ఇంటర్వ్యూ : ఇర్రా మోర్ – సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని “కొండా” సుష్మితా మెచ్చుకున్నారు

ఇంటర్వ్యూ : ఇర్రా మోర్ – సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని “కొండా” సుష్మితా మెచ్చుకున్నారు

Published on Jun 16, 2022 5:05 PM IST

 

కొండా మురళి మరియు కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నటి ఇర్రా మోర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి ఆమె ఎలాంటి అంశాలు పంచుకుందో చూద్దాం రండి.

 

మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పండి,?

మాది ఆగ్రా, ఉత్తర ప్రదేశ్. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరుకున్నా. మొదట థియేటర్‌లో చేరాను. ఏడాదిన్నర పాటు హిందీ నాటకాల్లో పాత్రలు పోషించా. నార్త్ అంతా స్టేజి ప్లేస్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో నటించాలని చాలా ఆడిషన్స్ ఇచ్చా. రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీసుకు కూడా వెళ్లాను. ఆయన ‘భైరవగీత’ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని అన్నారు. ఆ సినిమాకు వర్మ గారి శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది.

 

ఈ చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది?

‘భైరవగీత’ తర్వాత రెండు వెబ్ సిరీస్‌లు చేశా. లాక్‌డౌన్‌లో ఉండగా వర్మ గారు ‘కొండా’ సినిమా స్క్రిప్ట్ పంపారు. నాకు సురేఖమ్మ పాత్ర బాగా నచ్చింది. కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. నటిగా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న రోల్. అందులో నటించగలనని వర్మగారు అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

 

ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?

ఫస్ట్ స్క్రిప్ట్ చదివాక… యూట్యూబ్‌లో ఆమె వీడియోస్ చూశా. లాక్‌డౌన్‌ కారణంగా అప్పట్లో సురేఖమ్మతో మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత మా ఇంట్లో లుక్ టెస్ట్ చేశా. శారీ కట్టుకుని చూశా. ఆమె రాజకీయ నాయకురాలు కూడా! అందువల్ల, ఎటువంటి దుస్తులు వేసుకోవాలి? ఏవి వేసుకోకూడదు? అని డిస్కస్ చేసుకున్నాం. వర్మ గారితో మాట్లాడి సురేఖమ్మ గురించి తెలుసుకున్నా. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాను. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడేవారు? అనేది చూశా. ఆవిడను కాపీ చేయాలనుకోలేదు. నా శైలిలో నటించా. కానీ, ఆవిడ వ్యక్తిత్వం పాత్రలో కనిపించేలా చూసుకున్నా.

 

రామ్ గోపాల్ వర్మతో వర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఎలా అనిపించింది?

ఇంతకు ముందు వర్మ ప్రొడక్షన్ హౌస్‌లో నటించా. ‘భైరవగీత’ చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. ప్రతి సన్నివేశాన్ని ఆయన దగ్గరుండి తీశారు. నటీనటుల నుంచి ఏం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. వెరీ క్లియర్. అలాగే, ఆయన మేకింగ్ ఫాస్ట్‌గా ఉంటుంది.

 

సురేఖ గారికి, మీ వ్యక్తిగత జీవితానికి ఏమైనా సారూప్యతలు ఉన్నాయా?

సురేఖ వెరీ స్ట్రాంగ్ లేడీ. జీవితంలో ఆవిడ ఎన్నో మంచి పనులు చేశారు. ఆవిడ కఠిన పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. నా జీవితం ఇప్పుడే మొదలైంది. మా ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆవిడతో కంపేర్ చేసుకోలేను. మా మధ్య ఉన్న ఒక్క కామన్ పాయింట్ ఏంటంటే… నేను కూడా స్ట్రాంగ్. భయపడకూడదని నా తల్లిదండ్రులు చెప్పారు.

 

ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన అంశాలు?

సురేఖమ్మ పబ్లిక్‌లో ఉన్న మనిషి. రాజకీయాల్లో ఉన్నారు. ఆమెకు ఓ ఇమేజ్ ఉంది. ఏ నటికి అయినా సరే ఆమెలా ఉండటం కష్టం. అయితే, సురేఖమ్మలా నటించి ప్రజల చేత గౌరవం సంపాదించుకోవడం ముఖ్యం. సినిమా చూశాక… ప్రేక్షకులు నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నాను.

 

త్రిగుణ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం చెప్పండి?

త్రిగుణ్‌ వెరీ గుడ్ యాక్టర్. చాలా ఈజీగా పాత్రలోకి వెళతాడు. వెంటనే బయటకు వస్తారు. యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సెట్‌లో సీరియస్‌గా ఉంటాడు. కానీ, బయట సరదాగా ఉంటాడు.

 

సురేఖ గారి రోల్ చేసాక మీకు ప్రశంసలు వచ్చాయా?

సురేఖమ్మ గారి అమ్మాయి సుష్మిత మా సినిమా ప్రొడ్యూసర్ కదా! ఆవిడను నేను ముందు కలవలేదు. ఒక నెల షూటింగ్ చేశాం. ఆ తర్వాత ఆవిడ రషెస్ చూశారు. ఫోన్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో కొండా మురళి గారిని షూట్ చేసే సన్నివేశం వస్తుంది. నిజంగా జరిగినప్పుడు సుష్మిత ఆయన దగ్గర ఉన్నారు. సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ముంబై నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి ఎలా యాక్ట్ చేస్తానోనని అనుకున్నారట. ఇంటర్వెల్ సీన్ చూశాక మెచ్చుకున్నారు. సురేఖమ్మ పాత్రకు వెయ్యి శాతం న్యాయం చేశానని చెప్పారు. షి ఈజ్ వెరీ హ్యాపీ.

 

ఫైనల్ గా సురేఖ గారితో మీ జర్నీ గురించి చెప్పండి?

‘కొండా’ షూటింగ్ చేసేటప్పుడు వరంగల్‌లోని మురళి – సురేఖమ్మ గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీతో చాలా కలిసిపోయాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు