‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఈ సినిమా విమర్శకులని మెప్పించకపోయినా యువత, బి,సి సెంటర్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకొని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా యువతని ఆకట్టుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి తన తదుపరి ప్రయత్నంగా మరోసారి యువతనే టార్గెట్ చేస్తూ చేసిన సినిమా ‘వెయిటింగ్ ఫర్ యు’. ఒక పెళ్ళి కాని అమ్మాయి ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాని నిర్మించారు. యక్కలి రవీంద్ర బాబు, బాపి రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ కుమార్ రెడ్డి మరోసారి యూత్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
ఫ్యాక్షన్ లీడర్ అయిన ఆదిశేసు వీరభద్రంని చంపిన కేసులో మూడు సంవత్సరాలు జైల్లో ఉండి నేరం నిరూపణ కాకపోవడంతో బయటకి వచ్చేస్తాడు. అలా బయటకి వచ్చిన ఆదిశేషుని చంపడానికి అతని తమ్ముడు పరమేశు, నరసింహులు(షఫీ)తో కలిసి ప్లాన్ చేస్తాడు. దానికోసం హైదరాబాద్ పాత బస్తీలో తన అన్న వచ్చే ఒక కేఫ్ లో బాంబు పెడతాడు. ఆ బాంబు దాడిలో గాయపడిన ఆదిశేషు కోమాలోకి వెళతాడు. ఆ ఘటనలో గాయపడిన వారిని రక్షించే కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ టీం మెంబర్స్ గా దేవా(రవి), సన(సోనీ చరిస్తా) తెరపైకి వస్తారు. అదే సంఘటనలో గాయపడిన తన నాన్న కోసం హాస్పిటల్ కి వచ్చిన స్వప్న(గాయత్రి)కి దేవా సాయం చేస్తాడు. స్వప్న తండ్రి చనిపోయినా దేవా – స్వప్న మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. అంబులెన్స్ ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడటం కోసం దేవా చేస్తున్న రిస్క్ లను చూసిన స్వప్న దేవాకి ఒక కండిషన్ పెడుతుంది. దానికి దేవా ఒప్పుకోకపోవడంతో స్వప్న దేవాని వదిలి వెళ్ళిపోతుంది.
అదే సమయంలో కోమాలో నుంచి లేచిన ఆదిశేషు తనని చంపడానికి ప్రయత్నించిన వారిని చంపడం మొదలు పెడతాడు. అందులో భాగంగానే ఆదిశేషు దేవాని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అసలు కిమ్స్ హాస్పిటల్ లో పనిచేసే దేవాని ఆదిశేషు ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు స్వప్న దేవాకి పెటిన కండిషన్ ఏమిటి? చివరికి దేవా – స్వప్న ఒకటయ్యారా? లేదా? అనే రకరకాల ట్విస్ట్ లని మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
సినిమా ప్లస్ పాయింట్స్ లో మొదటగా చెప్పాల్సిన వ్యక్తి మునిసిపాలిటీ చెత్త ఎత్తే నారిగాడి పాత్ర చేసిన ఎల్.బి శ్రీరాం గురించి మాత్రమే చెప్పాలి, సినిమాలో అతని పాత్రే హైలైట్. ఈ పాత్ర ద్వారా అతను చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. షఫీ నటన బాగుంది. హీరో పాత్ర చేసిన రవి మరియు హీరోయిన్స్ గా కనిపించిన గాయత్రి, సోనీ చరిస్తాల నటన జస్ట్ ఓకే అనేలా ఉంది. సినిమాకి వచ్చిన వాళ్ళు టైటిల్ ఒకలా ఉంది, సినిమా స్టార్టింగ్ మాత్రం ఇంకోలా ఉంది అని ప్రేక్షకుడు అనుకున్నా మొదటి పది నిమిషాలు మాత్రం ఆసక్తిగా ఉంది. ఎల్.బి శ్రీరాం చెప్పిన డైలాగ్స్ కాకుండా అక్కడక్కడా వచ్చే డైలాగ్స్ కొన్ని బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
పైన చెప్పినట్టు మొదటి పదినిమిషాలు ఏదో ఆసక్తిగా ఉన్నా ఆ తర్వాత సినిమా అంతా హాస్పిటల్, యాక్సిడెంట్స్, చావులు వీటి చుట్టే ఎక్కువగా తిరగడం ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. అలాగే డైరెక్టర్ టైటిల్, పోస్టర్ లో ఉన్నదాని కాకుండా ఆడియన్స్ కి కొత్తగా ఏమన్నా చూపించాలనుకున్నాడేమో అందుకే ఓవరాల్ గా మూవీ చూసిన ఆడియన్ కి టైటిల్ కి సినిమా కంటెంట్ కి పెద్దగా సంబంధం లేదని అనిపిస్తుంది. అలాగే కంటెంట్ కి సంబంధం లేకుండా మొదట్లో హైదరాబాద్ లో జరిగిన మాట అల్లరను చూపించడం కథకి సెట్ అవ్వలేదు. ఈ సినిమాకి ‘పెళ్లి కాని ఒక అమ్మాయి ప్రేమ కథ’ అనే టైటిల్ కంటే ‘కిమ్స్ హాస్పిటల్లోని ఓ ఆంబులెన్స్ టీం కథ’ అని పెట్టుంటే పర్ఫెక్ట్ గా సరిపోయేది. సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత మనం ఏమేమి ఊహిస్తుంటామో అవే జరుగుతుంటాయి. దాంతో సినిమాకి స్క్రీన్ ప్లే పెద్దగా సాయం చెయ్యలేకపోయింది.
