విడుదల తేదీ : ఆగష్టు 24, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
నటీనటులు : జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, మధునందన్, హర్ష, టి.ఎన్.ఆర్ తదితరులు
దర్శకత్వం : జానీ
నిర్మాతలు : జై, సతీష్, పద్మనాభరెడ్డి
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : పి.బాలిరెడ్డి
స్క్రీన్ ప్లే : జానీ
ఎడిటర్ : క్రాంతి(ఆర్ కె)
జై, రష్మి గౌతమ్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న చిత్రం ‘అంతకు మించి’. ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ :
రాజు (జై) ఓ మిలినియర్ కావాలని కలలు కంటూ సంతోషంగా గడిపేస్తుంటాడు. అయితే దెయ్యం ఉందని రుజువు చేయగలిగితే 5 కోట్ల రూపాయలను సంపాదించగలనని తెలుసుకుంటాడు. కాగా తన సోదరి ఇంటిలోనే కొన్ని విచిత్రమైన సంఘటనలను గమనిస్తాడు, అక్కడున్న దెయ్యం ఉందని ఎలాగైనా ప్రూవ్ చెయ్యాలనుకుంటాడు.
ఈ ప్రక్రియలో, ప్రియ (రష్మి) రాజుతో దెయ్యం ఏమి లేదని ప్రూవ్ చెయ్యటానికి ప్రయత్నిస్తోంది. చివరకి రాజు తన దెయ్యం ఉందని నిరూపించడానికి తగిన సాక్ష్యాలను సేకరించాడా ? ప్రియ లేదని నిరుపిస్తుందా ? రాజు 5 కోట్ల బహుమతిని గెలుచుకుంటాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మొదటి సారి హీరోగా నటించిన జై లుక్స్ పరంగా బాగానే ఉన్నాడు. దెయ్యం ఉందని ప్రూవ్ చెయ్యటానికి ప్రయత్నించే సన్నివేశాల్లో జై నటన పర్వాలేదనిపిస్తోంది. రష్మితో చేసిన రొమాంటిక్ సన్నివేశాల్లో ఎలాంటి బెఱుకు లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా నటించాడు.
ఇక కథానాయకిగా నటించిన రష్మి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. . ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో తన ఆకర్షణీయమైన ప్రదర్శనతో మరియు క్లైమాక్స్ లో తన నెగిటివ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది.
కమెడియన్ మధు తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. దానికి కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించినట్లు అనిపిస్తోంది. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలను కన్వీన్స్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమైయ్యారు.
రష్మి, మధు లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, దర్శకుడు మాత్రం ఆ దిశగా ఆలోచినట్లు కనిపించలేదు. పైగా ప్రతి సన్నివేశం సినిమాటెక్ గానే బోర్ గానే సాగుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు జానీ పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ ను స్క్రీన్ మీద సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇక ఆయన రాసుకున్న కథలో సహజత్వంతో కూడా బాగా లోపించింది. పి.బాలిరెడ్డి కెమెరా పనితనం హార్రర్ సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.
సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగానే అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఎడిటర్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్లు అనిపిస్తోంది.
సినిమాలోని జై, సతీష్, పద్మనాభరెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి.
తీర్పు :
పోస్టర్స్ తోనే యూత్ ని ఆకట్టుకోవాలని ప్రయత్నించిన ఈ చిత్రం కనీస అట్టడుగు స్థాయి సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకుంటుందని చెప్పలేము. ఇక సినిమాల్ని రెగ్యూలర్ గా చూసే ప్రేక్షకులకి ఈ చిత్రం అస్సలు రుచించకపోగా విపరీతమైన చికాకుకు గురిచేస్తోంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team