేదీ: మార్చి 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, హైమావతి, దేవియాని శర్మ, రోహిణి, దర్శన బానిక్, సత్య కృష్ణన్, శ్రీకాంత్ అయ్యంగార్, ముక్కు అవినాష్ తదితరులు.
దర్శకుడు: అరుణ్ కొత్తపల్లి
నిర్మాత: మహి వి రాఘవ్, చిన్న వాసుదేవ రెడ్డి
సంగీత దర్శకుడు: అజయ్ అరసాడ
సినిమాటోగ్రాఫర్: ఎస్ వి విశ్వేశ్వర్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
సంబంధిత లింక్స్: ట్రైలర్
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2 తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్ యొక్క పూర్తి సమీక్షని ఇప్పుడు చూద్దాం.
కథ :
పార్ట్ 1 ఎక్కడ అయితే ఎండ్ అయిందో, అక్కడి నుండే పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) ని కిడ్నాప్ చేశారనే నెపంతో ఘంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమఠం), విక్రమ్ (కృష్ణ చైతన్య) లని విచారిస్తుంటారు పోలీసులు. అయితే ఆమె సదరు అధికారులను సంప్రదించినప్పుడు, ఆ ముగ్గురి పేర్లను క్లియర్ చేసి, ఆపై వారితో మంచి స్నేహాన్ని ఏర్పరుచుకోవడం, అనంతరం పలు విషయాలు ఊహించని మలుపు తీసుకోవడం జరుగుతుంది. ఇంతలో, విక్రమ్ మరియు హారిక (దర్శన బానిక్) ఒక ప్రాజెక్ట్‌లో మునిగిపోతారు, రాహుల్ హంసలేఖ కోసం కథను రాస్తుంటాడు మరియు ఘంటా రవి కార్పొరేటర్ సీటును సాధించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. మరి వారి ప్రణాళికలు ఎడతెరిపి లేకుండా సాగిపోయాయా, వారి పనులకు వారివారి జీవిత భాగస్వాములు ఎలా స్పందించారు, అనేది మొత్తం కూడా మిగతా కథ. దానిని మనం స్క్రీన్ మీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ సిరీస్ ని ఆకట్టుకునెలా సాగడంలో పాత్ర పోషించిన మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం లని మెచ్చుకోవాలి. మంచి ఎంటెర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ని కూడా సెకండ్ పార్ట్ లో జొప్పించారు. ఇక ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, అభినవ్, కృష్ణ చైతన్య ముగ్గురు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించడంతో పాటు ఆడియన్స్ మనసు దోచేలా యాక్ట్ చేసారు. ముఖ్యంగా పలు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కథానాయికలుగా నటించిన జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి మరియు దేవియాని శర్మలు కథనానికి తగ్గట్లుగా తమ పెర్ఫార్మన్స్ తో అలరించారు. ప్రారంభ మూడు ఎపిసోడ్‌లు గిలిగింతలు పెట్టె నవ్వును అందిస్తాయి, అయితే చివరి విడత భావోద్వేగంతో కూడినప్పటికీ, వినోదాన్ని కూడా అందిస్తుంది. అభినవ్ గోమఠం మరియు ప్రియదర్శి యొక్క కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది మరియు సీరత్ కపూర్ యొక్క పాత్ర ఈ సిరీస్ లో ఎంతో బాగుంది. తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, ముక్కు అవినాష్ వినోదాన్ని అందించాడు, రోహిణి హాస్యం పలు సీన్స్ ని వినోదభరితంగా మారుస్తుంది. ఇతర నటీనటులు కూడా సంతృప్తికరమైన ప్రదర్శనను అందించారు.
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఈ సిరీస్ లోని మొదటి మూడు ఎపిసోడ్స్ ఆడియన్స్ కి మంచి హాస్యాన్ని అందించడంతో పాటు టైం తెలియకుండా చేస్తాయి, అయితే నాలుగవ ఎపిసోడ్ నుండి ఒకింత కథనం నెమ్మదించడంతో పాటు కామెడీ కూడా అక్కడక్కడా మాత్రమే ఉంటుంది. సీరత్ కపూర్ పాత్ర బాగున్నప్పటికీ మరింతగా పొడిగించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక రోహిణి పాత్ర మొదటి పార్ట్ మాదిరిగా మాములుగా కామెడీ తో సాగుతుంది. విక్రమ్ అత్తగారిపై దృష్టి సారించే సన్నివేశాలు మరియు పెంపుడు జంతువుల గురించి చర్చల సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. అలానే దర్శన బానిక్ పాత్రను మరింత లెంగ్త్ ఉండేలా రాసుకుని ఉండవచ్చు.
సాంకేతిక వర్గం :
ఇక ఈ సిరీస్ దర్శకుడు అరుణ్ కొత్తపల్లి, మహి వి రాఘవ్ మరియు ప్రదీప్ అద్వైతం నుండి ఆకట్టుకునే ఇన్‌పుట్‌తో, ఈ సిరీస్ వినోదభరితమైన అంశాలతో కుటుంబ సభ్యులు అందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేసే విధంగా రాసుకున్నారు. ఈ సిరీస్ సంతృప్తికరమైన నిర్మాణ విలువలను కలిగి ఉంది, ముఖ్యంగా సంగీతం, సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పరంగా, 10000 BC ఎపిసోడ్ వంటి కొన్ని మధ్య ఎపిసోడ్‌లు కథన ప్రవాహాన్ని కొనసాగించడంలో తోడ్పడ్డాయి.
తీర్పు :
మొత్తంగా సేవ్ ది టైగర్స్ 2 వెబ్ సిరీస్ అలరించే కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ప్రధాన నటీనటులైన ప్రియదర్శి మరియు అభినవ్ గోమతం కృష్ణ చైతన్య ముగ్గురూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. అయితే, కొన్ని ఎపిసోడ్స్ లో కామెడీ తగ్గుదల, కొన్ని ఎపిసోడ్‌లలో నెమ్మదిగా సాగే కథనం మరియు రోహిణి వంటి పాత్ర యొక్క పరిమిత కామెడీ సీన్స్ కొంత మైనస్. ఇక ఈ లోపాలు ఉన్నప్పటికీ, ఈ సిరీస్ ని వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా చూసేయవచ్చు.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team