అదివో అల్లదివో అపురూప గ్రంధాన్ని పంచిన ఉషశ్రీ మిషన్
సికింద్రాబాద్ : 18
మూడు దశాబ్దాలపాటు ప్రతీ ఆదివారం ఆకాశవాణి కేంద్రంగా రామాయణ భారత భాగవతాల్ని తన విలక్షణ గంభీర గాత్ర వైభవంతో ప్రవచించి లక్షల శ్రోతల్ని అభిమానులుగా సంపాదించుకున్న రేడియో వ్యాసుడు స్వర్గీయ ఉషశ్రీ పేరిట కుమార్తెలు ‘ ఉషశ్రీ సంస్కృతీ సత్కారం ‘ పేరిట ప్రతీ ఏటా ఒక ప్రతిభావంతునికి పురస్కారాన్ని అందించడం ఎంతో సంస్కారప్రదమైన సంతోష అంశమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
ఉషశ్రీ మిషన్ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో ఉషశ్రీ సంస్కృతి సత్కారం పేరిట యువ ఆధ్యాత్మిక సంగీత గాయకులయిన కంభంపాటి కృష్ణ ఆదిత్య , కంభంపాటి కృష్ణశశాంక్‌లకు ‘ఉషశ్రీ సంస్కృతి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న మరొక ముఖ్య అతిథి, ప్రముఖ పండితులు పసర్లపాటి బంగారేశ్వరశర్మ మాట్లాడుతూ మహాత్ములైన ఉషశ్రీ భాగవతాన్ని ప్రతీ ఒక్కరూ చదివి పదిల పరుచుకోవాలని , తాను ఉషశ్రీ భాగవతం చదివి తన్మయమయ్యానని … ఇందుకు కారణమైన ఉషశ్రీ కుమార్తె వైజయంతికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉషశ్రీ అల్లుడు కె వీ ఎస్ సుబ్రహ్మణ్యం స్వాగతంతో మొదలైన ఈ పురస్కార వేడుకలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆరోజుల్లో ఉషశ్రీ మాట్లాడుతుంటే ఆబాలగోపాలం ఎలా ఆకర్షించబడేవారో అద్భుతంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉషశ్రీ పెద్ద కుమార్తె , అనేక పురస్కారాల గ్రహీత డాక్టర్ గాయత్రీదేవి , మరొక కుమార్తె సీనియర్ పాత్రికేయురాలు వైజయంతి మాట్లాడుతూ రాబోయే ఉషశ్రీ శత జయంతి వేడుకల గురించి విజ్ఞులైన పెద్దల సలహాలందించి తమని ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం … ప్రముఖ రచయిత , పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ రచనా సౌందర్యంగా అందిన మరొక తిరుమల గ్రంధం ‘ అదివో … అల్లదివో ‘ పరమాద్భుత గ్రంధాన్ని, తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఉషశ్రీ అల్లుడు కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో త్యాగరాయగాన సభ సిబ్బంది రసజ్ఞులైన సభికులందరికీ అందజేయడం ఈ కార్యక్రమంలో అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఉషశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన కంభంపాటి సోదరులు ఎంతో సంతోభరితమైన ప్రసంగం చేయడమే కాకుండా … తమ గానామృతాన్ని పంచి సభికుల ప్రశంసలు పొందారు. హైదరాబాద్ రవీంద్ర భారతి, త్యాగరాయగానసభలలో ప్రతీ నెలా జరిగే ఒక ముఖ్యమైన సాంస్కృతిక వేడుకలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాన్ని పంచుతారనేది మేధోసమాజానికిఎరుకే. ఈ మాసం ఉషశ్రీ వేడుకలో పంచిన ‘ అదివో … అల్లదివో గ్రంధం కూడా ఎంతో ఎంతో సమ్మోహనంగా తీర్చి దిద్దిన పురాణపండ శ్రీనివాస్ ఈ పుస్తకంలో అందించిన కంటెంట్ సూపర్బ్ అనే చెప్పాలి. ఏది ఏమైనా తన తండ్రికి కుమార్తెలు ఇలాంటి నీరాజనంతో స్మృతి సమర్పించడం పెద్దతరాలలో ఆనందాన్ని నింపిందనడంలో ఆశ్చర్యం లేదు.