సమీక్ష: భజే వాయు వేగం – ఇంప్రెస్ చేసే యాక్షన్ థ్రిల్లర్

సమీక్ష: భజే వాయు వేగం – ఇంప్రెస్ చేసే యాక్షన్ థ్రిల్లర్

Published on Jun 1, 2024 3:02 AM IST
Bhaje Vaayu Vegam Movie Review in Telugu

విడుదల తేదీ : మే 31, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ హరిదాస్, తనికెళ్ళ భరణి, రవి శంకర్ తదితరులు

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి

నిర్మాతలు : యూవీ కాన్సెప్ట్స్

సంగీత దర్శకుడు: రధన్, కపిల్ కుమార్ జమ్ముల

సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్

ఎడిటింగ్: సత్య జి

సంబంధిత లింక్స్: ట్రైలర్

చాలా రోజులు తర్వాత టాలీవుడ్ లో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి మంచి బజ్ ఉన్న సినిమాలు కాస్త ఎక్కువ వచ్చాయని చెప్పాలి. అలా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం “భజే వాయు వేగం” అంటూ వచ్చిన ఓ సాలిడ్ యాక్షన్ డ్రామానే ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ:

ఇక కథ లోకి వస్తే.. వరంగల్ లోని రాజన్న పేట గ్రామంలో వెంకట్ (కార్తికేయ) తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కష్ట సమయంలో ఊర్లో వారి అప్పులని తీర్చి లక్ష్మయ్య (తనికెళ్ళ భరణి) వెంకట్ ని అక్కున చేర్చుకుంటారు. అయితే తన సొంత కొడుకు రాజు(రాహుల్ టైసన్) తో సమానంగా పెంచి పోషిస్తారు. అయితే ఇద్దరినీ ఉన్నత స్థానాల్లో చూడాలని పెద్ద కొడుకు రాజుకి మంచి ఉద్యోగం, చిన్నోడు వెంకట్ ని క్రికెటర్ చెయ్యాలని తన తాహతుకు మించి కష్టపడతూ హైదరాబాద్ కి పంపిస్తారు. అయితే ఇంకో పక్క హైదరాబాద్ ని ఏలుతున్న ఇద్దరు అన్నతమ్ములు డేవిడ్ (రవి శంకర్), జార్జ్ (శరత్ లోహితిస్వ) లు హైదరాబాద్ లోకి నాన్ లోకల్ గా వచ్చి కంట్రోల్ లో పెట్టుకుంటారు. అయితే ఇంత పవర్ఫుల్ వ్యక్తులకు అతి సామాన్యులు అయ్యిన వెంకట్, రాజులకి ఎలా ఘర్షణ మొదలవుతుంది? ఈ క్రమంలో లక్ష్మయ్య ని కాపాడుకోడానికి వీరేం చేస్తారు? హైదరాబాద్ లో రన్ అవుతున్న ఏ 56 డ్రగ్ రాకెట్ ని నడిపిస్తుంది ఎవరు? ఇందులో ఇందు (ఐశ్వర్య మీనన్) పాత్ర ఏంటి? అసలు వెంకట్, రాజు లు తమ తండ్రిని కాపాడుకోవడంలో ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం ట్రైలర్ తోనే మంచి యాక్షన్ థ్రిల్స్ ని మేకర్స్ ప్రామిస్ చేశారు. సినిమా కూడా మేకర్స్ ప్రామిస్ చేసినట్టు గానే సాలిడ్ యాక్షన్ అండ్ థ్రిల్స్ ని అందిస్తుంది. ఇక ముందుగా నటీనటుల పెర్ఫార్మన్స్ ల విషయానికి వస్తే.. మొత్తం మెయిన్ లీడ్ నటీనటులు కూడా సాలిడ్ పెర్ఫార్మన్స్ లను అందించారు అని చెప్పాలి. కార్తికేయ తన రోల్ ని చాలా బాగా చేసాడు. చాలా సెటిల్డ్ గా గత సినిమాలకి మించి మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ని కూడా తాను అందించాడు.

