అల్లు అర్జున్ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని, పవన్ అభిమానులు ఓ వేడుకలో అల్లు అర్జున్‌ను కోరగా, ఆయన అందుకు సమాధానంగా ‘మాట్లాడను బ్రదర్’ అనడం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది. పవన్ అభిమానులంతా బన్నీపై ఇదే విషయమై తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, ఆయన మరోసారి కూడా ‘మాట్లాడను బ్రదర్’ అనడంతో పవన్ అభిమానుల అసహనం కొద్దిరోజులుగా తారాస్థాయికి చేరిపోయింది.
తాజాగా ఈ సాయంత్రం బన్నీ ఈ విషయంపై తనదైన స్టైల్లో స్పష్టతనిచ్చే ఇచ్చే ప్రయత్నం చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ నిహారిక నటించిన ‘ఒక మనసు’ ఆడియో వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన బన్నీ ఈ సందర్భంగా పవన్ విషయమై మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అని అనడం వెనుక కారణం ఉంది. కొద్దికాలంగా ఏ ఫంక్షన్ జరిగినా, పవర్‌స్టార్.. పవర్ స్టార్ అని అరవడం జరుగుతూ వస్తోంది. ఓ పెద్ద దర్శకుడు తన సినిమా గురించి చెప్పుకుంటుంటే కూడా పవర్ స్టార్ అనడం చూశా. ఇవన్నీ పవర్ స్టార్ గారికి కూడా మచ్చ తెచ్చేవే! మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో అయితే ఫర్వాలేదు కానీ, ఇతర హీరోల ఫంక్షన్స్‌లో కూడా పవర్ స్టార్ అని అరవడం మెగా ఫ్యామిలీ మొత్తానికీ మంచిది కాదు. చిరంజీవి గారు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ఇది అందరికీ అవమానకరమే. నేను అందుకనే పవన్ కళ్యాణ్ గురించి మొన్న మాట్లాడను అన్నా. ఇక నుంచి అలా జరగకూడదని కోరుతున్నా” అని కొందరు పవన్ అభిమానులను ఉద్దేశించి అన్నారు.
అల్లు అర్జున్ పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


