ఓటీటీ సమీక్ష: ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష: ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

Published on Nov 27, 2024 12:38 AM IST
Freedom At Midnight Webseries in Telugu

విడుదల తేదీ : నవంబర్ 15, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సిద్ధాంత్ గుప్త, చిరాగ్ వోహ్ర, రాజేంద్ర చావ్లా, ల్యూక్ మెక్గిబ్ని, కార్డీలియా బుగెజా, ఆరిఫ్ జకారియా, తదితరులు

దర్శకుడు : నిఖిల్ అద్వానీ

నిర్మాతలు : నిఖిల్ అద్వానీ, మోనిషా అద్వానీ, మధు భోజ్వాని

సంగీత దర్శకుడు : అశుతోష్ పాఠక్

సినిమాటోగ్రఫీ : మలేయ్ ప్రకాష్

ఎడిటింగ్ : శ్వేతా వెంకట్

సంబంధిత లింక్స్: ట్రైలర్

భారతదేశ స్వాతంత్ర్యం, విభజనపై ల్యారీ కొల్లిన్స్, డొమినిక్ లాపియెర్రె రచించిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ నవల ఆధారంగా ఇదే టైటిల్‌తో నిఖిల్ అద్వానీ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. భారతదేశం రెండు ముక్కలుగా ఎందుకు విడిపోయిందనే విషయాన్ని ఈ వెబ్ సిరీస్‌లో చూపెట్టారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

 

కథ:

అఖండ భారతదేశం విభజనకు ముందుకు జరిగిన పలు రాజకీయ, మతపరమైన ఘర్షణల కారణంగా దేశం అల్లకల్లోలంగా మారుతంది. ఈ క్రమంలో బ్రిటిష్ వారు ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు భారతదేశంలోని కాంగ్రెస్, ఆలిండియా ముస్లిం లీగ్, అకాలి దల్ పార్టీలతో చర్చలు జరుపుతుంది. అయితే, ఈ చర్చలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి..? ఈ చర్చలకు ఎలాంటి రాజకీయాలు తోడయ్యాయి..? మహాత్మా గాంధీకి ఈ చర్చలతో ఎలాంటి సంబంధం ఉంది..? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

అఖండ భారతదేశం రెండుగా విడిపోయే ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మనకు ఇందులో స్పష్టంగా చూపెట్టారు. ఆ సమయంలో రాజకీయంగా నెలకొన్న సమస్యలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయో కూడా మనకు ఇందులో చక్కగా చూపెట్టారు. చాలా మందికి తెలిసిన చరిత్రను మరికొంత ఆసక్తిగా చెప్పే ప్రయత్నం ఈ వెబ్ సిరీస్ ద్వారా చేశారు.

కేవలం రాజకీయ కారణాలే కాకుండా మతపరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. వాటిని పరిష్కరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి.. అనేవి మనకు ఇందులో వివరంగా చూపెట్టారు. చాలా మందికి తెలియని గాంధీని మనం ఈ వెబ్ సిరీస్‌లో చూడగలం. దేశం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటో మనకు ఇందులో చూపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ పాత్ర వెబ్ సిరీస్‌కు ప్రాణంగా నిలిచిందని చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

మన చరిత్రకు సంబంధించిన విషయాలను చూపెట్టాలనే ప్రయత్నంలో దర్శకుడు కాస్త తడబడ్డాడని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్‌లో చాలా సెన్సిటివ్ విషయాలను లేవనెత్తారు. వాటిని చాలా వరకు స్కిప్ చేసి ఉండాల్సింది. వాస్తవాలను చూపెట్టేందుకు ప్రయత్నించినా, దాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకునే విషయాన్ని అంచనా వేయలేకపోయారు.

ఇలాంటి చారిత్రక ఘట్టాలను తెరకెక్కించేటప్పుడు ఎంచుకున్న కథనం వరకు కాకుండా దాన్ని ప్రెజెంట్ చేసే విధానంపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. చరిత్రను మరింత వివరంగా చూపెట్టాలనే క్రమంలో ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది. పేస్ నెమ్మదిగా సాగుతుండటంతో ప్రేక్షకుడికి చాలా సీన్స్ విసుగు తెప్పిస్తాయి. ఉన్న సమస్యలను పదేపదే ప్రస్తావిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ నిడివి చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. చరిత్రకారుల పాత్రలను పోషించేందుకు ఎంచుకున్న యాక్టర్స్ కూడా తమవంతుగా పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో చాలా పాత్రలు ప్రేక్షకులకు నచ్చే విధంగా లేకపోవడం గమనార్హం.

సాంకేతిక విభాగం:

చరిత్రలోని చాలా విషయాలను వివరంగా చూపెట్టాలని దర్శకుడు నిఖిల్ అద్వానీ చేసిన ప్రయత్నం అభినందనీయం. కానీ, అతడు ఈ కథనాన్ని మరింత గ్రిప్పింగ్‌గా మలిచి ఉండాల్సింది. స్క్రీన్ ప్లే పై శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. ఇలాంటి పీరియాడిక్ కథనాలకు సంగీతం మేజర్ అసెట్. ఆ విషయంలో సంగీత దర్శకుడు అశుతోష్ పాఠక్ తనవంతు న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

తీర్పు:

భారతదేశ విభజనకు సంబంధించిన చరిత్రను తెలుసుకోవాలనుకునే వారు ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. మనకు తెలియని చాలా విషయాలను ఇందులో పొందుపరిచారు. అయితే, ఈ వెబ్ సిరీస్ స్క్రీన్‌ప్లే, నిడివి ప్రేక్షకులను కొంతమేర మెప్పించకపోవచ్చు. ఓవరాల్‌గా మన దేశ స్వాతంత్ర్యం వెనుక ఉన్న అసలైన వాస్తవాలను తెలుసుకోవాలంటే, ఈ వెబ్ సిరీస్‌ను ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు