సమీక్ష : ఏబిసిడి – అక్కడక్కడే బాగుంది

సమీక్ష : ఏబిసిడి – అక్కడక్కడే బాగుంది

Published on May 18, 2019 4:00 AM IST
ABCD movie review

విడుదల తేదీ : మే 17, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అల్లు శిరీష్‌, రుక్సార్ థిల్లాన్, నాగ‌బాబు, భరత్ తదితరులు.

దర్శకత్వం : సంజీవ్ రెడ్డి

నిర్మాత : మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని

సంగీతం : జుధా సాంధీ

సినిమాటోగ్రఫర్ : రామ్

ఎడిటర్ :  నవిన్ నూలి


సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘ఏబీసీడీ’ ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ అనేది ట్యాగ్ లైన్. మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఎన్నారై అరవింద్ (అల్లు శిరీష్) డబ్బులో పుట్టి డబ్బులో పెరగడం వల్ల.. డబ్బు విలువ ఏ మాత్రం తెలియకుండా ఖర్చు పెడుతూ.. ఎలాంటి బాధ్యతలు లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అరవింద్ డబ్బు విలువ, జీవితం విలువ ఎలాగైనా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో అతని తండ్రి (నాగబాబు) అరవింద్ ను, బాషాను (భరత్) ఇండియాకు పంపి ఎంబీఏ పూర్తి చేసి రావాల్సిందే అని చెప్తాడు.
ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అరవింద్ కాలేజీలో జాయిన్ అయి అత్యంత పొదుపుగా బతుకుతూ తిరిగి అమెరికా వెళ్ళటానికి తన ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అరవింద్ నేహా (రుక్సార్ థిల్లాన్)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత లోకల్ పొలిటిషన్ కొడుకు శిరీష్ (రాజా )కు అరవింద్ ఎందుకు టార్గెట్ అయ్యాడు ? వారి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి? ఆ సంఘటనల వల్ల అరవింద్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? ఆ మార్పులకి తను ఉండే కాలనీ వాసులు ఎలా కారణం అయ్యారు ? చివరికి అరవింద్ డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలుసుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటినుంచో సూపర్ హిట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్నాడు అల్లు శిరీష్. అందులో భాగంగా ఈ సినిమా కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని మరి ఈ సినిమా చేసాడు. మొత్తంగా ఈ సినిమా కోసం అల్లు శిరీష్ పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా డబ్బు, లైఫ్ వాల్యూ తెలుసుకునే అరవింద్ క్యారెక్టర్‌ లో శిరీష్ చక్కని నటనను కనబరిచాడు. గత సినిమాల్లో కంటే, ఈ సినిమాలో శిరీష్ నటన ఆకట్టుకుంటుంది. మెయిన్ గా సినిమాలో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, క్లైమాక్స్ లో ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తోనూ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక శిరీష్ సరసన కథానాయకిగా నటించిన రుక్సార్ థిల్లాన్ కు రెగ్యులర్ హీరోయిన్ గా పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. ఉన్నంతలో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పిస్తోంది. మెయిన్ మెల్లగా మెల్లగా సాంగ్ లో మరియు కొన్ని ప్రేమ సీన్స్ లో ఆమె చాలా బాగా నటించింది.

మరో కీలక పాత్రలో నటించిన కమెడియన్ భరత్ తన కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోకి తండ్రిగా నటించిన నాగబాబు కూడా చాలా బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఓ ఎన్నారై కుర్రాడికి డబ్బు మరియు జీవితం విలువను తెలియజేసే చక్కని పాయింట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు ఆ పాయింట్ కు తగ్గట్లు సినిమాను తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. హీరో క్యారెక్టరజేషేన్ సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరోలో మార్పు రావడానికి గల కారణాలను, అలాగే ఆ మార్పు వల్ల హీరోలో వచ్చిన మార్పుకు సంబంధించిన సీన్స్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. దీనికి తోడు కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అలాగే లవ్ స్టోరీ కూడా పూర్తిగా ఆకట్టుకోదు. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడే సన్నివేశం బాగా రాసుకున్న దర్శకుడు, సెకెండ్ హాఫ్ లో లవ్ సీన్స్ ను ఆ స్థాయిలో రాసుకోలేదు.

ఇక సినిమాలో మెయిన్ పాయింట్ ను మొదటినుంచి బాగా ఎలివేట్ చేసిన దర్శకుడు, క్లైమాక్స్ లో ఆ పాయింట్ కి తగ్గ స్థాయిలో ఇంకా సరైన ముగింపు ఇస్తే బాగుండేది. అలాగే జీవితం విలువ డబ్బు విలువ తెలుసుకున్న హీరో, తానూ వాటి విలువ తెలుసుకున్నానని డైలాగ్ ల రూపంలో కాకుండా, ఇన్సిడెంట్స్ రూపంలో చూపించే ఉంటే ఇంకా ఎఫెక్ట్ గా వుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సంజీవ్‌ రెడ్డి కొన్ని సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక సినిమాలో రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు జుధా సాంధీ అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో మెల్లగా మెల్లగా సాంగ్ , అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు:

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం మంచి థీమ్ తో మరియు హీరో క్యారెక్టరైజేషన్ తో అలాగే కొన్ని సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. కథనం మరియు సెకెండ్ హాఫ్ కొన్ని కీలక సన్నివేశాల విషయంలో మాత్రం నిరుత్సాహ పరుస్తోంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో హీరోలో మార్పు రావడానికి గల కారణాలు బలంగా లేకపోవడం, అలాగే ఆ మార్పు వల్ల హీరోలో వచ్చిన మార్పుకు సంబంధించిన సీన్స్ సరిగ్గా ఎలివేట్ కాకపోవడం, అలాగే లవ్ స్టోరీ కూడా పూర్తిగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

అయితే అల్లు శిరీష్ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు. రుక్సార్ థిల్లాన్ నటన కూడా చాలా బాగుంది. ఇక వెన్నెల కిశోర్, భరత్ తమ కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించారు. మొత్తం మీద ఈ చిత్రం అల్లు అభిమానులను అలరిస్తోంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు