ప్రత్యేక ఇంటర్యూ మున్నా కాశీ : నాని మరియు చంద్ర శేఖర్ యేలేటి లతో సినిమాలు చేయడం నా డ్రీమ్

ప్రత్యేక ఇంటర్యూ మున్నా కాశీ : నాని మరియు చంద్ర శేఖర్ యేలేటి లతో సినిమాలు చేయడం నా డ్రీమ్

Published on Aug 3, 2012 7:45 PM IST


విశ్వ నట చక్రవర్తి ఎస్.వి రంగా రావు మనవడు జూ. ఎస్.వి.ఆర్ ని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన ‘మిస్టర్ 7’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన మున్నా కాశీ 123తెలుగు.కామ్ టీంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. మున్నా కాశీతో జరిపిన ఇంటర్వ్యూ మీకోసం….

ప్రశ్న) అసలు సినిమాల్లోకి రావాలనే కోరిక కలగడానికి గల కారణం ఏమిటి? సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారు?

జ)నా చిన్న నాటి నుంచి ‘మాస్ట్రో’ ఇళయరాజా గారి పాటలను చాలా ఎక్కువగా వింటూ పెరిగాను. 1990లో విడుదలలైన ‘శివ’ చిత్రంతో నేను కూడా ఇండస్ట్రీలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకొని అటువైపుగా నా ప్రయాణం మొదలు పెట్టాను. సినిమాల్లో అవకాశం రాకముందు దుబాయ్ లో రేడియో జాకీగా పనిచేశాను. ఆ తర్వాత మా టీవీ వారు తీసిన ‘అభీరా’ అనే యానిమేషన్ చిత్రానికి ట్యూన్స్ మరియు పాటలు రాశాను.

ప్రశ్న) అసలు మీకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా అవకాశం వచ్చింది ? మీకు ఇండస్ట్రీలో ఎవరన్నా తెలిసినవారు ఉన్నారా?

జ)నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలిసిన వారు లేరు. ‘మిస్టర్ 7’ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నా ఫ్రెండ్స్ చెబితే నేను ఆడిషన్స్ కి వెళ్లాను. అక్కడ నేను చేసిన ఒక ట్యూన్ వినిపించాను అది నచ్చడంతో ఈ చిత్ర కథా రచయిత మరియు దర్శకుడు నన్ను ఎంపిక చేశారు. ఆ ట్యూన్ సినిమాలో కూడా ఉంది అదే ‘మనసంతా’ అనే పాట.

ప్రశ్న) ఈ చిత్రంలో జూ. ఎస్.వి.ఆర్ నటన ఎలా ఉంది ?

జ)ఆ ప్రశ్న నన్ను అడగడం కంటే ఈ చిత్ర దర్శకుడు చరణ్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆ విభాగం గురించి నాకు అంతగా తెలియదు నాకు తెలిసినంత వరకూ బాగా చేశాడు మరియు నేను సీనియర్ ఎస్.వి రంగారావుకి మాత్రం వీరాభిమానిని.

ప్రశ్న) ఈ రోజు విడుదలైన ‘ మిస్టర్ 7’ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి చూశారా? మీరు అందించిన సంగీతానికి థియేటర్లో ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తోంది?

జ)చూశానండి, ఈ రోజు ఐ మాక్స్ మరియు ఇన్ ఆర్బిట్ మాల్ లో ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసాను. మొదటి సారి ఒక కొత్త అనుభూతికి లోనయ్యాను. ఈ మధ్య కాలంలో సినిమాలో పాటలు వస్తుంటే ప్రేక్షకులు థియేటర్ నుండి బయట వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సినిమా చూస్తున్న వారెవ్వరూ అలా ఫీల్ అవ్వలేదు మరియు పాటలని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

ప్రశ్న) మీరు మరియు ఈ చిత్ర దర్శకులు ఇద్దరూ కొత్తవారే, దర్శకుడు మీ నుండి ఎలాంటి సంగీతాన్ని రాబట్టుకున్నారు?

జ)ఈ చిత్రానికి సంభందించిన ప్రతి విషయాన్ని ఈ చిత్ర కథ, మాటల రచయిత అయిన ప్రదీప్ గారు మరియు దర్శకుడు ఎస్.ఆర్ చరణ్ రెడ్డి గారే దగ్గరుండి చూసుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు ఎంతో కూల్ గా ఆయనకి ఎలాంటి ట్యూన్స్ కావాలో అడిగి మరీ నా దగ్గర కొట్టించుకున్నారు. సింగిల్ టేక్ లో నేను ఇచ్చిన అన్ని ట్యూన్స్ వారు ఓకే చేసారు, అంతటితో ఆగకుండా టీం అందరికీ నచ్చిన తర్వాతే ట్యూన్స్ ని ఫైనల్ గా ఓకే చేసారు.

ప్రశ్న) ఈ చిత్ర నిర్మాతలు మ్యూజిక్ విషయంలో మీకు ఎలాంటి స్వేచ్చనిచ్చారు?

జ)నాకు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదండి. నాకు పూర్తి స్వేచ్చనిచ్చారు మరియు ఈ చిత్ర పూర్తి బాధ్యతలు దర్శకుడికే అప్పగించేశారు. ఈ చిత్ర దర్శకుడు మరియు కథా రచయితలు ఎప్పుడూ నాతోనే ఉండి నా వెన్ను తట్టి మంచి పాటలు రాబట్టుకున్నారు.

