సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి సతీమణి శ్రీమతి ఇందిరాదేవి గారు సెప్టెంబర్ 28న హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. అంతకముందు గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అకాల మరణం మహేష్ బాబు, కృష్ణ గారితో పాటు ఘట్టమనేని కుటుంబాన్ని మొత్తాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఆ తరువాత మహేష్ బాబు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఘటన తరువాత పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ గారి ఇంటికి వచ్చి వెళుతూ ఇందిరాదేవి గారికి నివాళులు అర్పిస్తున్నారు.
ఇక నేడు కొద్దిసేపటి క్రితం నటసింహం నందమూరి బాలకృష్ణ, కృష్ణ గారి ఇంటికి విచ్చేసి ఇందిరాదేవి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు మహేష్, కృష్ణ లకు ధైర్యం చెప్పారు. మొదటి నుండి ఎన్టీఆర్ గారి కుటుంబంతో కృష్ణ గారి కుటుంబానికి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసందే. కాగా నేడు బాలకృష్ణ, కృష్ణ గారి ఇంటికి వచ్చి వెళ్లిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.