ఇక దీనితో పాటుగా యాక్షన్ సీన్స్ లో కూడా మంచి డైనమిక్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు అని చెప్పవచ్చు. ఇక ఐశ్వర్య మీనన్ కూడా డీసెంట్ నటన కనబరిచింది. ఇంకా రాహుల్ టైసన్ కూడా తన రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి తన అనుభవం తో మంచి పాత్రని చేసి ఎమోషనల్ గా మెప్పిస్తారు. ఇక మరో నటుడు రవి శంకర్ అయితే తన రోల్ లో ఆశ్చర్యపరుస్తారు అని చెప్పాలి. విలన్ పాత్రలో అదరగొట్టేసారు, సెకండాఫ్ లో తన చుట్టూతా తిరిగే కథనం, ట్విస్ట్ లు మెప్పిస్తాయి.

అలాగే కొన్ని సీన్స్ లో తన కన్నింగ్ నెస్, కొన్ని హావభావాలతో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించారు. ఇంకా తన అన్నయ్య పాత్రలో కనిపించిన ప్రముఖ నటుడు శరత్ లోహితిస్వ కూడా మంచి రోల్ చేసి తన రోల్ కి న్యాయం చేసారు. ఇక వీరితో పాటుగా ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇంకా వీటితో పాటుగా సినిమా ఇంటర్వెల్ ముందు 15 నిమిషాల ఎపిసోడ్ ట్విస్ట్ లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే మెయిన్ గా సెకండాఫ్ బాగా ఇంప్రెస్ చేస్తుంది. మంచి రేస్ స్క్రీన్ ప్లే, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్ తో వాటిని ఆశించే వారికి నిరాశ కలిగించకుండా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కొన్ని లాజికల్ ఎర్రర్స్ కూడా కనిపిస్తాయి. దర్శకుడు రాసుకున్న లైన్, కొన్ని అంశాలు తను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది కానీ ఇవి కాకుండా వేరే కొన్ని చోట్ల సీన్స్ లో లాజిక్స్ మాత్రం బలహీనంగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు సినిమా అలా యావరేజ్ గా అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కొన్ని లాజిక్స్ మెప్పించవు. కొన్ని ట్విస్ట్ లు కూడా ముందే అర్ధం అయిపోతాయి.

అలాగే రవి శంకర్ తన అన్నయ్య ఎపిసోడ్ లో పవర్ కోసం జరిగే కొన్ని సీక్వెన్స్ లు రొటీన్ గానే అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్ లో హీరోయిన్ పాత్రలో కూడా కొంచెం లాజిక్ గా పొంతన కనిపించదు. అలాగే క్లైమాక్స్ లో సీక్వెల్ కి హింట్ ఇస్తున్నట్టుగా చూపించడం కొంచెం అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ లో ఓ సాంగ్ కూడా అనవసరం అని చెప్పవచ్చు.

 

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో యూవీ కాన్సెప్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక సాంకేతిక విభాగంలో అయితే కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. చాలా సీక్వెన్స్ లలో యాక్షన్, ఎమోషన్ అయినా కూడా తన స్కోర్ తో మరింత ప్రభావవంతంగా అనిపిస్తాయి. అలాగే రాధన్ సాంగ్స్ కూడ బాగున్నాయి. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. నాచురల్ గా మంచి విజువల్స్ చూపించారు. సత్య జి ఎడిటింగ్ బాగుంది.

ఇక దర్శకుడు ప్రశాంత్ రెడ్డి విషయానికి వస్తే.. తను మంచి డెబ్యూ ఇచ్చాడు అని చెప్పవచ్చు. మెయిన్ గా తను కథనం నడిపిన విధానం మెప్పిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ తాను సినిమాని ఆవిష్కరించిన విధానంలో ఎక్కడా ఇది తన తొలి సినిమాలా అనిపించకుండా తెరకెక్కించారు. ఆ లాజికల్ ఎర్రర్స్ ని కూడా కరెక్ట్ చేసుకుంటే తన నుంచి మరిన్ని బెటర్ సినిమాలు ఆశించవచ్చు.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “భజే వాయు వేగం” టైటిల్ కి తగ్గట్టే మాంచి యాక్షన్, రేసీ గా కనిపిస్తుంది. కార్తికేయ సహా ప్రధాన తారాగణం అంతా కూడా బాగా నటించారు. మెయిన్ గా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా బాగా పికప్ అయ్యి సెకండాఫ్ కూడా మెప్పించే విధంగా కొనసాగుతుంది. యాక్షన్, మాస్ మూమెంట్స్ అలాగే తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ని ఆశించేవారికి కూడా మంచి ట్రీట్ ఇస్తుంది. కాకపోతే కొన్ని లాజిక్స్ పక్కన పెడితే మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు