లావణ్య ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న కథానాయిక. ఈ మధ్య కాలంలో వచ్చిన నూతన కథానాయికలలో లావణ్య గురించి ఎక్కువగా చర్చించు కుంటున్నారు. తన సహజమైన అందంతో సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అలాంటి లావణ్యతో మేము ఇంటర్వ్యూ జరిపాము. తన ఆనందకరమైన మనస్తత్వం, తన అందం మరియు తను వృత్తిని గౌరవించే విధానం ఎంతో బాగుంది. లావణ్య ‘అందాల రాక్షసి’ చిత్రంలో తను చేసిన మిథున పాత్ర గురించి, ఈ చిత్రానికి సంబందించిన విశేషాలు మరియు తన పర్సనల్ లైఫ్ గురించిన విశేషాలను మాకు తెలియజేశారు. ఆ విశేశాలేంతో చూసేద్దమా..
ప్రశ్న) ‘అందాల రాక్షసి’ గా మీ ఫీలింగ్ ఎలా ఉంది?
జ)(నవ్వుతూ) ఆ ఫీల్ చాలా గొప్పగా ఉంది. ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో ఎన్నో మరపురాని అనుభూతులు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రంలోని మిథున పాత్ర నా ఒరిజినల్ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు మన లైఫ్ టైంలో ఒకసారే వస్తాయి, అందుకే ఈ చిత్ర కథ వినగానే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతానికి నేను పేర్లు చెప్పాను కానీ ఈ చిత్రం కోసం నేను ఒక బాలీవుడ్ సినిమాని కూడా వదులుకున్నాను. కానీ నేను సంతోషంగా ఉన్నాను.
ప్రశ్న) చాలా ఆశ్చర్యంగా ఉంది. ‘అందాల రాక్షసి’ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?
జ)నేను నా పని నుండి కొంత కాలం విశ్రాంతి తీసుకొని ముంబైలోని నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తను నన్ను మేకప్ లేకుండా వాళ్ళ ఆఫీస్ కి ఒకసారి రమ్మంది. ఒక కొత్త చిత్రం కోసం మేకప్ లేకుండా సహజంగానే అందంగా ఉండే ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఆ రోజు నావి కొన్ని ఫోటోలు తీసి హనుకి పంపారు. మరుసరోజు హను నన్ను కలవడానికి వచ్చారు. హను చాలా కూల్ మరియు యంగ్ మాన్, అసలు ఆయనే దర్శకుడు అని కూడా నాకు తెలియదు. తను నా దగ్గర నుంచి ఎలాంటి ఆడిషన్ తీసుకోలేదు. నన్ను వేరే వాళ్ళతో మాటల్లాడమన్నారు నేను మాట్లాడే విధానాన్ని కొంత సేపు గమనించి , నా దగ్గరకి వచ్చి ఈ సినిమాకి మిమ్మల్ని ఎంపిక చేశాను అని చెప్పారు. నేను షాక్ అయ్యాను మరియు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను.
ప్రశ్న) మీరు బాలీవుడ్ చిత్రాన్ని వదులుకునేంత ప్రత్యేకత ‘అందాల రాక్షసి’ సినిమాలో ఏముంది?
జ)బాలీవుడ్ సినిమా మరియు ‘అందాల రాక్షసి’ సినిమాలు రెండూ ఒకే సమయంలో తెరకెక్కనున్నాయి. ఒకే సారి రెండు సినిమాల్లోనూ నటించే అవకాశం లేదు. ఈ చిత్ర దర్శకుడు హను ఈ చిత్ర కథ పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు మరియు తను ఒకసారి నన్ను కథ వినమన్నాడు. ఒకసారి కథ విన్న తర్వాత ఈ పాత్రను నేనే చెయ్యాలి ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వకూడదు అని అనుకున్నాను. హను సుమారు నాలుగు గంటల పాటు కథ చెప్పారు మరియు సినిమాలోని చిన్న చిన్న విషయాల్ని కూడా వివరించి చెప్పారు దానితో మిథున పాత్రతో ప్రేమలో పడిపోయాను. ఈ రెండు కథలూ విన్న తర్వాత ఎంతో సులువుగా కష్టపడకుండా ‘అందాల రాక్షసి’ సినిమాని ఎంచుకున్నాను.