ప్రశ్న) మీ మొదటి చిత్రంలోనే కార్తీక్, కారుణ్య, రంజిత్ మరియు సునీత లాంటి టాలీవుడ్ టాప్ సింగర్స్ తో పాడించారు, వారితో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

జ)నా మొదటి సినిమా మ్యూజిక్ చాలా బాగా రావాలని ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా, బెస్ట్ క్వాలిటీ సాంగ్స్ ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో టాప్ సింగర్స్ చేత పాటలు పాడించాను. అలా అని అవసరం లేకపోయినా పాడించలేదు, ఆ పాటల్ని వారే పాడాలి కాబట్టి వారి చేత పాడించాను. అలాంటి టాప్ సింగర్స్ తో పనిచెయ్యడం చాలా అందంగా ఉంది మరియు వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వారు నేను కొత్తవాన్ని అని చూడకుండా నాకు ఎలా అనుకుంటున్నానో అడిగి మరీ పాటలు పాడారు అది మాత్రం నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలాగే ఈ చిత్రంలో ఒక పాట పాడిన విజయ్ ప్రకాష్ గారు పాట పాడిన తర్వాత హారీష్ జైరాజ్ గారికి ఫోన్ చేసి మున్నా కాశీ అనే కొత్త సంగీత దర్శకుడు స్వరపరిచిన ఒక అద్భుతమైన పాటని నేను పాడాను అని ఆయనకి చెప్పడం నేను ఎప్పటికీ మరిచిపోలేను.

ప్రశ్న)ఎవరైనా తమ మొదటి చిత్రానికి ఫేమస్ పాటల రచయిత చేత పాటలు రాయించాలనుకుంటారు కానీ మీరు ఈ చిత్రంలోని అన్ని పాటలు ఒకరిచేతే (పోతుల రవి కిరణ్) రాయించడానికి గల కారణం ఏంటి? అతనిలో అంత స్పెషాలిటీ ఏముంది?

జ)మీరు అన్నది నిజమేనండి.. ఏ కొత్త సంగీత దర్శకుడైనా తన మొదటి చిత్రానికి ఫేమస్ పాటల రచయితని పెట్టుకోవాలనుకుంటారు అది సహజమే కానీ ఈ విషయంలో నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదండి ఎందుకంటే ఈ చిత్ర దర్శకుడు ముందుగానే ఒక పాటల రచయితని ఎంచుకున్నారు. అతన్ని నాకిచ్చి పాటలు రాయించుకోండి అని చెప్పారు. అందువల్ల ఒకరిచేతే పాటలు రాయించాల్సి వచ్చింది. రవి కిరణ్ కూడా నేను అడిగినట్టుగానే ఎంతో చక్కగా పాటలు రాసారు.

ప్రశ్న) సంగీతంలో మీకు ఎవరన్నా గాడ్ ఫాదర్ ఉన్నారా? మీకు ఇష్టమైన సంగీత దర్శకులు ఎవరు?

జ)ఇదివరకే చెప్పాను కదండీ… సంగీతంలో నా గాడ్ ఫాదర్ ‘మాస్ట్రో’ ఇళయరాజా గారే. ఆయన కాకుండా సీనియర్ సంగీత దర్శకులు శ్రీ మరియు ఎం.ఎం కీరవాణి సంగీతం అంటే చాలా ఇష్టం. శ్రీ గారి సంగీతం చాలా హాయిగా, వినసొంపుగా ఉంటుంది మరియు కీరవాణి గారి సంగీతం అటు క్లాస్ మరియు ఇటు మాస్ ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉంటుంది, ఆయన నేపధ్య సంగీతం కూడా చాలా బాగుంటుంది.

ప్రశ్న) మామూలుగా ట్యూన్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం చాలా కష్టం, ఆ విషయంలో మీరు ఈ చిత్రానికి ఎంతవరకూ న్యాయం చేశారు అని అనుకుంటున్నారు?

జ)బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెయ్యడం చాలా కష్ట తరమైన విషయం. కానీ ఈ చిత్రానికి నేను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెయ్యలేదండీ ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెయ్యలేక పోయాను అని మొదట్లో నేను బాధ పడినా నేను చేసిన పాటలు బాగున్నాయని రాజ్ గారు మెచ్చుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది.

ప్రశ్న) తెలుగు ఇండస్ట్రీలో ఏ అగ్ర దర్శకుడి సినిమాకి మరియు ఏ పెద్ద హీరో సినిమాకి సంగీతం అందించాలనేది మీ డ్రీమ్?

జ)నేను ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చానండి అప్పుడే పెద్ద పెద్ద దర్శకులతో మరియు హీరోలతో చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నాని అంటే నాకు చాలా ఇష్టం. నానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆయన చిత్రానికి సంగీతం చెయ్యాలనుంది మరియు చంద్రశేఖర్ యేలేటి లాంటి కొత్తరకాన్ని ఆదరించే ఎలాంటి దర్శకులతోనైనా పనిచేయడానికి ఇష్టపడతాను.

ప్రశ్న) ప్రస్తుతం వేరే ఏదయినా చిత్రాలకు సంగీతం అందిస్తున్నారా?

ప్రస్తుతానికి ఇంకా ఏది ఖరారు కాలేదండీ. ఒక పెద్ద చిత్రానికి మరో ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది కానీ అది ఇంకా ఖరారు కాలేదు మరియు కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి అవి ఖరారు కాగానే మీకు తెలియజేస్తాను.

ప్రశ్న) ఈ చిత్రం గురించి ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకుంటున్నారు?

జ)ముందుగా చిత్రంలోని పాటలను బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చింది సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి.

ఇంతటితో ఒకరికొకరం థాంక్స్ చెప్పుకుంటూ ఇంటర్వ్యూని ముగించాము. ‘మిస్టర్ 7’ సినిమా మంచి విజయం సాదించి మున్నా కాశీకి సంగీత దర్శకుడిగా మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు