ప్రత్యేక ఇంటర్వ్యూ : రామ్ గోపాల్ వర్మ – డా. మోహన్ బాబు పవర్ఫుల్ అయితే మంచు విష్ణు మోర్ పవర్ఫుల్.

ram-gopal-varma
తన సినిమాలతో సంచలనాలు సృష్టించి, తన మాటలతో ఎప్పుడూ వివాదాల్లో నిలిచే దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో కొత్తదనాన్ని, కొత్త వారిని తెరకి పరిచయం చేసే వర్మ ఈ సారి కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన సినిమా ‘రౌడీ’. ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ముక్కుసూటిగా మాట్లాడే వర్మ రౌడీ గురించి, ఈ చిత్ర నటీనటుల గురించి ఏమేమి చెప్పాడు అనే విశేషాలు మీ కోసం..

ప్రశ్న) డా. మోహన్ బాబు సినిమా చేయమని అడిగినప్పుడు చూద్దాం అన్న మీరు ఈ మూవీని ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేసారు?

స) ‘శివరంజిని’ టైం నుండి మోహన్ బాబు గారి సినిమాలు చూస్తున్నాను. నేను డైరెక్టర్ అయ్యే టైంకి ఆయన ఓకే ఒక తరహా హీరోగా స్టైలిష్ సినిమాలు చేస్తున్నారు. నేనేమో రియలిస్టిక్ సినిమాలు చేస్తున్నాను. దాంతో అప్పట్లో కుదరలేదు. ఆయన అడిగిన తర్వాత ఈయన రేంజ్ కి సరిపోయే కథంటే రాయలసీమ బ్యాక్ డ్రాప్ అయితే బాగుంటుంది అనుకున్నను. ఆయనకి ఒక ఇమేజ్ ఉంది కానీ దానికి భిన్నంగా ఆయన్ని నా స్టైల్లోకి తెచ్చుకొని సినిమా చేయాలని ఆలోచిస్తే ఆయన్ని కన్విన్స్ చేసి విగ్గు లేకుండా సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ తర్వాత కథ రెడీ చేసి చెప్పాను. అది నచ్చిన తర్వాత మీరు విగ్గు లేకుండా చేయాలి, అందుకే విగ్గులేకుండా మొదట టెస్ట్ షూట్ చేస్తాను, మీకు నచ్చితే షూట్ కి వెళ్దాం అని అన్నాను. ఎందుకంటే ఆయన్ని 500 పైగా సినిమాల్లో విగ్గుతో ఓ లుక్ లో చూసారు, ఇప్పుడు నేను విగ్గులేకుండా చూపిస్తే నగ్నంగా చూపించిన ఫీలింగ్ వస్తుంది. అందుకే ఫస్ట్ టెస్ట్ షూట్ కి వెళ్లాం, అది నచ్చడంతో వెంటనే సెట్స్ పైకి వెళ్లాం..

ప్రశ్న) సత్య 2 లో సరికొత్త క్రైమ్ ని చూపించారు.. మరి ‘రౌడీ’లో ఎలాంటి ఫ్యాక్షనిజాన్ని చూపించనున్నారు?

స) ఇది ఫ్యాక్షనిజం కలగలిపిన ఒక ఫ్యామిలీ డ్రామా. ఫ్యాక్షనిజంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. మాములుగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తనకి నచ్చినట్టు దోచుకునే వాడిని రౌడీ అంటారు. కానీ ఈ కథలో మా రౌడీ ప్రజల మంచి కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఫాలో అయ్యే రౌడీ. అందుకే మోహన్ బాబు ‘మంచి రౌడీ’ అని నా ఫీలింగ్.

ప్రశ్న) ట్రైలర్ చూసిన వాళ్ళు సినిమాలో ‘సర్కార్’, ‘గాడ్ ఫాదర్’ షేడ్స్ ఉన్నాయంటున్నారు. అలాగే ‘సర్కార్’ రీమేక్ అని కూడా అంటున్నారు. మీరేమంటారు?

స) ఒక ఫ్యామిలీ స్టొరీని వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే అది ‘గాడ్ ఫాదర్’ తో పోలిక లేకుండా ఉండదు. అలాగే 1975 లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ ని చూసి 100 వెర్షన్స్ వచ్చాయి. అందులో ‘సర్కార్’ తరహాలో నేనే 3,4 సినిమాలు ట్రై చేసాను. ఇక్కడ చెప్పేదేంటి అంటే ఇది రీమేక్ కాదు.. సర్కార్ లోని పాత్రలు గానీ, సీన్స్ గానీ, సందర్భాలు కానీ ఇందులో ఉండవు. ‘రౌడీ’ స్టొరీని ఒక 5 నిమిషాల ప్లాట్ గా చెప్తే మాత్రం ‘సర్కార్’ సినిమా గుర్తుకు రావచ్చు.

