ప్రత్యేక ఇంటర్వ్యూ : సునీల్ – ఎన్.టి.ఆర్ బెస్ట్ డాన్సర్..

Sunil
కమెడియన్ గా కొన్ని సీన్స్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన సునీల్ ఆ తర్వాత కామెడీ హీరోగా మారి రెండున్నర గంటలు ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఒక్క కామెడీ హీరో గానే కాకుండా ‘పూల రంగడు’, ‘తడాఖా’ సినిమాలతో సీరియస్ రోల్స్ కూడా చేసి ప్రేక్షకులను మెప్పించగలనని నిరూపించుకున్నాడు. సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము సునీల్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. సునీల్ ఎంతో క్లోజ్ గా, చాలా కూల్ గా, చాలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) మొదటగా ‘భీమవరం బుల్లోడు’ ఎలా మొదలైందో చెప్పండి?

స) ‘పూల రంగడు’ సినిమా తర్వాత ఈ సినిమా కథ నాకు చెప్పారు. మాములుగా కథ విన్నాక ఆలోచించి చెబుతానంటాను, కానీ కథ విన్న వెంటనే ఈ మూవీకి ఓకే చెప్పాను. అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా నవ్వుకొంటూ బయటకి వస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా మా ఊరు భీమవరం పేరుతో వచ్చి హిట్ అవబోతుండడం మరింత ఆనందంగా ఉంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది కానీ ఎంత పెద్ద హిట్ అనేది మాత్రం ఇంకా తెలియదు.

ప్రశ్న) సురేష్ ప్రొడక్షన్స్ లో పనిచేయడం ఎలా ఉంది? ఈ సంస్థ అధినేత అయిన డా.డి. రామానాయుడు గారు ఎప్పుడన్నా సెట్స్ కి వచ్చి సూచనలు ఇచ్చారా?

స) సురేష్ ప్రొడక్షన్స్ లో పనిచేయాలనుకోవడం చాలామంది కల. ఈ సినిమాతో నాకు ఆవకాశం వచ్చింది. రామానాయుడు గారు సెట్స్ కి తక్కువ సార్లే వచ్చారు. వచ్చినప్పుడు పలు సూచనలు ఇచ్చారు. ఆయన గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలి. ఆయన చూడటానికే కామ్ గా ఉంటారు కానీ మంచి ఎనర్జిటిక్ పర్సన్. మీకో సంఘటన చెబుతా.. అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక హోటల్ వెనుక పక్కన బీచ్ ఉంటుంది. ఆ హోటల్ వారు సాయంత్రం సమయంలో డిజే పెడతారు. అందరూ డాన్సులు వేస్తుంటారు. మేము అందరం డాన్స్ వేస్తున్నాం రామానాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆ బీట్స్ కి మేము ఓక పాటకే వేయలేక అలసి పోతే ఆయన మాత్రం కంటిన్యూగా మూడు నాలుగు పాటలకు డాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఇంతలో డిజే ఆపేశారు అప్పుడు ఆయన ఒక లుక్ ఇచ్చారు. వీడేంటి అప్పుడే ఆపేసాడు అని ఆ లుక్ మీనింగ్. అప్పుడు ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ అయ్యాను.

ప్రశ్న) ఉదయ శంకర్ చాలా రోజుల నుంచి సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. మరి మీరు ఆయనతో సినిమా చేయడం రిస్క్ అనుకోలేదా?

స) గెలుపు ఓటములు అన్నవి సహజం. డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నారు కదా అని సినిమా ఒప్పుకోకపోవడం ఉండదు. కథ నచ్చితే చేస్తాను. నేను ‘మర్యాద రామన్న’ కథ విన్నప్పుడు రాజమౌళి గారు గారు ఎలాగన్నా హిట్ చేస్తారు అన్న నమ్మకముంది. ఆ తర్వాత కథ వినగానే కచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మి చేసిన సినిమా ‘భీమవరం బుల్లోడు’. అనుకున్న విధంగానే ఆయన సినిమాని చాలా బాగా తీసాడు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

ప్రశ్న) ముందుగా ఈ కథని వెంకటేష్ గారికి అనుకున్నారు. అదే పాత్రని మీరు చేస్తున్నారని తెలిసి నప్పుడు ఆయన రేంజ్ కి చేయగలనా లేదా అన్న అనుమానం వచ్చిందా?

స) ముందుగా వెంకటేష్ గారి కోసమే ఈ కథని తయారు చేసారు. కానీ నాకు చెప్పినప్పుడు కథలో మార్పులు చేసి నాకు సరిపోయే విధంగానే చెప్పారు. ఉదాహరణకి ఇక్కడి(అన్నపూర్ణ స్టూడియోస్) నుండి పంజాగుట్ట వెళ్ళాలనుకోండి, యూసఫ్ గూడా మెడ వెళ్ళొచ్చు, ఖైరతాబాద్ మీద వెళ్ళొచ్చు, జూబ్లీహిల్స్ మీదుగా వెళ్ళొచ్చు. ఇదే మాదిరిగా వెంకటేష్ గారిని అనుకున్నప్పుడు ఒక దారి చూపించారు, అదే నాకు అనుకున్నప్పుడు మరో దారిలో కథని చెప్పారు. అందువల్ల ఎలాంటి టెన్షన్, అనుమానం లేకుండా సినిమా చేసాను.

ప్రశ్న) ఈ సినిమాలో మీ నుంచి అభిమానులు ఏమేమి ఆశించవచ్చు?