సీనియర్ నటుడు రఘుబాబు చేత చేయించిన కామ రత్నం పాత్ర వృధా అయిపొయింది. రవి – గాయత్రి మధ్య రొమాంటిక్ ట్రాక్ బాలేదు. సినిమా మొత్తంగా కామెడీ అస్సలు లేదు. కానీ డైరెక్టర్ ఎలాగైనా కామెడీ పెట్టాలని జానీ ఫ్రెష్(సాయి అనిల్)- సోనీ చరిస్తా మధ్య ఓ భూతు కామెడీ ట్రాక్ ఒకటి పెట్టాడు. భూతు అని ఎందుకు అన్నానంటే ఓవరాల్ గా ఈ కామెడీ ట్రాక్ లో డైలాగ్స్ కంటే మీకు బీప్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. దీన్ని బట్టే డైలాగ్స్ లో ఎన్ని భూతులున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి కొన్ని స్టేట్మెంట్స్ చెప్పడం కోసం మాత్రమే ఈ మూవీ తీసారుభావన ఆడియన్స్ కి కలుగుతుంది. అలాగే కిమ్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ కోసం ఈ సినిమా తీసాడనుకుంటారు. చివరిగా ఈ సినిమాలో చెప్పాలనుకున్న కంటెంట్ ని సినిమాగా కంటే ఒక రెండు మూడు రకాల ప్రకటనలుగా తీసి అదే థియేటర్స్ లో వేసుంటే మంచి రెస్పాన్స్ వచ్చుండేది.
సాంకేతిక విభాగం :
ఈ మధ్య చాలా మంది డైరెక్టర్స్ కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం ఇలా సినిమాకి ముఖ్యమైన విభాగాలను డీల్ చేస్తున్నారు. కానీ చివరికి ఏదో ఒక్కదానికే న్యాయం చేసి మిగతా వాటిని సరిగా డీల్ చెయ్యలేక గంగలో కలిపేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాకి కూడా ఈ నాలుగు కీలక డిపార్ట్ మెంట్స్ ని సునీల్ కుమార్ రెడ్డి డీల్ చేసాడు. ఒక్క డైలాగ్స్ విషయంలో పరవాలేధనిపించినా మిగిలిన విభాగాలను డీల్ చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం ఓకే, ఆయన అందించిన పాటలన్నీ కూడా బ్యాక్ గ్రౌండ్ లోనే రావడంతో పరవాలేదనిపిస్తాయి. సినిమా కంటెంట్ మరియు తీసిన విధానం బాలేనప్పుడు ఎడిటర్ మాత్రం ఏమి చేస్తాడు, కానీ ఎడిటర్ తన వంతుగా ఆ కామెడీ ట్రాక్, కొన్ని అనవసర సీన్స్ లేపేసి ఉంటే బాగుండేది.
తీర్పు :
‘వెయిటింగ్ ఫర్ యు’ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టే సినిమా. కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పోస్టర్స్ చూసి సునీల్ కుమార్ రెడ్డి తీసిన చివరి సినిమా ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాగా ఉంటుందని ఆశించి వెళితే మాత్రం మీరు తీవ్రంగా నిరాశపడతారు. డైరెక్టర్ చెప్పాలనుకున్న చిన్న మెసేజ్ కి ఫ్యాక్షన్, మత కలహాలు, టెర్రరిజం, కిమ్స్ హాస్పిటల్స్ ని ముడివేసి సాగదీసి చెప్పడం ప్రేక్షకులకి బోర్ కొడుతుంది. సినిమా మొత్తానికి ఎల్.బి శ్రీరాం నటన, అతని డైలాగ్స్ హైలట్ అయితే కామెడీ లేకపోవడం, టైటిల్ కి కంటెంట్ కి సంబంధం లేకపోవడం, హాస్పిటల్ – అంబులెన్స్ చుట్టూ కథ తిరగడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది, మిగతా వారికి ఎక్కే అవకాశం లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
రాఘవ