బ్యాన్ చేయబడ్డ నటుడితో కలిసి సినిమా చేయనున్న ఎన్టీఆర్ !


‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రంలో తారక్ ఏకంగా త్రిపాత్రాభినయం చేయనున్నాడు. దీంతో ఈ సినిమాకు ఒక ప్రత్యేకతతో పాటు భారీ క్రేజ్ కూడా సంతరించుకుంది. నిన్న విడుదలైన టైటిల్ లోగో కూడా రామాయణ నైపథ్యం కలిగి భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇలా ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

అదేమిటంటే ఇందులో ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ ను తీసుకుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. గత ఏడాది దునియా విజయ యొక్క చిత్రం ‘మస్తిగుడి’ షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు స్టంట్ మ్యాన్లు మరణించడంతో కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆయన్ను సినిమాల నుండి తాత్కాలికంగా బహిష్కరించింది. ఈ అంశం దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో సంచలనం రేపింది.

ఇలా ఒక పరిశ్రమలో బ్యాన్ చేయబడిన నటుడితో కలిసి ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడని తెలియడంతో అందరిలోనూ ఆసక్తితో పాటు ఒకింత ఆశ్చర్యం కూడా కలుగుతోంది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి పూర్తి స్థాయి అధికారిక సమాచారం వెలువడే వరకు ఎలాంటి నిర్దారణకు రావడానికి వీల్లేదు.

Exit mobile version