ప్రశ్న) మీ గురించి మా వీక్షకులకు కాస్త తెలపండి. మీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
స) మేము స్వతహాగా కేరళ వాసులమైనా నేను పుట్టి పెరిగింది చికాగోలోనే. నేను ఎదుగుతున్న వయసులో మార్షల్ ఆర్ట్స్, పెయింటింగ్, డ్యాన్సింగ్ నేర్చుకున్నాను. నాకు లెక్కలు, ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. నేను మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ పట్టా కోసం స్టాంఫర్డ్ యూనివర్సిటీలో చేరాను. తరువాత నా వృత్తిని వదిలి నటీమణిగా స్థిరపడ్డాను. నాకు నటన అంతే చిన్నతనం నుండి ఇష్టం. ఇప్పుడు నాటనే నాకు సర్వస్వం. అంతేకాక నేను సామాజిక సేవలను కూడా చేస్తాను
ప్రశ్న) డి ఫర్ దోపిడి లో మీకు స్థానం ఎలా వచ్చింది?
స) నేను నటించిన లవ్ లైస్ అండ్ సీతా సినిమా స్క్రీనింగ్ కు హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నన్ను రాజ్ మరియు డి.కె లు కలిసి డి ఫర్ దోపిడి సినిమాలో షాలినీ పాత్రకోసం సంప్రదించారు
ప్రశ్న) లాస్ అంజెల్స్ లో మీ వృత్తికి ఇక్కడ సినిమాలో నటించే విధానానికి ఏమైనా తేడా కనబడిందా?
స) నాకు ఈ ప్రదేశాలు చాలా కొత్త మరియు ఇక్కడ వాతావరణానికి నేను అలవాటుపడడానికి కాస్త సమయం పట్టింది. ఆ తరువాత నా మొదటి అడ్డంకి భాష. నాకు ఇక్కడ ఎవరూ స్నేహితులు లేకపోవడం కాస్త బాధగా అనిపించింది. కానీ ఈ డి ఫర్ దోపిడి తయారయిన విధానం నాకు నచ్చింది. ఇక్కడ నన్ను అందరూ బాగా ఆదరించారు. చివరికి హైదరాబాద్ మరియు టాలీవుడ్ నుండి నాకు మంచి మార్కులే వచ్చాయి
ప్రశ్న) డి ఫర్ దోపిడి సినిమా బృందం గురించి కాస్త చెప్తారా?
స) రాజ్ మరియు డి.కె లతో కలిసి పనిచేయడం మాకు చాలా ఇష్టం. దర్శకుడు సిరాజ్ తో పని చాలా సులభంగా మారుతుంది. సందీప్, వరుణ్, నవీన్, రాకేష్ లు స్వతహాగా టాలెంట్ వున్నందున వారితో పని సరదాగా సాగుతుంది. మొత్తానికి మేము చాలా ఎంజాయ్ చేశాం
ప్రశ్న) ఇది తెలుగు సినిమా అయినందువల్ల మీరు ఏమైనా ప్రత్యేకంగా కసరత్తు చేశారా? ముఖ్యంగా తెలుగు సంభాషణల విషయంలో ఏమైనా కృషి చేశారా?
స) నాకు సినిమాకు అనుగుణంగా తయారుకావడానికి చాలా తక్కువ సమయం దొరికింది. నేను లాస్ ఏంజెల్స్ నుండి ఇక్కడకు వచ్చిన రెండు రోజులలో నాకు స్క్రిప్ట్ మరియు డైలాగులు ఏమి తెలియకుండానే షూట్ లో పల్గున్నా. నిజానికి ఈ షాలినీ పాత్రకోసం నేను ఎక్కువ కష్టపడలేదు. నేను తెలుగు భాషలో అంతా అనర్గళంగా మాట్లాడలేను కనుక ఈ తక్కువ సమయంలో సంభాషణలను చెప్పడం కాస్త కష్టమైంది. కాకపోతే నా దర్శకుడు, సినిమా బృందం సహకారంతో పూర్తిచేశాను. మొదట్లో కష్టమైనా పోనుపోనూ సులువవుతుందని ఆశిస్తున్నా
ప్రశ్న) రాజ్ మరియు డి.కె లు కలిసి సినిమా ఆఖరిగా స్క్రీన్ పై చూసినప్పుడు మీకు ఏమనిపించింది?
స) అన్నీ క్రాఫ్ట్ లు కలిపి ఒక్కసారిగా స్క్రీన్ పై చూసేసరికి అద్బుతంగా అనిపించింది. ఈ సినిమా నేను మా కుటుంబంతో చికాగోలో చూశాను. అక్కడి ప్రేక్షకులకు సైతం నచ్చడం ఎంతో గర్వకారణంగా వుంది
ప్రశ్న) మీరు ఇండియా/ తెలుగు లో సినిమాలు ఏమన్నా చెయ్యనున్నారా?
స) నన్ను కొన్ని కధలతో కొంతమంది కలిశారు. కానీ నేను మంచి కధకోసం ఎదురుచూస్తున్నా. నాకు అమెరికాలో కూడా కొన్ని ప్రాజెక్టులు వున్నందున రెంటినీ వ్యవహరించడం కాస్త కష్టమవుతుంది.