బాలయ్య ‘నర్తనశాల’ ఎలా ఉందంటే.. !

Published on Oct 25, 2020 12:24 am IST

పౌరాణిక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 16 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా శ్రేయాస్‍ యాప్ లో ఎన్.బి.కె థియేటర్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ విషయానికి వస్తే.. అజ్ఞాతవాసానికి బయలుదేరిన పాండవులు.. ఎవ్వరి కంట పడకుండా తామూ ధరించబోయే వేషాల గురించి అరిగిపోయిన పాత డైలాగ్స్ చెప్పుకుంటూ మొత్తానికి ఓ సుదీర్ఘ సన్నివేశాన్ని లాక్కోస్తారు. ఇక ఈ క్రమంలో చూపించే ఆ కాలం నాటి హావభావాలతో.. మొత్తంగా అజ్ఞాతవాసానికి సన్నద్ధం అవ్వడానికే ఈ ఫిల్మ్ లో సగం ఫుటేజ్ సరిపోయింది. పోనీ ఈ సుదీర్ఘ సన్నివేశంలో ఏమైనా ఆసక్తి ఉందా అంటే.. ఈ జంరేషన్ కి ఏ మాత్రం ఇంట్రస్ట్ గా సాగని కథనం, దర్శకత్వ పనితనంతో ఎనిమిది నిమిషాలకే ప్రేక్షకులకు బాలయ్య నీరసం తెప్పిస్తారు. దీనికి తోడు మిగిలిన సగం సేపు సీనియర్ ఎన్టీఆర్‍ ‘నర్తనశాల’లోని ‘‘నరవరా కురువరా’’ అనే పాటను ఈ వీడియోలో డైరెక్ట్ గా పెట్టేశారు. పైగా ఆ సినిమాలోని ఓ సీన్ ను కూడా అలాగే వాడేసారు.

ఇక చివర్లో బాలయ్య బాబు బృహన్నల వేషంలో కనబడటానికి ‘టాప్‍ హీరో’లో చేసిన ఓ చిన్న షాట్ ను ఇక్కడ చూపించడం.. చూపిస్తే చూపించారు.. ఆ షాట్ తో పాటు బాలయ్య బాబు అప్పట్లో వేసిన ఓ మాస్ స్టెప్ ను కూడా ఇక్కడ వాడేయడం.. అది కాస్త ఫ్యాన్స్ ను కూడా ఇబ్బంది పెట్టేలా ఉండటం.. మొత్తానికి ఈ బాలయ్య నర్తనశాల ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఈ మాత్రం దానికి 50 రూపాయిలు టికెట్ పెట్టడం అనవసరం.. అయితే చారిటీ కోసం బాలయ్య ఈ మొత్తాన్ని ఉపయోగిస్తున్నాడు కాబట్టి.. చారిటీకి సాయపడాలనుకునే వారు టికెట్ పెట్టి ఈ షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమాని ఓపిక చేసుకుని చూడొచ్చు.

సంబంధిత సమాచారం :

More