ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తున్న వసూళ్లకు తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే, ఈ సినిమాకు ఎంత ప్రశంసలు దక్కుతున్నాయో.. అంతే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై, హీరో అల్లు అర్జున్ పై పలువురు మండిపడుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై పలు విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా హీరో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన వివరణ ఇచ్చాడు. అయితే, తాజాగా తెలంగాణకు చెందిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ మరో దుమారం రేపుతున్నాయి. ఆయన నేడు ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును సంధ్య థియేటర్ ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు అందించేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన పుష్ప-2 సినిమా చూశానని.. మూడున్నర గంటల టైమ్ వేస్ట్ అయ్యిందని.. ఈ సమయంలో తాను ఒక పది ఊర్లలో పర్యటించే వాడినని ఆయన కామెంట్ చేశారు. అంతేగాక, పుష్ప-2 సినిమా చూస్తే సమాజంలో యువకులు చెడు దారి పట్టే అవకాశం ఉందని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.