వెన్నెల సినిమాలో ఖాదర్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కిషోర్ ఆ సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్ గా సెటిల్ అయ్యాడు. ఆ సినిమా తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే వెన్నెల 1 1/2 సినిమాతో దర్శకుడిగా మారిపోయారు. చాలా రోజుల క్రితమే ఆడియో రిలీజ్ అయినా సినిమా మాత్రం ఆలస్యం అవుతూ ఈ వారం సెప్టెంబర్ 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా గురించి వెన్నెల కిషోర్ చెప్పిన ముచ్చట్లు మీకోసం ప్రత్యేకంగా.
1. వెన్నెల 1 1/5 ఆడియో ఫిబ్రవరిలో వచ్చింది. సినిమా రిలీజ్ మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం అయింది?
స : ఆడియో విడుదలకి ముందే ఈ సినిమాని ఏ టీవీ వారు చూసి సినిమాకి సంబందించిన పూర్తి హక్కులు వారు కొనుక్కోవడం జరిగింది. మా ద్వారా విడుదల అయితే చిన్న సినిమా కాబట్టి తక్కువ థియేటర్లలో చేసే వాళ్ళం, థియేటర్ల సమస్య వస్తుంది, ఏ టీవీ వారు అయితే ఒక ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తారని వారి మీద నమ్మకంతో ఇవ్వడం జరిగింది.
2. కమెడియన్ గా మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? డైరెక్టర్ అవ్వాలనే కోరిక మొదటి నుండి ఉందా?
స : నేను ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవ్వాలనే. డైరెక్షన్ అంటే మొదటి నుండి బాగా ఇంట్రస్ట్ ఉండేది. వెన్నెల సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తరువాత అనుకోకుండా యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.
3. ఇక మీదట డైరెక్టర్ గా కంటిన్యూ అవుతారా?
స : ఇప్పటి వరకు వెన్నెల 1 1/2, జఫ్ఫా రెండు సినిమాలు చేశాను ప్రస్తుతం ఇంకా ఏం సినిమాలు అనుకోలేదు. యుగాంతం రాకుండా ఉంటే 2013 లో నెక్స్ట్ సినిమా ఉంటుంది. (నవ్వుతూ..)
4. డైరెక్షన్, కమెడియన్ రెండు పడవల మీద రెండు కాళ్ళు పెట్టారు. ఫ్యూచర్లో హీరోగా చేయాల్సి వస్తే ఏం చేస్తారు?
స : ఇప్పుడు నేను హీరో అంటూ డాన్సులు, ఫైట్లు చేస్తే జనాలు చెప్పుతో కొడతాం అంటారు (నవ్వుతూ). అందుకని కమర్షియల్ హీరోగా కుండా కామెడీ పరంగా ఒక పాత్ర చుట్టూ కథ అంతా తిరుగుతూ ఉండే సినిమాలు చేస్తాను. బాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. మన దగ్గర అలాంటి సినిమాలు చేయడానికి ట్రై చేస్తా. హీరో అంటే మాత్రం ఈ జన్మలో కాదు వచ్చే జనంలో చూద్దాం.
5. ఈ వెన్నెల 1 1/2 సినిమాలో లైవ్ ఇంటర్వెల్ ఉంటుందని చెప్పారు కదా. అసలు ఈ లైవ్ ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ఏంటి?
స : నేను జనరల్ గా సినిమా చూడడానికి వెళ్ళినపుడు ఇంటర్వెల్లో బాగా బోర్ కొడుతుంది. హాలీవుడ్ సినిమాలు చూస్తే ఇంటర్వల్ అనేది ఉండదు. అసలు ఎందుకు ఈ ఇంటర్వల్ అని ఆలోచించే నా లాంటి వాళ్ళ కోసం లైవ్ ఇంటర్వల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ సినిమా కోసం షూటింగ్ టైంలోనే రాసుకుని షూట్ చేసాం. సినిమా చూసినపుడు అదేంటో మీరే డైరెక్ట్ గా చుడండి.