ప్రశ్న) ఈ చిత్రం కోసం సుమారు ఒక సంవత్సరం పాటు హనుతో కలిసి పని చేశారు. ఇప్పుడు ఒక దర్శకుడిగా హనుకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు?
జ)హను చాలా యంగ్ కానీ ఫిల్మ్ మేకింగ్ లో మాత్రం ఎంతో అపారమైన పరిజ్ఞానం ఉంది. నేను మొదటి సారి అతన్ని కలిసినప్పుడు అతను అసిస్టెంట్ డైరెక్టర్ అనుకున్నాను కానీ అతను ఎంతో పరిణతి చెందిన వ్యక్తి మరియు అతనికి ఏమి కావాలో చాలా ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి. సెట్ లో హనునే నాకు మార్గ నిర్దేశకుడు. నా మోడలింగ్ కెరీర్లో ఎంతో మంది పెద్ద పెద్ద యాడ్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేశాను కానీ వారందరి కంటే హనునే బెస్ట్ . హనుతో పని చేయడం నన్ను నేను మెరుగు పరచుకోవడానికి దొరికిన ఒక చక్కనైన అవకాశం.
ప్రశ్న) లావణ్యకి ‘అందాల రాక్షసి’ చిత్రంలో నచ్చిన అంశాలు ఏవి?
జ)(ఒక నవ్వు నవ్వి) ఒక చిన్న టౌన్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండే సింపుల్ అమ్మాయి మిథున. ఒక సాదారణ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ అమ్మాయి మన సంస్క్రతికి చాలా విలవనిస్తుంది. తనకి పార్టీలు అలవాటు ఉండవు, చాలా అమాయకంగా, ఆనందంగా ఉండే స్వచ్చమైన అమ్మాయి. ఈ చిత్రం మొత్తం ఆమె పాత్ర అలానే ఉంటుంది. బహుశా ఒక పువ్వు ఎలా పరిమళిస్తుందో అలా ఉంటుంది ఆ అమ్మాయి పాత్ర.
ప్రశ్న) తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగు నేర్చుకోవడం కోసం ఏమన్నా కష్టపడ్డారా?
జ)నాకు భాష పెద్ద సమస్య కాదండీ, మామూలుగా ఒక పనిని పూర్తి నమ్మకంతో, భాద్యతాయుతం గా చేయాలనుకునే మనస్తత్వం నాది. అందుకే తెలుగు నేర్చుకున్నాను, అందుకోసం కొన్ని క్లాసులు తీసుకున్నాను. హైదరాబాద్ కి నా నివాసం మార్చుకున్న తర్వాత నా తెలుగు మెరుగుపరుచుకోవడం మరింత సులువైపోయింది. నా డైలాగ్స్ అన్ని నేనే తెలుగులో చెప్పాను మరియు నా పాత్రకి డబ్బింగ్ చెప్పిన చిన్మయి మీ నటన డబ్బింగ్ చెప్పడానికి చాలా సహాయ పడిందని అన్నారు.
ప్రశ్న) ప్రస్తుతం ‘అందాల రాక్షసి’ చిన్న సినిమా కాదు. ఈ సినిమాకి మంచి టాక్ వస్తోంది మీరు ఉద్వేగానికి లోనవుతున్నారా?
జ)అందాల రాక్షసి చిన్నదైన ఒక పెద్ద సినిమా (అని ఒక చిలక నవ్వు నవ్వింది). నేను చెప్పలేనంత ఉద్వేగానికి లోనవుతున్నాను కానీ కొంత భయంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రేక్షకులందరూ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు, అలాంటి మంచి చిత్రమే మా చేతుల్లో ఉంది, వారి అంచనాలను ఖచ్చితంగా అందుకుంటామని భావిస్తున్నాను.
ప్రశ్న) మీరు పానీపూరీకి పెద్ద అభిమాని అని మాకు తెలుసు, అది కాకుండా మీకు నచ్చిన ఇతర వంటకాలు ఏంటి?
జ)(ఒక్కసారి అవాక్కై) మీకెలా తెలుసండీ? నవ్వుతూ మీరు నాగురించి బాగా తెలుసుకున్నట్టున్నారు. అవునండీ నేను పానీపూరీకి పెద్ద ఫ్యాన్. అదికాకుండా నాకు చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ చైనీస్ ఫుడ్ ఎక్కువ తింటే మన చర్మానికి అంత మంచిది కాదు, అందుకే నేను ఎక్కువగా తినడం లేదు.
