ప్రత్యేక ఇంటర్వ్యూ : మంచు విష్ణు – వర్మ ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తాడు..
తన 11 ఏళ్ళ కెరీర్లో చేసిన 12 సినిమాలలో ఎక్కువ భాగం లవ్, కామెడీ ఎంటర్టైనర్స్ మాత్రమే చేసిన మంచు విష్ణు మొదటి సారి పూర్తిగా తన రూటు మార్చి ఫుల్ లెంగ్త్ సీరియస్ పాత్ర చేసిన సినిమా ‘రౌడీ’. ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి మంచు విష్ణుతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం.. సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విష్ణు చెప్పిన ‘రౌడీ’ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ఈ సినిమాకి మీరు సైన్ చేయడానికి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన విషయం ఏమిటి?
స) ఒకటే పేరండి అదే రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఫెంటాస్టిక్ గా అనిపించింది. సో ‘రౌడీ’ మీ ముందుకు వస్తోంది.
ప్రశ్న) ‘రౌడీ’ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఆ పాత్ర గురించి చెప్పండి?
స) నేను ఇప్పటి వరకూ కామెడీ టచ్ ఉన్న సినిమాలు చేసాను. కానీ ఇందులో అస్సలు కామెడీ ఉండదు, ఫుల్ లెంగ్త్ సీరియస్ గా ఉండే రోల్ చేసాను. ఈ సినిమాలో నాన్నగారిని అన్నగారు అంటారు, ఆయన కొడుకుగా నేను నటించాను. ప్రజల మంచి కోసం పోరాడాలి అనుకునే అన్నగారినే లేపేయాలని కొందరు అనుకున్నప్పుడు అనుకోకుండా అడ్డుకోవడానికి నేను రంగలోకి దిగుతాను. ఒక కుర్రాడు అంత పెద్ద సమస్యని ఎలా పరిష్కరించగలిగాడు అనేదే నా పాత్ర.
ప్రశ్న) మొదటి సారి ఫ్యాక్షన్ సినిమా చేసారు, అది కూడా మోహన్ బాబు గారికి పోటీ ఇచ్చే స్థాయిలో పెర్ఫార్మన్స్ చేయాలి. దీనికోసం మీరు ప్రత్యేక హోం వర్క్ ఏమన్నా చేసారా?
స) అవును ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. సినిమాలో నాన్నగారికి పోటా పోటీగా ఉండే పాత్ర నాది. నాన్నగారు అద్భుతమైన నటుడు, అలాగే వర్మ అద్భుతమైన డైరెక్టర్. అందుకే నాన్నగారికి పోటీగా చేయాలంటే స్క్రీన్ మీద నాన్నగారి కంటే నేను ఎక్కువ స్క్రీన్ స్పేస్ తినెయ్యాలి అనే కాంపిటీషన్ స్పిరిట్ తో ఈ సినిమా చేసాను.
ప్రశ్న) పూర్తి సినిమా చూసాక మీకు ఏమనిపించింది? మీ పెర్ఫార్మన్స్ కి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమన్నా వచ్చాయా?
స) సినిమా చూసాక ఒక్కటే అనిపించింది.. ఈ సినిమాలో నన్ను చూసి మా నాన్నగారు చాలా గర్వంగా ఫీలవుతారు. అలాగే ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇటీవలే వైజాగ్ లో ‘విష్ణు – ది బెస్ట్ యాక్టర్’ అని వర్మ గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. అమితాబ్ లాంటి హీరోలతో పనిచేసిన అంత పెద్ద డైరెక్టర్ నుంచి అంత బెస్ట్ కాంప్లిమెంట్ అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
ప్రశ్న) డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పండి? అలాగే మీ కెరీర్లో చాలా ఫాస్ట్ గా చేసిన సినిమా. ఆ వాతావరణం మీకు ఎలా అనిపించింది?