6. డైరెక్షన్ చేస్తున్నపుడు ఎందుకొచ్చిన గొడవరా బాబు, నా మానాన నేను నాలుగు కామెడీ రోల్స్ చేసుకోలేక అని ఎప్పుడు ఐనా అనిపించిందా?
స : అలా ఎప్పుడు అనిపించలేదు. అసలు నేను వచ్చిందే డైరెక్టర్ అవ్వాలని కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు దొరికిన ఆర్టిస్టులు అంతా కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండటంతో షూటింగ్ అంతా సరదాగా గడిచిపోయింది. జఫ్ఫా షూటింగ్ సమయంలో కూడా బ్రహ్మానందం గారితో చేసేటప్పుడు మొదట్లో టెన్షన్ పడ్డాను. అయన పెద్దన్న లాగా సినిమా అంతా బాగా సపోర్ట్ ఇచ్చారు.
7. సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. మసాలా ఎక్కువ కలిపారా?
స : ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తుందని నేను ముందే ఊహించాను. సెన్సార్ కట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని అనుకున్నాను. ఒకవేళ కట్స్ ఎక్కువగా పడితే మేనేజ్ చేద్దాం అనుకున్నాం. సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చూసాక బాగా ఎంజాయ్ చేసారు. కట్స్ లేకుండా అయితే ఏ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు. నేను వెంటనే అంగీకరించాను. సినిమాలో స్కిన్ షో, అశ్లీలత ఉండదు. కేవలం ఫన్నీ బూతుల వల్ల ‘ఏ’ ఇవ్వడం జరిగింది. అది కూడా అందరు బాగా ఎంజాయ్ చేస్తారు.
8. ఒక డైరెక్టర్ గా కాకుండా కమెడియన్ గా ఈ సినిమా అవుట్ పుట్ పై మీ కామెంట్స్ ఏంటి? ఇప్పటికే చూసే ఉంటారు కదా సో ఎలా వచ్చింది సినిమా?
స : వెన్నెల 1 1/2 ఒక ఫన్నీ సినిమా మాత్రమే. ఏదో నా దర్శకత్వ ప్రతిభ ఉందని చెప్పను కాని అందరు కమెడియన్స్ కలిసికట్టుగా కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం. సెపరేట్ కామెడీ కాకుండా కథతో పాటుగా వచ్చే కామెడీ రన్ అవుతుంది. అలాగే ప్రతీ పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. రఘు బాబుకి ఈ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. భరత్ ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా మారిపోతాడు.
9. వెన్నెల సినిమాకి సీక్వెల్ అన్నప్పుడు వెన్నెల 2 అని కాకుండా వెన్నెల 1 1/2 అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
స: నిజం చెప్పాలంటే యూత్ ని ఆకర్షించడానికి చేసిన పబ్లిసిటీ స్టంట్. వెన్నెల 1 1/2 అనే టైటిల్ పెడితే యూత్ ఈ టైటిల్ ఏంటి అని అడుగుతారు. క్యూరియాసిటీ పెరుగుతుంది అని అలా పెట్టడం జరిగింది. వెన్నెల సినిమాలో ఉన్న ఫస్ట్ హాఫ్ మాత్రమే తీసుకుని దానికి సీక్వెల్ గా ఈ సినిమాని చేసాం. అలా కూడా వెన్నెల 1 1/2 అని పెట్టాం.
10. వెన్నెల సినిమాలో మీరు చేసిన ఖాదర్ పాత్రనే కంటిన్యూ చేసారా? లేక కొత్తది క్రియేట్ చేసుకున్నారా?
స: వెన్నెల సినిమాలో ఉన్న పాత్రలనే కంటిన్యూ చేసాం. నాది అదే ఖాదర్ పాత్ర. వెన్నెలలో అమెరికాలో మా ఉద్యోగాలు పోయి క్లిష్ట పరిస్థుతులు ఎదురవడంతో వేరే దేశం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.
అశోక్ రెడ్డి. ఎమ్