ప్రశ్న) మొదటి సారి మోహన్ బాబు గారితో పనిచేసిన ఆనుభవం ఎలా ఉంది?

స) మోహన్ బాబు గారితో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయనకి మీకు వ్యక్తిగంగా చాలా డిఫరెన్స్ ఉంది, సెట్ అవ్వదు అన్నారు. కానీ నా అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చేసినంత కంఫర్టబుల్ గా మరే సినిమాకి పని చేయలేదు. అదొక వండర్ అని చెప్పాలి.

ప్రశ్న) ‘రౌడీ’లో మోహన్ బాబు గారిని, మంచు విష్ణుని తీసుకోవాలని ముందే అనుకున్నారా? లేక వేరే చాయిస్ ఏమన్నా అనుకున్నారా? సినిమా పరంగా ఇద్దరిలో మిమ్మల్ని ఎక్కువ ఇంప్రెస్ చేసింది ఎవరు?

స) సినిమా కథ అనుకున్నప్పుడే అన్న పాత్రకి మోహన్ బాబుని, కృష్ణ పాత్రకి విష్ణుని అనుకొనే అప్రోచ్ అయ్యాను. ఇక ఇద్దరిలో ఇంప్రెస్ చేసింది ఎవరు అంటే మోహన్ బాబు గారు చాలా మంచి నటుడు. ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. కేవలం మేకప్ లేకుండా చూపించాలి, అలాగే నాకు కొన్ని ఎక్స్ ప్రెషన్స్ కావాలి అవి ఆయన ఇవ్వగలడు అన్న నమ్మకం ఉంది. కావున మోహన్ బాబు విషయంలో ఎవరు షాక్ అవ్వరు. కానీ విష్ణు మాత్రం ఆడియన్స్ ని చాలా సర్ప్రైజ్ చేస్తాడు. సినిమా చూసిన వాళ్ళు కూడా విష్ణుని చాలా బాగా చూపించారు అంటున్నారు, కానీ నిజం ఏంటంటే విష్ణు నిజ జీవితంలో అలానే ఉంటాడు. నేను నిజ జీవితంలోని విష్ణుని కాపీ కొట్టి నా సినిమాలో కృష్ణగా పెట్టుకున్నాను.

ప్రశ్న) డా. మోహన్ బాబు, విష్ణులో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏమిటి?

స) ఇద్దరూ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ మరియు ఎంతో క్రమ శిక్షణ ఉన్నవారు. వాళ్ళు కమిట్ అయిన దాని మీద ఎంతో డెడికెటేడ్ గా ఉంటారు. అది ప్రొడక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు.. దాని కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తారు.

ప్రశ్న) ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన నటీనటుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు?

స) డా. మోహన్ బాబు – పవర్ఫుల్.
మంచు విష్ణు – మోర్ పవర్ఫుల్
జయసుధ – స్టేబిలిటి (స్థిరత్వం ఉన్న వ్యక్తి)
శాన్వి – సెక్సీ

ప్రశ్న) మీ ప్రతి సినిమాలో జయసుధ గారు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఆమెలో ఉన్న స్పెషాలిటీ ఏంటి?

స) నేను మాములుగా హీరోయిన్స్ ని అందంగా చూపించడంతోనే సరిపెడతాను. పెద్ద పవర్ఫుల్ రోల్స్ ఇవ్వను. ఎందుకో జయసుధ గారు మాత్రం అలా అనిపించరు. ఇందులో కూడా జయసుధ గారు చాలా కీ రోల్ చేసారు.

ప్రశ్న) మీ 25 ఏళ్ళ కెరీర్లో ఫ్లాప్స్ హిట్స్ తో సంబంధం లేకుండా కంటిన్యూగా మిమ్మల్ని సినిమాలు తీయడానికి స్ఫూర్తి నిచ్చే విషయం ఏమిటి?

స) మాములుగా నేనొక స్టొరీ టెల్లర్ ని, నాకు స్టోరీస్ చెప్పడం అంటే ఇష్టం. అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నాను. అందులో భాగంగా కొన్ని కొత్త కథలు చెబుతాను, కొన్ని చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను.

ప్రశ్న) మూవీలో 11 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ తీసారు. అంత సేపు ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేయగలరా?

స) ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ 5 నిమిషాల, 9 నిమిషాల, 11 నిమిషాల అన్నది ప్రశ్న కాదు. మేము ఒక యాక్షన్ సీక్వెన్స్ ని ఒక సీన్ లాగా చేస్తాం. అంతే కానీ నేను గాల్లోకి లేపి 10, 20 మందిని కొట్టడం లాంటి ఫైట్స్ చూపించడం లేదు. మేము అనుకున్న సీక్వెన్స్ 11 నిమిషాలు అందులో ఒక ఎమోషనల్ తో కూడుకున్న స్టొరీ ఉంటుంది. అందరూ ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారు.

ప్రశ్న) ఇంత పవర్ఫుల్ కథకి సాయి కార్తీక్ ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అలాగే శివ సౌండ్ ట్రాక్ ని ఎందుకు రీ క్రియేట్ చేసారు?

స)
ఎవరో నా దగ్గరికి సాయి కార్తీక్ ని తీసుకువచ్చారు. అప్పుడు ఒక ట్యూన్ వినిపించాడు అది బాగా నచ్చి ఒక సీన్ ఇస్తే మూడు గంటల్లో ఒక ట్రాక్ వినిపించాడు. బాగా నచ్చడంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాను. ఇక శివ ట్రాక్ విషయానికి వస్తే అది టైటిల్ ట్రాక్ కాదండి. సైకిల్ చైన్ సీన్ అప్పుడు వచ్చే ట్రాక్. ఆ బిట్ నాకు అల్ టైం ఫేవరైట్. 1980లో రికార్డ్ చేసినప్పుడు అది మోనో ట్రాక్. ఇప్పుడు వినాలి అంటే ఆ సౌండ్ మనకు రాదు. నేను సాయి కార్తీక్ ని రిక్వెస్ట్ చేసి ఆ ట్రాక్ ని ఇప్పుడున్న వాయిద్యాలతో మిక్స్ చేసి చేయమన్నాను. చాలా బాగా చేసాడు. ఇటీవలే ఆ ట్రాక్ ని యు ట్యూబ్ లో రిలీజ్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రశ్న) ప్రస్తుత రాజకీయాలపై మీ స్పందన ఏంటి? అలాగే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. దానిపై మీ కామెంట్?

స) నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ అంటే చూడటానికి బాగుంటాడు. అందుకే అతన్ని సపోర్ట్ చేసాను.

ప్రశ్న) ఈ మధ్య వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారు?

స) జూలైలో చేస్తున్నాను. అదే ‘సర్కార్ 3’. ఆ సినిమాలో కూడా అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తున్నారు.

ప్రశ్న) 20, 40 రోజుల్లో సినిమా పూర్తి చేయడంలో ఉన్న సక్సెస్ మంత్రం ఏంటి?

స)
సక్సెస్ మంత్రం ఏమి లేదు. సినిమాపై క్లారిటీ ఉండాలి. అలాగే నేను మల్టిపుల్ కెమెరాలు ఉపయోగిస్తాను. దానివల్ల టైం, బడ్జెట్ కలిసి వస్తుంది. తొందరగా సినిమా పూర్తవుతుంది.

ప్రశ్న) మంచు విష్ణుతో ‘టెన్షన్ టెన్షన్’ అనే సినిమా చేస్తున్నారనే వార్తల్లో నిజం ఎంత ఉంది? అలాగే ‘రెడ్డి గారు పోయారు’ ఎప్పుడు వస్తుంది.

స) విష్ణుతో సినిమా చేస్తున్నాను. కానీ దాని టైటిల్ ‘టెన్షన్ టెన్షన్’ కాదు. ప్రస్తుతానికి టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇక రోజు రోజుకీ మారిపోతున్న పరిస్థితుల వల్ల ఏ సినిమా చేయాలో అర్థం కాక ‘రెడ్డి గారు పోయారు’ ని పక్కన పెట్టాను. కచ్చితంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అయితే సినిమా చేస్తాను. కానీ ఆ మూవీ ఎలక్షన్స్ ముందు మాత్రం రాదు.

ప్రశ్న) ‘రౌడీ’ సినిమాలో మీ నుంచి కొత్తగా ఏమి ఆశించవచ్చు?

స) ఇదొక ఫ్యాక్షన్ సినిమా. ఈ సినిమాలో కొత్త అంటే మాములుగా నాకు సెంటి మెంట్ అంటే తెలియదు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు నా సినిమాల్లో లేని సెంటిమెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అది మంచో చెడో నాకు అర్థం కావటం లేదు.

అంతటితో రామ్ గోపాల్ వర్మకి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

ఇంటర్వ్యూ : రాఘవ

Click here for English Interview

Exit mobile version