ప్రశ్న) నటించడం కాకుండా మీకు నచ్చిన అభిరుచులేంటి?
జ)నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నా స్కూల్ రోజుల నుండే డాన్సు చెయ్యడానికి చల్ల ఇష్ట పడేదాన్ని. నాకు ఉన్న పనుల వల్ల అంతగా దాని మీద దృష్టి పెట్టలేకపోయాను. నేను డాన్స్ లో స్పీడ్ పెంచుకోవడానికి మళ్ళీ డాన్సు పాటాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. అది కాకుండా ట్రావెలింగ్, ట్రెక్కింగ్ మరియు రాఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా బయట ప్రదేశాల్ని చూడటం ఇష్టపడే అమ్మాయిని.
ప్రశ్న) మీతో పాటు నటించిన రాహుల్ మరియు నవీన్ ఎలా చేశారు?
జ)నేను నవీన్ తో సెట్స్ లో పెద్దగా మాట్లాడలేదు ఎందుకంటే సినిమాలో మా పాత్రలు అలా ఉంటాయి. రాహుల్ పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. కానీ అతను ఎక్కువగా మాట్లాడడు. అవి కాకుండా వాళ్ళిద్దరూ చాలా మంచి వారు. మేమంతా ఒకే వయస్సు వారు కావడంతో సెట్స్ లో బాగా అల్లరి చేసే వాళ్లము. మేము మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళము , మా మధ్య మంచి స్నేహ బందం ఏర్పడింది.
ప్రశ్న) తెలుగులో మీకు నచ్చిన తారలు ఎవరు?
జ)నాకు తెలుగులో అందరు పెద్ద హీరోలు బాగా తెలుసు, నేను సౌత్ ఇండియన్ సినిమాలు బాగా చూసేదాన్ని. నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం. నాగార్జున కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు అందువల్ల ఆయన ఎక్కువగా తెలుసు. ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసే అవకాశం నాకు రాలేదండి కానీ ఆ సినిమా చాలా బాగుందని విన్నాను. ఈ మధ్య నేను ‘ఈగ’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘ఇష్క్’ మరియు ఇంకొన్ని సినిమాలు చూశాను.
ప్రశ్న) ఇండస్ట్రీలో ఎవరైనా స్నేహితులు ఉన్నారా?
జ)స్నేహితులెవరూ లేరండీ. ‘అందాల రాక్షసి’ సినిమా పూర్తవగానే నేను డెహ్రాడూన్ వెళ్ళిపోయాను అందువల్ల ఇక్కడ ఎవరితోనూ కలవలేదు. కాలంతో పాటే స్నేహితులు కూడా ఏర్పడతారు (అని నవ్వేసింది).
ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలేమిటి? తెలుగులోనే కొనసాగడానికి ఏమన్నా ప్లాన్స్ వేస్తున్నారా?
జ)నా మదిలో తెలుగు చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత ఇంకా ఏ సినిమాకి ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల కోసం చూస్తున్నాను.
ప్రశ్న) మీ డ్రీమ్ రోల్స్ ఏమిటి?
జ)అలాంటివి ఏమీ లేవండి. ఎవరైనా తన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలనుకుంటారు. కానీ శ్రీదేవి నటించిన ‘వసంత కోకిల’ చిత్రం చాలా బాగా ఉంటుంది ఆ చిత్రంలో శ్రీ దేవి నటన అద్భుతం గా ఉంటుంది , ఆ పాత్రతో ఆమె ఎంతో గుర్తింపు పొందారు. నేను కూడా గుర్తింపు తెచ్చుకోవడానికి అలాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న మంచి పాత్రను చేయాలనుకుంటున్నాను.
ప్రశ్న) దీన్ని చదివే పాఠకులకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
జ)(నవ్వుతూ) తప్పకుండా అందాల రాక్షసి సినిమా చూడండి. నేను మీనుంచి కోరుకునేది అదే. ఈ చిత్రం చూసిన తర్వాత మీ కామెంట్స్ ని నాకు తెలియజేయండి, దాని వల్ల నాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘అందాల రాక్షసి’ సినిమా స్వచ్చమైన ప్రేమ కథ ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల మదిని గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను.
ఇంతటితో ‘అందాల రాక్షసి’ లావణ్యతో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఈ అందాల భామకి బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం.
అనువాదం రవి