బుల్లితెరపై టాప్ యాంకర్‌గా ఉన్న సుమ, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. గతంలో సుమ చేసిన ఓ యాడ్ కారణంగా పలువురు సామాన్యులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామంటూ వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌కి సంబంధించిన యాడ్‌లో సుమ చెప్పినందుకే తాము ఫ్లాట్స్ కొన్నామని.. ఇప్పుడు పూర్తిగా మోసపోయామంటూ బాధితులు చెబుతున్నారు.
ఈ వివాదానికి సంబంధించి ఓ మీడియాలో వార్త రావడంతో యాంకర్ సుమ దీనిపై తాజాగా స్పందించింది. రాకీ అవెన్యూస్ అనే సంస్థతో తాను 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని.. ఆ సమయంలోనే వారికి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ చేశానని సుమ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థతో తనకు ఎలాంటి లావాదేవీలు, సంబంధం కానీ లేదని.. తనకు సంబంధించిన వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారని సుమ తెలిపింది.
దీంతో ఇప్పుడు సుమ న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.. తనకు సంబంధం లేని వివాదంలోకి లాగుతున్నారని సదరు సంస్థపై ఆమె ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ప్రజలు కూడా వాస్తవాలను గుర్తించాలని ఆమె తాజాగా ఓ లేఖ రూపంలో కోరింది.