“దేశవ్యాప్తంగా మనకు 7,500 (ఏడు వేల అయిదు వందల) థియేటర్లు ఉన్నాయి. కానీ మన జనాభా దామాషా ప్రకారం మనకు మరో 40 వేల థియేటర్లు కావాలి. మన తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1500 థియేటర్లు ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులకు సినిమాలను చేరువ చేయడానికి కనీసం మరో వెయ్యి థియేటర్లు కావాలి. కానీ ఎవరూ ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టకరం” అంటున్నారు… ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటి శాఖల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగి సినిమా రంగంతో అవ్యాజ్యమైన అనుబంధం కలబోసుకున్న బల్వంత్ సింగ్.
పరిశ్రమవర్గాలకు సుపరిచితులైన బల్వంత్ సింగ్… చైనాలో ఉన్నట్లు… మన ఇండియాలో కూడా అధిక థియేటర్లు ఎందుకు ఉండాలో సాధికారికంగా వివరిస్తారు. ఓటిటి వచ్చిన తర్వాత థియేటర్లు మూతబడడం ఖాయమేమో అన్న అనుమానాలను ఆయన నిర్ద్వంద్వంగా కొట్టి పారేస్తారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఏదైన కొత్త ప్రక్రియ ప్రారంభం అయిన ప్రతిసారి… ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజమని బల్వంత్ సింగ్ వివరిస్తారు. టీవీలు ఇళ్లల్లో తిష్ట వేసినప్పుడు, వీడియో పార్లర్లు వచ్చినప్పుడు, కేబుల్ టీవీ హవా నడిచినప్పుడు… ఇలా ప్రతిసారి థియేటర్లు మూతపడతాయనే అనవసర చర్చ జరుగుతూనే ఉందని” బల్వంత్ కొట్టి పారేశారు.
చైనాలో 50 వేల పైచిలుకు థియేటర్లు ఉండడం వల్లే అక్కడ విడుదలయ్యే సినిమాలు వందల కోట్లు అవలీలగా వసూలు చేస్తున్నాయని సింగ్ చెబుతారు. సినిమా విడుదలై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక… చాలా దూరంలో ఉన్న థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనే ఉత్సుకత ఎవరికీ ఉండదని, ఓటిటిలోనో… టీవీలోనో వచ్చినప్పుడు చూద్దామని ఫిక్స్ అయిపోతారని బల్వంత్ బలంగా అభిప్రాయపడతారు.
ముఖ్యంగా… ముందుగా థియేటర్స్ లో సినిమా విడుదల చేసి…. తదుపరి ఓటిటి లో రిలీజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని, కాబట్టి ఓటిటి వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే వాదన ఎంతమాత్రం పస లేనిదని బల్వంత్ వివరిస్తారు.
బెంగుళూర్ ప్రధాన కేంద్రంగా ఓటిటి బరిలోకి దిగిన నెట్5 సొంతం చేసుకున్న సినిమాల్లో… ఎంపిక చేసిన సినిమాలు ముఖ్య భారతీయ భాషాలన్నింట్లో థియేటర్ల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని బల్వంత్ ప్రకటించారు. అందులో భాగంగా తమ నెట్5 ఓటిటి ద్వారా ప్రసారం కావడానికి ముందే… ‘లెగసి ఆఫ్ లైస్” చిత్రాన్ని… ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నామని బల్వంత్ తెలిపారు!!