‘జై’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనూప్ రూబెన్స్ ‘ప్రేమ కావాలి’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తాజాగా ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో ఒక్కసారిగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. కెరీర్ మొదట్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న అనూప్ టాలెంట్ కి ఇప్పుడే సరైన గుర్తింపు లభిస్తోంది. ‘హార్ట్ ఎటాక్’ విజయం గురించి, తన రాబోయే సినిమాల గురించి కాసేపు మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘హార్ట్ ఎటాక్’ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఎలా వచ్చింది?
స) ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణం పూరి జగన్నాధ్ గారే.. చెప్పాలంటే కీ బోర్డు ప్లేయర్ గా నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే అంటే ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ టైంలో ఆయన నాకు మ్యూజిక్ డైరెక్టర్ చాన్స్ ఇచ్చారు. కానీ ఆ టైంలో నాకు అంత అనుభవం లేక కాస్ట్ టెన్షన్ పడ్డాను. పూరి గారికి ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను, అంత బాధ్యత తీసుకోలేను కాస్త అనుభవం వచ్చాక చేస్తాను అని సున్నితంగా చెప్పి తిరశ్కరించాను. ఆయన కూడా అర్థం చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయన గత రెండు సినిమాలకు కూడా నన్ను అనుకున్నారు కానీ అది కుదరలేదు. చివరికి హార్ట్ ఎటాక్ రూపంలో మా కాంబినేషన్ కుదిరింది.
ప్రశ్న) పూరి జగన్నాధ్ గారితో వర్కింగ్ గురించి చెప్పండి?
స) పూరి గారితో పని చేయడం అనేది ఒక జాలీ రైడ్ కి వెళితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే తన సినిమాకి ఏం కావలి అని పూర్తి క్లారిటీ ఉన్న వ్యక్తి. చాలా కూల్ గా ఉంటారు కానీ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది.
ప్రశ్న) ఈ సినిమాకి పాటలు ఎన్ని రోజుల్లో కంపోజ్ చేసారు? బాగా ఎక్కువ టైం తీసుకున్న పాట ఏది?
స) మొదటి సారిగా పూరి గారు నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళి అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టారు. కేవలం 5 రోజుల్లో 5 పాటలు కంపోజ్ చేసేసాం. ‘తు హీ హై’ అనే పాట కోసం మాత్రం కాస్త టైం తీసుకున్నాం. అంటే ముందుగా ఆ సీన్ కోసం ఎలాంటి సాంగ్ కావాలా అనే ఆలోచనలో ముందు రెండు ట్యూన్స్ అనుకున్నాం. కానీ చివరికి పూరి గారు మెలోడీ చేద్దాం అని ‘తు హీ హై’ అనే పాట చేసాం.
ప్రశ్న) స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసేటప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటారు. దానిపై మీ కామెంట్?
స) చెప్పాలంటే స్టార్ డైరెక్టర్స్ తో పనిచేసేటప్పుడు ప్రెజర్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సీనియర్ డైరెక్టర్స్ కి వాళ్ళకి ఏమి కావాలి, ఎలాంటి ట్యూన్ కావాలని అనే క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నచ్చింది మనదగ్గర చేయించుకుంటారు. అదే జూనియర్స్ అయితే వాళ్ళకి కొన్ని విషయాల్లో సరైన అవగాహన ఉండదు. కొన్ని సందర్భాల్లో నేనే చెప్పాల్సి వస్తుంది. ఇది బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది అని అదే స్టార్ డైరెక్టర్స్ దగ్గరైతే ఆ సమస్య ఉండదు.
ప్రశ్న) ఎప్పుడైనా మీరు బాగా ఇష్టపడి చేసిన ట్యూన్స్ ని డైరెక్టర్స్ వద్దన్న రోజులున్నాయా? ఆ ట్యూన్స్ ని మళ్ళీ ఎక్కడన్నా వాడారా?
స) అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. బాగా ఇష్టపడి చేస్తాం కాబట్టి కాస్త బాధ ఉంటుంది. కానీ డైరెక్టర్ ఏమనుకున్నాడో అది ఇవ్వాలని మార్చి వేరే ట్యూన్ చేసిస్తాం. అలాంటి ట్యూన్స్ ని మళ్ళీ వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలోని ‘నిను చూసిన’, ‘లవ్లీ’ లోని ‘నిన్ను చూసిన క్షణములో’ పాటలు ఎప్పుడో కంపోజ్ చేసినవే..