స) వర్మ గారితో వర్కింగ్ ఒక వండర్ ఫుల్ జర్నీ అని చెప్పాలి. ఇక ఆయన గురించి చెప్పాలి అంటే.. భారతదేశంలోనే వర్మ చాలా గొప్ప డైరెక్టర్ అనే పేరు వర్మ గారికి ఎందుకు ఉందో అనేది ‘రౌడీ’ సినిమాతో మరోసారి తెలుస్తుంది. మామూలుగా యాక్షన్ సినిమా అంటే 70, 80 రోజులు తీసుకుంటుంది. కానీ 42 రోజుల్లో ఈ సినిమాని షూట్ చేసామంటే వర్మ గారు ఒక్కొక్కరి బెండు తీసారని అర్థం. ఎంతైనా డైరెక్టర్ గొప్పోడు అందుకే సినిమా ఇంత త్వరగా అయిపోయింది.
ప్రశ్న) ఈ సినిమాకి కీలకమైన వారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు?
స) డా. మోహన్ బాబు – నా దేవుడు.
రామ్ గోపాల్ వర్మ – నా గురువు.
జయసుధ – వెల్ హ్యూమన్ బీయింగ్.
శాన్వి – క్యూట్.
సాయి కార్తీక్ – బండిల్ ఆఫ్ టాలెంట్.
ప్రశ్న) ముందే కామెడీ లేదు, పైగా 11 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ చేసారు. అంత పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ని ఆడియన్స్ చూస్తారా అన్న అనుమానం మీకు కలగలేదా?
స) రిస్క్ తీసుకోకపోవడమే చాలా పెద్ద రిస్క్. అందుకే రిస్క్ తీసుకొని కామెడీ లేకుండా సినిమా చేసాం. ఇక యాక్షన్ ఎపిసోడ్ విషయంలో మీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చింది. అదే విషయాన్ని నేను వర్మ గారిని అడిగితే ఇప్పుడేం మాట్లాడవద్దు. రీ రికార్డింగ్ అయ్యాక చూడు అన్నారు. ఫైనల్ వెర్షన్ చూసాక ఫెంటాస్టిక్ గా అనిపించింది. ఇప్పటికి ఆ ఫైట్ ని నేను ఒక 150 సార్లు చూసి ఉంటా.. చూసిన ప్రతిసారి రోమాలు నిక్క బొడుచుకుంటాయి. అలాగే ఆడియన్స్ కూడా అలానే ఫీలవుతారని నమ్ముతున్నాను.
ప్రశ్న) ‘రౌడీ’ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేమి ఆశించవచ్చు? అలాగే హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమాలో అస్సలు కామెడీ ఉండదు. కామెడీ ఆశించి వస్తే మీరు నిరుత్సాహపడతారు. అదే హై వోల్టేజ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాని ఆశించి వస్తే మాత్రం 100% సంతృప్తి చెందుతారు. ఇంటర్వెల్ టైంకి అందరూ స్పెల్ బౌండ్ అయిపోతారు. అలాగే ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో సెంటిమెంట్ ఉండదు కానీ ఈ సినిమా సెకండాఫ్ లో ఆయన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తాడు. మేజర్ హైలైట్స్ అంటే నాన్నగారి పెర్ఫార్మన్స్, పంచ్ డైలాగ్స్, వర్మ గారి టేకింగ్. నాన్న గారికి ఒక అభిమానిగా ఆయన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ‘రౌడీ’ అని చెబుతాను.
ప్రశ్న) ఈ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా అడుగేస్తున్నారు. ఆ విశేషాలు చెప్పండి?
స) 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నుండి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది మా బ్యానర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఓవర్సీస్ లో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. కానీ దాన్ని బ్రేక్ చేసి మా ద్వారా ప్రతి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీని గురించి మిగిలిన పూర్తి వివరాలను త్వరలో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తాం.
ప్రశ్న) మీరు ఒక కథ ఓకే చేసేటప్పుడు ఏమేమి చూస్తారు? అలాగే మీ తదుపరి సినిమాలు ఏమిటి?
స) స్క్రిప్ట్ వినేటప్పుడు హీరో క్యారెక్టర్, ఎమోషన్ చూసే సైన్ చేస్తాను. ప్రస్తుతం వర్మ గారితో ఓ సినిమా చేస్తున్నాను. ఆ మూవీ విశేషాలను ఆయనే అనౌన్స్ చేస్తారు. అది కాకుండా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ విశేషాలు ‘రౌడీ’ రిలీజ్ తర్వాత అనౌన్స్ చేస్తారు.
సినిమా రిలీజ్ విషయంలో బిజీగా ఉన్న మంచు విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..
రాఘవ