నారా రోహిత్ నటించిన సోలో-సాలిడ్ లవ్ స్టొరీ’ చిత్రం త్వరలో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధిస్తుందని రోహిత్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సందర్భంగా నారా రోహిత్ 123తెలుగు.కాం టీంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రోహిత్ మంచి హాస్యచతురత కలిగిన నటుడు తనతో ఉన్నంతసేపు చాల బాగా మాట్లాడాడు. తను చెప్పిన మాటలు మీకోసం
ప్ర: హలో రోహిత్ సోలో ఆడియో విజయం సాదించిన సందర్భంగా శుభాకాంక్షలు
స: (చిరు నవ్వుతో) థాంక్స్
ప్ర: మీ మొదటి చిత్రం సినీ విశ్లేకుల నుండి మన్ననలు పొందింది. రెండవ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఇలా మీరు ముందుగానే అనుకుని చేసారా?
స: మీరు ఆ కోణంలో చూసుండవచ్చు. నా మొదటి చిత్రంతో ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల మన్ననలు పొందాలని అనుకున్నాను. బాణం సున్నితమైన అంశాలతో తెరకెక్కిన స్టైలిష్ మూవీ. సోలో కూడా అదే కోవకు చెందినది. రెండూ విభిన్నమైన చిత్రాలే. రెండు చిత్రాల్లో స్క్రిప్ట్ ముఖ్య పాత్ర పోషించింది.
ప్ర: సోలో పై మీ అంచనలెలా ఉన్నాయి?
సోలో బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటాను. ప్రేక్షకులకు నచ్చే పలు అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. బాణం చిత్రంలో నటనలోని కొన్ని అంశాలను మాత్రమే చూసారు. సోలో చిత్రంలో నా నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని పాటల్లో మచి డాన్సులు కూడా ఉన్నాయి. ఒక ముఖ్యమైన ఫైట్ కూడా ఉంది ఆ సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు షూటింగ్లో నేను బాగా ఎంజాయ్ చేశాను. అసలైతే నేను ఫైట్స్ బాగా రావడానికి కృషి చేస్తుంటాను. (నవ్వుతూ)
ప్ర: సినీ పరిశ్రమలోకి రావడమే మీ చిన్నప్పటి కలా?
అలాంటిది ఏమి లేదు. మా నాన్న గారికి సినిమాలంటే చాలా ఆసక్తి. నా చదువు పూర్తయ్యాక నాకు కూడా ఆసక్తి కలిగింది. తరువాత డైలాగు చెప్పే విధానం ఇక్కడ నేర్చుకున్న తరువాత ఫిలిం మేకింగ్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకోవడం ఆ క్రమంలో సినిమాల మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ఇదంతా నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు కెమెరా ముందు నటిస్తున్నప్పుడు ఉపయోగపడ్తుంది.
ప్ర: మీ రెండు చిత్రాల మద్య చాలా గ్యాప్ ఉంది. ఉద్దేశపూర్వకంగానే జరిగిందా?
స: లేదు, రెండు ప్రాజెక్టులు చేయాలనీ అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అవి కార్యరూపం దాల్చలేదు. అంత గ్యాప్ రావాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదు. కానీ అంతా మన చేతుల్లో ఉండదు కదా. (నవ్వుతూ)
ప్ర: సోలో చిత్రంలో పని చేయడం ద్వారా మీ అనుభూతి ఎలా ఉంది?
స: ఇది చాలా గొప్ప అనుభవం. పరుశురాం నాకు ఫ్రెండ్ లాంటి వాడు షూటింగ్ జరుగుతున్న సమయంలో మేము బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. అతను మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. త్వరలో మేమిద్దరం కలిసి మరో చిత్రం చేస్తాం. ప్రారంభంలో ప్రకాష్ రాజ్ గారితో నటించడానికి భయపడే వాడిని. ఆయన అద్భుతమైన నటుడు. నటనలో ఆయన దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. ప్రకాష్ రాజ్ గారి నటన కెమెరా ముందు చూడటం గొప్ప అనుభూతి. ఈ చిత్రంలో మా మద్య కొన్ని కీలకమైన సన్నివేశాలున్నాయి.
ప్ర: నిషా అగర్వాల్ పనితీరు ఎలా ఉంది?
ఆమె ఈ చిత్రానికి బలం. మొదట్లో ఆ అమ్మాయి సరిగా చేయగలుగుతుందో లేదో అని భయపడ్డాం. కానీ తను ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది. షూటింగ్ కి త్వరగా వచ్చేది. తను పడిన కష్టం తెరపై మీకే కనిపిస్తుంది.
ప్ర: మీకు ఇండస్ట్రీలో ఎవరు బాగా తెలుసు?
నిజంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ గడపను. అపుడపుడు కొన్ని సినిమా వేడుకలకి మాత్రమే హాజరయ్యే వాడిని. ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడటం, సినిమాలు చూడటం చేస్తుండే వాడిని. నేను ప్రతి శుక్ర వారం ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్స్ కు వెళ్తుంటాను.
ప్ర: సరి అది వదిలేద్దాం, ఇండస్ట్రీలో మీకు నచ్చిన నటులు ఎవరు?
నేను ఎన్టీఆర్ గారికి పెద్ద అభిమానిని. పౌరాణిక పాత్రలు చేయడంలో ఆయనని మించిన వారు లేరు. సూర్య కూడా నచ్చుతాడు. తను ప్రతి పాత్ర వైవిద్యంగా ఉండేలా చేస్తాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే మహేష్ మరియు ప్రభాస్ యాక్టింగ్ అంటే ఇష్టం.
ప్ర: మీకు పౌరాణిక పాత్రలంటే ఇష్టం అని వినడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఏదైనా పౌరాణిక సినిమా చేస్తారా?
స: నాకు దుర్యోధనుడి పాత్రంటే ఇష్టం. ఆ పాత్ర చేయడానికి ఇష్ట పడతాను. ప్రతీ ఒక్కరు నా గొంతు బావుంటుందని అంటారు.
123తెలుగు.కాం టీం