విడుదల తేదీ : నవంబర్ 10, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు.
దర్శకుడు : మారేష్ శివన్
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
సంగీతం: సుభాష్ ఆనంద్
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంబంధిత లింక్స్: ట్రైలర్
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలా నిన్ను చేరి. ఇటీవల టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది పూర్తి సమీక్షలో చూద్దాం.
కథ :
సంపన్న పల్లెటూరి అమ్మాయి అయిన దివ్య (పాయల్ రాధాకృష్ణ) ని చూసిన అనంతరం గణేష్ (దినేష్ తేజ్) ఆమెతో ప్రేమలో పడతాడు, కాలక్రమేణా వారిద్దరి మధ్య ప్రేమ అన్యోన్యంగా మారుతుంది. అయితే వారిద్దరి వివాహాన్ని ఒప్పుకోని ఆమె తల్లి (ఝాన్సీ) తనకు వేరొక అబ్బాయితో వివాహాన్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు దివ్య గణేష్‌తో పారిపోవాలని ఆలోచిస్తుంది. అయితే, తనకు ఉన్న ఒక లక్ష్యం కారణంగా అతడు పెళ్ళికి వెనుకాడతాడు. మరి ఆ తరువాత ఏమి జరుగుతుంది, దివ్యని గణేష్ పెళ్లి చేసుకున్నాడా, అసలు గణేష్ లక్ష్యం ఏమిటి, అనంతరం అను (హెబ్బా పటేల్) అతని ప్రయాణంలో ఎలా భాగం అవుతుంది అనే వాటికి సమాధానాలు తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
హీరో దినేష్ తేజ్ మరొక్కసారి గణేష్ పాత్రలో ఆకట్టుకునే పెరఫార్మన్స్ కనబరిచారు. ముఖ్యంగా పలు సీన్స్ లో అతడు కనబరిచిన నటనతో పాటు డ్యాన్స్ వంటివి కూడా ఎంతో బాగున్నాయి. హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు అందం, అభినయంతో అలరించింది. మహబూబ్ బాషా తాను పోషించిన పాత్రలో కామెడీతో కొంత వరకు ఆకట్టుకున్నారు. ఇతర నటీనటులు వారి వారి పాత్రలలో సంతృప్తికరమైన నటనను ప్రదర్శించారు.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన డ్రా బ్యాక్ ఏమిటంటే కథనాన్ని ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిన దర్శకుడు ముందుకు తీసుకెళ్లలేకపోవడం. తెలుగు సినిమాల్లో ఏళ్ల తరబడి చూసిన కథ, కథాంశం ఉన్నప్పటికీ, దర్శకుడు మరింత ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లేతో సరికొత్త దృక్పథంతో దానిని ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు. హెబ్బా పటేల్ క్యారెక్టర్ తో మూవీకి గ్లామర్ జోడించారు, అయితే ఆమె చాలా సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి మరియు మొత్తం కథకు అవి పెద్దగా బలాన్ని అందించలేవు అని చెప్పాలి. డైలాగ్‌లు నార్మల్ గానే ఉన్నాయి. కొన్ని డైలాగులు అయితే ఉద్దేశపూర్వకంగా పెద్దలని ఉద్దేశించి రాశారా అనిపిస్తుంది. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌కి అంతగా నచ్చకపోవచ్చు. పాటలు ట్యూన్ పరంగా ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, రెండు ట్రాక్‌లలో అర్ధవంతమైన సాహిత్యం లేదు. మహేష్ ఆచంట పాత్రకు మరింత డెప్త్ ఇచ్చి ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక చమ్మక్ చంద్ర పాత్ర అనవసరం అనిపిస్తుంది. పలు సన్నివేశాలు బలవంతంగా జొప్పించినవిగా అనిపిస్తాయి, ఇవి మూవీ యొక్క అధిక రన్ టైంకి కారణంగా నిలుస్తాయి.
సాంకేతిక వర్గం :
దర్శకుడు మారేష్ శివన్ సినిమాను ఎఫెక్టివ్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో తడబడ్డారు. ఊహించదగిన సన్నివేశాలను మెరుగైన స్క్రీన్‌ప్లే మరియు ఆకర్షణీయమైన సంభాషణలతో మరింత మెరుగుపరచవచ్చు, కానీ దానికి బదులుగా మూవీలో అనవసరమైన సన్నివేశాలు మరియు అస్పష్టమైన భాషతో ముందుకు నడిపారు. ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ బోర్ కొట్టేలా ఉన్న చాలా సీన్స్ ట్రిమ్ చేసి ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ మరియు సంగీతం యావరేజ్‌గా ఉన్నాయి. మరి తొలి నిర్మాణం అయినప్పటికీ, నిర్మాతలు మూవీని గ్రాండ్ గానే నిర్మించారు.
తీర్పు :
మొత్తం మీద, అలా నిన్ను చేరి మూవీ ఆకట్టుకోని స్క్రీన్ ప్లే తో సాగే నిరాశపరిచే ప్రేమ కథా చిత్రం. దినేష్ తేజ్ తన పాత్రలో ఆకట్టుకునే నటన కనబరిచినప్పటికీ, మూవీలో అనవసరమైన సన్నివేశాలు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్‌తో లేకపోవడంతో ఫ్లో దెబ్బతింది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team