ప్రశ్న) సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు కథకి, లేదా సీన్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తారా? లేక హీరో ని దృష్టిలో పెట్టుకొని చూస్తారా?
స) మొదటి ప్రాధాన్యత కథ లేదా సన్నివేశానికే ఇస్తాను. ఆ తర్వాత హీరో ఇమేజ్ ని ఆలోచించి చేస్తాను. కథ మొత్తం వింటాను, మళ్ళీ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు సన్నివేశానికి సంబదించిన సీన్స్ అన్నీ విని సాంగ్ చేస్తాను.
ప్రశ్న) ఎలాంటి సాంగ్స్ మీకు చాలెంజింగ్ గా అనిపిస్తాయి? అలాగే పాటలు చేయడం కష్టమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం కష్టమా?
స) సాంగ్స్ విషయంలో టైటిల్ సాంగ్స్ చెయ్యడం చాలా చాలెంజింగ్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేది టైటిల్ సాంగ్స్ అందుకే వాటి మీద ఎక్కువ కేర్ తీసుకుంటాను. సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం కష్టమైన పని. దానికి అనుభవం కావాలి. నేను ఎన్నో సినిమాలకి కీ బోర్డు ప్లేయర్ గా పనిచేసాను కాబట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కాస్త అవగాహన ఉంది.
ప్రశ్న) మీరు స్పూర్తిగా తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? మీకు నచ్చిన జోనర్స్ ఏమిటి?
స) నాకు స్ఫూర్తి అంటే ముందు మాస్ట్రో ఇళయరాజా గారు, ఆ తర్వాత ఎ ఆర్ రెహమాన్ గారు. ఎప్పటికైనా ఎఆర్ రెహమాన్ గారిలా క్వాలిటీ రీచ్ అవ్వాలని ఉంది, కచ్చితంగా ఏదోఒక రోజు రీచ్ అవుతాననే నమ్మకం ఉంది. నాకు బాగా ఇష్టమైన జోనర్స్ అంటే ఫ్యూజన్ అంటే ఇష్టం, అది కాకుండా హిప్ హాప్ కూడా వింటాను.
ప్రశ్న) మీలోని టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ డైరెక్టర్ తో పనిచేస్తే బాగుంటుంది అని అనుకున్న డైరెక్టర్స్ ఎవరన్నా ఉన్నారా?
స) ఒక్కరితో అనేం లేదు, అందరితో పని చేయాలని ఉంది. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో సొంత స్టైల్ ఉంటుంది. కావున అందరితో పనిచేసి వారి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని ఉంది.
ప్రశ్న) మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మ్యూజిక్ పై ఫీడ్ బ్యాక్ ఇస్తారా?
స) నా ఫ్యామిలీ మెంబర్స్ నా అన్ని సినిమాలకు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా బాగుంటే బాగుందని.. బాలేదంటే బాగోలేదని చెప్పేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే వాటిని మార్చుకోవడానికి ట్రై చేస్తాను.
ప్రశ్న) మీ రాబోయే సినిమాల గురించి, చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
స) త్వరలోనే ‘భీమవరం బుల్లోడు’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలు రిలీజ్ అవుతాయి. వరుసగా ‘హార్ట్ ఎటాక్’, ‘భీమవరం బుల్లోడు’, ‘ఆటోనగర్ సూర్య’ లాంటి మూడు డిఫరెంట్ జొనర్ ఫిల్మ్స్ చేయడం ఆనందంగా ఉంది. ఇది కాకుండా ‘మనం’, అలాగే నాగ చైతన్య – విజయ్ కుమార్ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. తెలుగులో కాకుండా అంటే ‘ఇష్క్’ తమిళ్ రిమేక్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను.
ప్రశ్న) వాలెంటైన్స్ డే స్పెషల్ ఏమిటి?
స) ముందుగా హార్ట్ ఎటాక్ విజయమే మా టీం కి స్పెషల్. అది కాకుండా వాలెంటైన్స్ డే స్పెషల్ గా రేపు హార్ట్ ఎటాక్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం. అదే మాకు స్పెషల్..
అంతటితో కెరీర్లో ఇంకా మంచి సినిమాలకు మ్యూజిక్ అందిచాలని అనూప్ రూబెన్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..
రాఘవ