విడుదల తేదీ : జూలై 19, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: అంజలి ,రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ బాషా, మరియు చైతన్య సాగిరాజు తదితరులు.
దర్శకులు: ముఖేష్ ప్రజాపతి
నిర్మాత : ప్రశాంతి మలిశెట్టి.
సంగీత దర్శకులు: సిద్ధార్థ్ సదాశివుని
సంబంధిత లింక్స్: ట్రైలర్
ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రధారులు. కాగా నేరుగా ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. మరి ఈ సిరీస్ మీకు నచ్చుతుందా ? లేదా ? అనేది మా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల పది ఊళ్లకు శివయ్య (రవీంద్ర విజయ్) పెద్దమనిషి. ఆ ఊళ్లకు శివయ్య మాట శాసనం. తన డబ్బు, తనకున్న అధికారం అడ్డం పెట్టుకొని మహిళల జీవితాలను శివయ్య నాశనం చేస్తూ ఉంటాడు. మరోవైపు పుష్ప (అంజలి) ఓ వేశ్య. శివయ్యకు ఉంపుడుగత్తెగా ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్) – పుష్పతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తోంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ, దర్శి, లక్ష్మి (అనన్యా నాగళ్ల) మెడలో ఎందుకు తాళి కట్టాల్సి వచ్చింది ?, ఆ తర్వాత దర్శి జైలుకు ఎందుకు వెళ్లాడు ?, జైలు నుంచి వచ్చాక దర్శి ఏం చేశాడు ?, చివరకు శివయ్య పై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్లు :
గ్రామాల్లో పాతికేళ్ల క్రితం కులమతాల పట్టింపులు ఎక్కువుగా ఉండేవి. ఈ సీరీస్ కూడా అప్పటి ఆ నేపథ్యంలోనే సాగింది. పెద్దమనిషిగా చలామణి అయ్యే శివయ్య పాత్ర చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామా, అలాగే వేశ్య పుష్ప పాత్ర, అదేవిధంగా కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను బాగానే మెయింటైన్ చేశారు. పుష్ప – శివయ్య క్యారెక్టర్ల మధ్య సంబంధం, ఈ పాత్రలతోటి దర్శి పాత్రకు ఉన్న అనుబంధం ఆకట్టుకుంది. పైగా ఈ మూడు పాత్రల చుట్టూ సాగిన క్రైమ్ కాన్ ఫ్లిక్ట్ కూడా బాగుంది.
వేశ్య పుష్పగా అంజలి నటన చాలా బాగుంది. బోల్డ్ అండ్ లవ్ సన్నివేశాల్లో అంజలి నటన సిరీస్ కే హైలైట్ గా నిలిచింది. మరో హీరోయిన్ అనన్యా నాగళ్ల కూడా బాగానే నటించింది. కథ రీత్యా అనన్యా పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ, ఆమె తన నటనతో మెప్పించింది. శివయ్యగా రవీంద్ర విజయ్ నటన కూడా బాగుంది. పెద్దమనిషి పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన శ్రీతేజ్ కూడా చాలా బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ సిరీస్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగానే తీశాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సిరీస్ లో ప్రధాన కథాంశం, శివయ్య – పుష్ప పాత్రలు, ఇక పెద్దపల్లి గ్రామం కథా నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటుల పనితీరు బాగున్నా.. కథనం విషయంలో మాత్రం దర్శకుడు ముఖేష్ ప్రజాపతి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. చివరి మూడు ఎపిసోడ్స్ లో పాత్రల మధ్య ఎమోషన్స్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసినా… కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. దీనికి తోడు సిరీస్ లో కొన్నిచోట్ల ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి.
తక్కువ కులానికి చెందిన అమ్మాయిల పై పెద్ద మనుషుల రూపంలో ఉన్న కొన్ని మృగాళ్లు ఎలా దారుణాలు చేశారనే కోణంలో సాగిన సీన్స్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినా.. ట్రీట్మెంట్ లో ఇంకా బలమైన కాన్ ఫ్లిక్ట్ ను బిల్డ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. దీనికితోడు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా రొటీన్ గానే సాగాయి. శివయ్య పాత్ర పై లక్ష్మి సాయంతో పుష్ప తీర్చుకునే రివెంజ్ కూడా ఇంకా బలంగా ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి టేకింగ్ బాగుంది. అయితే, మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన కొన్ని చోట్ల విఫలం అయ్యారు. సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని అందించిన సంగీతం బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాత ప్రశాంతి మలిశెట్టి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘బహిష్కరణ’ అంటూ సాగిన ఈ సీరీస్ లో కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ను బాగానే మెయింటైన్ చేశారు. రా అండ్ రస్టిక్ ఫీల్ తో సాగే కొన్ని సన్నివేశాలు కూడా పర్వాలేదు. ఐతే, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్, మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సిరీస్ కి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సిరీస్ లో నటీనటుల నటన, కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సిరీస్ ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team