స) (నవ్వుతూ) ఏమండీ సునీల్ సినిమా అంటే ఏమి ఆశిస్తారు.. కామెడీ బాగా ఉండాలి, పాటల్లో డాన్సులు వేయాలని కోరుకుంటారు. అవి ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. అవి కాకుండా ఇందులో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అవి థియేటర్ కి వచ్చే వారికి బోనస్.

ప్రశ్న) బ్రహ్మానందం గారి ప్లేస్ ని భర్తీ చేసే రేంజ్ కమెడియన్ గా ఉన్న మీరు ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయారు. అవకాశాలు వస్తే మళ్ళీ కమెడియన్ పాత్రలు వస్తే చేస్తారా?

స) ముందుగా ఒక మాట. బ్రహ్మానందం గారి ప్లేస్ ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు అవకాశాలు వస్తే కచ్చితంగా చేస్తాను. ముందు ముందు కచ్చితంగా కమెడియన్ పాత్రలు చేస్తాను. ‘దూకుడు’ సినిమాలో నాకు కూడా ఓ పాత్ర ఉంది. కానీ ఆ పాత్రకి డైలాగ్స్ ఉండవు. రేపు షూటింగ్ అనగా ముందు రోజు శ్రీను వైట్ల గారు మన కాంబినేషన్లో పంచ్ డైలాగ్స్ ఉండేవి ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటే నచ్చుతుందో లేదో అనే అనుమానంతో కాన్సల్ చేసారు. అలాగే ఇప్పటికీ నేను త్రివిక్రమ్ ని తన సినిమాలో నాకు రోల్ ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతూనే ఉంటాను.

ప్రశ్న) కమెడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏమిటి? అలాగే హీరో అవ్వడం వల్ల మీరేమన్నా మిస్ అవుతున్నారా?

స) ఎలాంటి మార్పు లేదండి. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. కానీ కమెడియన్ గా ఉన్నప్పుడు భీభత్సంగా పంచ్ లు(ఆన్ స్క్రీన్) వేయగలిగే వాడిని, కానీ ఇప్పుడు వేయలేకపోతున్నాను. అందుకే సీన్ చేసేటప్పుడు ఏమన్నా పంచ్ డైలాగ్స్ వస్తే పక్కనే ఉన్న కమెడియన్స్ కి సజెస్ట్ చేస్తుంటాను.

ప్రశ్న) హీరోగా మారిన తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా చేయాలనుకునే డైరెక్టర్ ఎవరు?

స) మరో ఆలోచనే లేదండీ త్రివిక్రమ్ శ్రీనివాస్. తన సినిమాలో ఒక పాత్ర చేస్తేనే పంచ్ లు విపరీతంగా ఉంటాయి. అదే ఫుల్ లెంగ్త్ పాత్ర చేస్తే ఏ రేంజ్ లో పంచ్ లు ఎలా ఉంటాయో, మూవీలో కామెడీ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. అతను హాలీవుడ్ లో ఉండాల్సిన డైరెక్టర్. అందుకే తన డైరెక్షన్ లో సినిమా చెయ్యాలి.

ప్రశ్న) మెగాస్టార్ చిరంజీవి తర్వాత మీ ప్రకారం ఇప్పుడున్న యంగ్ స్టార్స్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో బెస్ట్ డాన్సర్ ఎవరు?

స) నా వరకూ ఎన్.టి.ఆర్ బెస్ట్ అండ్ అల్టిమేట్ డాన్సర్. ఎందుకంటే ఎన్.టి.ఆర్ ఫుట్ స్టెప్స్, ఎక్స్ ప్రెషన్స్, బాడీ మూమెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి.

ప్రశ్న) కమెడియన్, హీరోగా కాకుండా మీరు చేయాలనుకున్న డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా?

స) నాకు పూర్తిగా నెగటివ్ రోల్ ఉండే పాత్ర చేయాలని ఉంది. అది ఎలాంటి టైపు విలన్ అయినా పరవాలేదు. విలన్ గా ఓ సినిమా అన్నా చెయ్యాలి.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ , హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. మీరు కూడా నిర్మాతగా మారే అవకాశం ఉందా?

స) అస్సలు అలాంటి ఆలోచనే లేదు. నిర్మాతగా మారే అవకాశం కూడా లేదు.

ప్రశ్న) సినిమా సినిమాకి ఎందుకంత గ్యాప్ తీసుకుంటున్నారు? మీరు తదుపరి సినిమాలేమిటి?

స) గతంలో సినిమా సినిమాకి గ్యాప్ అనేది అనుకోకుండా జరిగిపోయింది. ఇక నుంచి అంత గ్యాప్ ఉండదు. హీరోగానే కాకుండా కమెడియన్ గా కూడా ప్రేక్షకులకు కనపడుతూ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ వాటిలో ఇంకా దేన్నీ సెట్స్ పైకి తీసుకెళ్ళలేదు. భీమవరం బుల్లోడు రిలీజ్ అయ్యాక ఏ సినిమా మొదట చెయ్యాలనేది నిర్ణయించుకుంటాను.

ప్రశ్న) మీ అభిమానులకు, మా పాఠకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు?

స) అందరూ ‘భీమవరం బుల్లోడు’ సినిమా చూడండి. సునీల్ నుంచి ఏమేమి ఆశిస్తారో అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకొని బయటకి వస్తారు. ఒకవేళ అలా జరగలేదంటే నా నెక్స్ట్ సినిమా నుంచి సునీల్ మాట నమ్మకండి.

అంతటితో సునీల్ తో మా ఇంటర్వ్యూని ముగించి, ‘భీమవరం బుల్లోడు’ సినిమా మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం.

రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version