అభిమానులు నా ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు. దానికి కొంచం ఆలస్యం అవుతుంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో మీ ముందుకు రావాలని ఎదురు చూస్తున్నా. ‘ఒక లైలా కోసం’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత నా ఎంట్రీ గురించి విజయవాడలో మీ అందరి ముందుకు వచ్చి చెప్తాను. అంత వరకు అభిమానులు కొంచం ఓపిక పట్టాలి అని శనివారం సాయంత్రం జరిగిన ‘మనం’ 100 రోజుల వేడుకలో అక్కినేని అఖిల్ తెలిపారు.
ఇంకా అఖిల్ మాట్లాడుతూ… తాతగారు నటించిన చివరి సినిమాలో నాకు నటించే అవకాశం కల్పించినందుకు నాన్నగారికి థాంక్స్. ఇటువంటి కాంప్లికేటేడ్ సబ్జెక్టుని సినిమాగా నిర్మించారు. ‘మనం’లో చిన్న పాత్ర అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు అఖిల్. గత కొన్ని రోజుల నుండి అఖిల్ ఎంట్రీ గురించి చాలా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇకపై వాటికి ఫుల్ స్టాప్ పడనుంది.
ఇంకా ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలీతో పాటు ‘మనం’, ‘ఒక లైలా కోసం’ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇదే వేదికపై ‘ఒక లైలా కోసం’ ఆడియో విజయోత్సవ వేడుక నిర్వహించారు.