విడుదల తేదీ : డిసెంబర్ 20, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఉపేంద్ర, రీష్మా నానయ్య, మురళీ శర్మ, రవి శంకర్, సాధు కోకిల తదితరులు.
దర్శకుడు : ఉపేంద్ర
నిర్మాతలు : జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్
సంగీత దర్శకుడు : బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ : హెచ్.సి. వేణుగోపాల్
ఎడిటర్ : విజయ్ రాజ్ బిజి
సంబంధిత లింక్స్: ట్రైలర్
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ ‘యూఐ’. కాగా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ప్రకృతిని సమాజంలోని కొందరు స్వార్ధపరులు నాశనం చేస్తే.. ఆ పరిణామాల ఫలితంలో నుంచి కల్కి వర్సెస్ సత్య అనే మంచి చెడు పుడితే.. ఈ క్రమంలో జరిగే నాటకీయ కోణాలు ఏమిటి ? అనే కోణంలో ఈ కథ సాగుతుంది. కొందరు దుర్మార్గులు ఓ తల్లిని పాడు చేస్తే.. ఆ తల్లి కడుపులో సత్య (ఉపేంద్ర) పుడతాడు. నలుగుర్ని కొట్టి వారి దగ్గర ఉన్న వస్తువును లాక్కునే రోజుల్లో.. చుట్టూ నలుగురి కోసం తన జీవితాన్నే అంకితం చేసే వ్యక్తిగా సత్య ఉంటాడు. సత్య మంచితనానికి అందరూ అతన్ని అభిమానిస్తూ ఉంటారు. ఐతే, అంతలోకి కల్కి (ఉపేంద్ర) కథలోకి ఎంట్రీ ఇస్తాడు. అసలు కల్కి ఎవరు ?, అతని గతం ఏమిటి ?, సమాజం పై అతనికి ఎందుకు అంత ద్వేషం ?, ఆ ద్వేషంతో కల్కి చేసిన మారణహోమం ఏమిటి ?, చివరకు ‘సత్య – కల్కి’ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది ?, మంచి కోరుకునే సత్య ఏం చేశాడు ?, ఫైనల్ గా కల్కి ఏం అయ్యాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
నేచర్ పై వినూత్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి ఉపేంద్ర తనదైన మార్క్ చూపించాడు. కథ ఎలా ఉన్నా.. ఉపేంద్ర నుంచి కోరుకునే ఎలిమెంట్స్ మాత్రం సినిమాలో బాగానే ఉన్నాయి. ఉపేంద్ర ముందుగానే చెప్పినట్టు ఈ సినిమాను ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గానే రూపొందించాడు. ముఖ్యంగా కల్కి భగవాన్ వర్సెస్ సత్య ట్రాక్, ఉపేంద్ర వన్ మెన్ షో సీన్స్.. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో వింటేజ్ ఉపేంద్ర కనిపించడం వంటి అంశాలు సినిమాలో బాగున్నాయి. మెయిన్ గా ఉపేంద్ర మ్యానరిజమ్స్ అదేవిధంగా ఆయన డైలాగ్స్ బాగున్నాయి.
కల్కి – సత్య రెండు పాత్రల్లో నటించిన ఉపేంద్ర చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా బాగా నటించాడు. ఇక ఉపేంద్ర సరసన హీరోయిన్ గా నటించిన రీష్మా నానయ్య కూడా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన మురళీ శర్మ, రవి శంకర్, సాధు కోకిల తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడిగా ఉపేంద్ర రాసుకున్న కొన్ని సన్నివేశాలు కూడా బాగానే అలరించాయి.
మైనస్ పాయింట్స్ :
నిజానికి ఉపేంద్ర సినిమా అంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. పైగా ఈ సినిమా ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది. దాంతో అంచనాలు కూడా భారీగా పెరిగాయి. అయితే, ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఉపేంద్ర టేకింగ్ అండ్ మేకింగ్ బాగున్నా.. ఆడియెన్స్‌ని కన్ఫ్యూజ్ చేయడం, అసలేం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయకుండా సినిమాను గందరగోళంగా ముందుకు తీసుకెళ్లడం, ఇక కథలో ప్లో లేకుండా.. ఇష్టం వచ్చినట్టు ప్లే రాసుకోవడం కూడా అతనికే చెల్లింది.
డీప్ ఇంటెలెక్చువల్ మీనింగ్ ఉన్న సినిమా ఇది అంటూ సినిమా స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ చూపించారు. కానీ, ఈ సినిమాలో మేటర్ కి ఆ సీన్స్ కి ఏ మాత్రం పొంతన లేదు. ఐతే, కొత్త కాన్సెప్ట్‌తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో సినిమాని తెరకెక్కించడం బాగానే ఉంది. కానీ, లాజిక్ లేకుండా ఇంట్రెస్ట్ ను బిల్డ్ చేయకుండా స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకుడు ఎలా సినిమాలో ఇన్ వాల్వ్ అవుతాడు ?, అసలు సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అంటే.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమా అలా సాగలేదు.
సెకండాఫ్ ని కాస్త డెప్త్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఎమోషనల్ గా నడుపుదామని ఉపేంద్ర మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. అనవసరమైన సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. పైగా సినిమాలో కల్కి – సత్య క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. మొత్తానికి సినిమాలో ఆకట్టుకునే అంశాలు మిస్ అయ్యాయి.
సాంకేతిక విభాగం :
మంచి కథా నేపధ్యాన్ని, కథాంశాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన ఉపేంద్ర, ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. హెచ్.సి. వేణుగోపాల్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగాలేదు. ఇక ఉపేంద్ర ఆలోచనను నమ్మి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు నిర్మాతలు. నిర్మాతలుగా జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘యూఐ’ అంటూ వచ్చిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ వైవిధ్యంగా ఉన్నప్పటికీ, కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది. కాకపోతే, ఉపేంద్ర తీసుకున్న కథాంశం, కొన్ని యాక్షన్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, చాలా సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే ప్లో లేకుండా గందరగోళంగా ప్లే సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఉపేంద్ర సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు పర్వాలేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team