విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, చారు శంకర్, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్ తదితరులు
దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
సంగీతం: JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, హర్షవర్ధన్ రామేశ్వర్, అషిమ్ కెమ్సన్
సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్
ఎడిటర్: సందీప్ రెడ్డి వంగ
సంబంధిత లింక్స్: ట్రైలర్
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో కలయికలో వచ్చిన సినిమా యానిమల్. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)కి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే పిచ్చి ప్రేమ. అయితే, బల్బీర్ సింగ్ బిజీ బిజినెస్ మెన్. భారతదేశంలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటాడు. ఆ బిజీ లైఫ్ లో కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా రణ్ విజయ్ సింగ్ కి – బల్బీర్ సింగ్ కి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో, కొడుకుని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రణ్ విజయ్ సింగ్, గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాడు. ఐతే, బల్బీర్ పై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకుని, తిరిగి ఇండియాకి వస్తాడు. అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకుంది ఎవరు ?, తన తండ్రి శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ?, అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రణబీర్ కపూర్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫెరెంట్ వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో విజయ్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా రణబీర్ తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. మరో కీలక పాత్రలో ఫాదర్ గా నటించిన అనిల్ కపూర్ నటన ఆకట్టుకుంది. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన బాబీ డియోల్ కూడా చాలా వైల్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.
యాక్టింగ్ పరంగా బాబీ డియోల్ గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా రష్మిక మందన్నా మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. మరో హీరోయిన్ తృప్తి డిమ్రి నటన బాగుంది. కొన్ని బోల్డ్ సీన్స్ లో ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది. చారు శంకర్, శక్తి కపూర్ మరియు బబ్లూ పృథ్వీ రాజ్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
తండ్రి పై తనకున్న పిచ్చి ప్రేమతో ఓ కొడుకు, తన తండ్రి కోసం ఏం చేశాడు అనే కోణంలో సాగిన ఈ సినిమాలో బలమైన కథ లేదు. తండ్రిని చంపడానికి చూసిన శత్రువులను ఎలా చంపాడు ? అనేదే ప్రధానమైన కథ అయిపోయింది. దీనికితోడు కథలోని ప్రతి పాత్ర, ఆ పాత్రల తాలూకు ప్రతి ఎమోషన్ ఫోర్స్డ్ గానే ఉంటుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయనే ఫిల్ కలిగినా.. దాని కోసం ఈ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది ? అనే అనుమానం కూడా వెంటాడుతూ ఉంటుంది. నిజానికి రణబీర్ కపూర్ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న సందీప్, అంతే స్థాయిలో ఈ యానిమల్ సినిమా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు.
ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో సందీప్ రెడ్డి వంగా కొన్ని చోట్ల విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా గత తన సినిమా శైలిలోనే సందీప్ రెడ్డి, ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపాడు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకెండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. అసలు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన యానిమల్ కథాకథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘యానిమల్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటన, భారీ వైల్డ్ యాక్షన్ సీన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ అండ్ హెవీ ఎమోషన్స్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మరియు రణబీర్ అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team