‘పుష్ప-2’ ప్రీమియర్ షో ప్రదర్శనలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె తనయుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యి, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, ఆయన్ను జైలుకి తరలించడం, బెయిల్ పై ఆయన బయటకు రావడం జరిగింది.
ఇక శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అతడిని పరామర్శించి శ్రీ తేజ్ పరిస్థితిపై ఆరా తీశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. శ్రీ తేజ్‌కు ప్రస్తుతం మెరుగైన చికిత్స అందుతోందని.. గత కొద్ది రోజులుగా అతను రికవర్ అవుతున్నాడని.. అయితే, అతడు కోలుకోవడానికి ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. శ్రీ తేజ్‌ను కలిసేందుకు అల్లు అర్జున్‌కు పోలీసులు, లీగల్ టీమ్ పర్మిషన్ ఇవ్వలేదని అల్లు అరవింద్ ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీ తేజ్ కోలుకోవడానికి తాము పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అతనికి మెరుగైన చికిత్స అందించేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర సీఎంకు అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.