విడుదల తేదీ : జూలై 19, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్ మళ్ల తదితరులు
దర్శకుడు: విస్కీ
నిర్మాత : ఐ భరత్
సంగీత దర్శకుడు: ప్రశాంత్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: సంకీర్త్ రాహుల్
ఎడిటర్ : నరేష్ అడుప
సంబంధిత లింక్స్: ట్రైలర్
యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది బర్త్‌డే బాయ్’ మూవీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. యంగ్ టీమ్‌తో ఓ యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ ఐదుగురు స్నేహితులు, తమలో ఒకరి బర్త్‌డే వేడుకను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. ఈ పార్టీలో మద్యం సేవించిన ఫ్రెండ్స్, బర్త్‌డే బాయ్‌ని ఆటపట్టిస్తుంటారు. అయితే, అనుకోని విధంగా బర్త్‌డే బాయ్ మరణించడంతో, మిగతా ఫ్రెండ్స్ భయాందోళనకు గురవుతారు. వారు తమ కెరీర్‌ను కాపాడుకునేందుకు ఏం చేశారు.. వారికి ఈ విషయంలో ఎవరు సాయం చేశారు.. బర్త్‌డే బాయ్ మృతికి అసలు కారణం ఏమిటి.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
నిజజీవితంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు విస్కీ రాసుకున్న కథ బాగుంది. స్నేహితుల మధ్య అనుకోని ఘటన జరిగినప్పుడు వారు ఎలా స్పందిస్తారు అనే అంశాన్ని చక్కగా చూపెట్టారు. ఓ సస్పెన్స్ అంశాన్ని కథలో భాగంగా ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది.
అనుకోకుండా ఓ క్రైమ్ జరగడం, దాని నుంచి తప్పించుకునేందుకు ఆ స్నేహితులు పడే టెన్షన్‌ను చక్కగా క్యారీ చేశారు. అయితే, ఈ ప్రమాదం నుంచి వారిని తప్పించేందుకు కథలోకి మరిన్ని పాత్రలు ఎంటర్ కావడం.. వారు కూడా సస్పెన్స్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది. ఈ క్రమంలో జరిగిన క్రైమ్‌కి సంబంధించి వారు పలు కొత్త విషయాలను తెలుసుకునే తీరును బాగా చూపెట్టారు. కథలోని పలు కీలక సన్నివేశాలను చక్కగా ప్రెజెంట్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్‌తో ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతారు.
ఈ సినిమాకు సంబంధించిన బీజీఎం సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. కథ మొత్తం నైట్‌లోనే జరగడంతో సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. రవికృష్ణ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్నేహితులుగా నటించిన వారు కొత్తవారైనా, వారు తమ పర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేశారు.
మైనస్ పాయింట్స్:
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన బలమైన ప్లాట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ఓ సాధారణ పాయింట్‌తో సినిమాను నడిపించాలని చూసిన తీరు సినిమాకు మైనస్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ మధ్య ఓ సమస్య వస్తే వారు దాన్ని పరిష్కరించేందుకు చేసే ప్రయత్నాలేవీ మనకు కనబడవు. వేరొకరి సాయంతో వారు తమ సమస్య నుండి బయటపడాలని చూస్తారు. ఇక ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌తో ఎంగేజ్ చేసిన కథ, సెకండాఫ్‌లో చాలా ఫ్లాట్‌గా సాగుతుంది.
ఎమోషన్‌ను పండించేందుకు పలు సీన్స్‌ను బలవంతంగా కథలో ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సస్పెన్స్‌ను సెకండాఫ్ మొదలవగానే రివీల్ చేయకుండా, ఇంకాసేపు క్యారీ చేసి ఉంటే బాగుండేది. ఒక్కసారి సస్పెన్స్ రివీల్ కాగానే, సినిమా చాలా నార్మల్ మూవీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌తో సినిమాపై నెలకొన్న ఆసక్తి సెకండాఫ్‌తో మాయం అవుతుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ కూడా సినిమాకు మైనస్‌గా మారాయని చెప్పాలి.
రాజీవ్ కనకాల లాంటి యాక్టర్‌ను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. సెకండాఫ్‌లో ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ను ఇంకాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది.
సాంకేతిక విభాగం:
యధార్థ ఘటనలను సినిమాటిక్‌గా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు విస్కీ సక్సెస్ అయ్యాడు. ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ కథను ప్రేక్షకులకు బోరింగ్ అనిపించకుండా ప్రెజెంట్ చేసేందుకు జాగ్రత్త పడ్డాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ప్రశాంత్ శ్రీనివాస్ మ్యూజిక్ వర్క్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా బీజీఎం చాలా బాగా వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్‌గా ‘ది బర్త్‌డే బాయ్’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథగా యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయినా.. ల్యాగ్ సీన్స్, ట్యాలెంటెడ్ యాక్టర్స్‌ను పూర్తిగా వినియోగించుకోకపోవడం వంటి అంశాలు డిజప్పాయింట్ చేస్తాయి.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team