టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ‘శివ’కు 31 ఏళ్ళు


తెలుగు సినిమా చరిత్రలో గుర్తుంచుకోదగిన సినిమాల్లో ‘శివ’ కూడ ఒకటి. ఈ సినిమా విడుదలై ఈరోజుకు సరిగ్గా 31 ఏళ్ళు పూర్తవుతోంది. సరిగ్గా ఇదే రోజు 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ఇదే తొలిచిత్రం. అయినా ఎన్నో సినిమాలు అనుభవం ఉన్న దర్శకుడి తరహాలో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారాయన. అప్పటి వరకు తెలుగు సినిమాలో వినని సౌండ్ ఎఫెక్ట్స్, లైటింగ్, టేకింగ్ ఇలా చాలా విషయాల్లో ‘శివ’ సరికొత్త ఒరవడి సృష్టించింది.

ఈ సినిమా అందించిన విజయంతో నాగార్జున స్టార్ హీరోల సరసన చేరిపోగా వర్మ స్టార్ డైరెక్టర్ అయ్యారు. రాజమౌళి లాంటి దర్శకులే ‘శివ’ సినిమాలోని సన్నివేశాల రన్ టైమ్ ఆధారంగా చేసుకుని తన మొదటి సినిమాకు సీన్స్ రాసుకున్నానని అన్నారంటే ఆ చిత్రం గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్నిఅన్నపూర్ణ స్టూడియోస్‌, ఎస్‌ఎస్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. అప్పటివరకు ఫ్యామిలీ డ్రామాలు, ఒకే తరహా మాస్ కథలతోనే నెట్టుకొస్తున్న తెలుగు పరిశ్రమకు గ్యాంగ్ వార్స్ తరహా కొత్త కథలను పరిచయం చేసింది ఈ చిత్రమే.

22 సెంటర్లలో శత దినోత్సవాన్ని జరుపుకున్న ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఫిలింఫేర్‌ అవార్డుతో పాటు ఉత్తమ మొదటి చిత్రం, ఉత్తమ దర్శకుడు‌, ఉత్తమ డైలాగ్స్ లాంటి కేటగిరీల్లో నంది అవార్డులు లభించాయి. విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా వర్మకు, నాగార్జునకు, యావత్ తెలుగు పరిశ్రమకు ‘శివ’ ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా స్థిరపడిపోయింది.

Exit mobile version